SR Kalyana Mandapam Review, Rating In Telugu, Cast Details - Sakshi
Sakshi News home page

‘ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం’ మూవీ రివ్యూ

Published Fri, Aug 6 2021 2:49 PM | Last Updated on Fri, Aug 6 2021 3:31 PM

SR Kalyana Mandapam Movie Review and Rating in Telugu - Sakshi

టైటిల్‌ : ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం
నటీనటులు : కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్‌, సాయికుమార్‌ తదితరులు
నిర్మాణ సంస్థ : 
నిర్మాతలు : ప్రమోద్‌, రాజు
దర్శకత్వం:  శ్రీధర్‌ గాదె 
సంగీతం :  చైతన్‌ భరద్వాజ్‌
సినిమాటోగ్రఫీ : విశ్వాస్‌ డానియల్‌
విడుదల తేది : ఆగస్ట్‌ 6,2021

SR Kalyana Mandapam Review In Telugu: ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్‌ హీరో ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’డిఫరెంట్‌ టైటిల్‌తో వచ్చాడు. శ్రీధర్‌ గాదె దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయికుమార్‌ కీలకపాత్ర పోషించాడు. 

కథ
కడప జిల్లాకు చెందిన ధర్మ(సాయి కుమార్‌) ఒక తాగుబోతు. తండ్రి వారసత్వంగా వచ్చిన శ్రీరాజ్య లక్ష్మీ కల్యాణ మండపాన్ని (ఎస్‌.ఆర్‌. కల్యాణమండపం) నిర్వహించడంలో ఫెయిల్‌ అయి.. తాగుడుకు బానిస అవుతాడు. అతని కొడుకు కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) సిటీలో ఇంజనీరింగ్‌ చదువుతుంటాడు. అదే కాలేజీలో చదువుతున్న తన గ్రామానికి పాపారావు (శ్రీకాంత్‌ అయ్యంగర్‌)గారి అమ్మాయి సింధు(ప్రయాంక జవాల్కర్‌)తో ప్రేమలో పడతాడు. తండ్రితో మాట్లాడడానికే ఇష్టపడని కల్యాణ్‌.. సింధు ప్రేమను పొందేందుకు నానా పాట్లు పడుతుంటాడు. ఒక రోజు ఇంటి నుంచి ఫోన్‌ రావడంతో కల్యాణ్‌ తన గ్రామానికి వెళ్తాడు. కొన్ని కారణాల వల్ల పేరు మాసిపోయి, గిరాకీ తగ్గిన ఎస్‌. ఆర్‌. కల్యాణమండపం నిర్వహణ బాధ్యతలను భుజానకెత్తుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌.. కల్యాణ మండపాన్ని నడిపించాలని ఎందుకు పూనుకున్నాడు? ఎంతో చరిత్ర ఉన్న ఎస్‌.ఆర్‌. కల్యాణమండపానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రితో కల్యాణ్‌ మాట్లాడకపోవడానికి కారణమేంటి? తనంటే నచ్చని సింధు ప్రేమని కల్యాణ్‌ ఎలా పొందాడు? అనేదే మిగతా కథ.

నటీనటులు
ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ కల్యాణ్‌ పాత్రలో కిరణ్‌ అబ్బవరం ఒదిగిపోయాడు. డాన్స్‌తో పాటు ఫైట్స్‌ కూడా బాగానే చేశాడు. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా కిరణ్‌ అద్భుతంగా నటించాడు. సింధు పాత్రలో ప్రియాంక జవాల్కర్ మెప్పించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. ఇక హీరో తండ్రిగా సాయికుమార్‌ అద్భుతంగా నటించాడు. తాగుబోతు క్యారెక్టర్‌ పరకాయ ప్రవేశం చేశాడు. మరీ ముఖ్యంగా భార్యతో పడే గొడవలు, అలకలు అత్యంత సహజంగా కనిపిస్తాయి. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాపరావు పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగర్‌తో పాటు ఇతర నటీ, నటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. 

విశ్లేషణ
సినిమా కథ అంతా టైటిల్‌కు తగ్గట్టుగానే ఎస్‌. ఆర్‌. కల్యాణ మండపం చుట్టే తిరుగుతుంది. తండ్రి వారసత్వంగా వచ్చిన కల్యాణ మండపాన్ని సక్రమంగా నిర్వహించని అసమర్థ కొడకు, ఆయన చేతకాని తనాన్ని గుర్తించి, తాత ఆశయాన్ని భూజనకెత్తుకున్న మనవడి కథ ఇది. దీనికి ప్రేమను జోడించి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీధర్‌ గాదె. సెంటిమెంట్‌ పుష్కలంగా ఉన్నప్పటికీ తెరపై దాన్ని పండిచడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. తండ్రి కొడుకులు మధ్య ఉండే బలమైన ఎమోషన్స్ ని ఇంకా బాగా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. అంతేకాకుండా స్క్రిప్ట్‌ కూడా ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది. ఎంతో గొప్ప పేరు ఉన్న ఎస్‌.ఆర్‌. కల్యాణ మండపానికి ఎందుకు బుకింగ్స్‌ రావడం లేదనేదానికి బలమైన కారణాన్ని చూపించలేకపోయారు. కళ్యాణ మండపం రిజిస్టర్ లో ఒక్కసారి పేరు రాసిన తర్వాత, ఆ పెళ్ళి ఎలాగైనా జరగాల్సిందే అనే సెంటిమెంట్ కూడా పెద్దంత పండలేదు. కథలో కూడా కొత్తదనం ఏమీ ఉండదు. సెంటిమెంట్‌ సీన్స్‌ వర్కౌట్‌ అయితే సినిమా స్థాయి వేరేలా ఉండేది. సినిమా నిడివి కూడా ఎక్కువగా ఉండడం కాస్త ప్రతికూల అంశమే. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ బోరింగ్‌గా ఉన్నప్పటికీ.. క్లైమాక్స్‌లో తండ్రి, కొడుకు మధ్య వచ్చే ఎమోషన్స్‌ సీన్స్‌ కొంతమేర వర్కౌట్‌ అయ్యాయి. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం. కట్టిపడేసే పాటలతో పాటు అదిరిపోయే బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చి సినిమా స్థాయిని పెంచేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. ఎడిటింగ్‌పై బాగా దృష్టిపెట్టాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా చోట్ల ఎడిటర్‌ తన కత్తెరకు పని చెప్పాల్సింది. విశ్వాస్ డానియెల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రం నేటివిటీకి తగ్గట్టుగా చాలా సహజంగా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

ప్లస్ పాయింట్స్
కిరణ్‌ అబ్బవరం, సాయికుమార్‌, ప్రియాంక జవాల్కర్‌ నటన
చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం

మైనెస్ పాయింట్స్
రొటీన్‌ కథ
సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్‌
వర్కౌట్‌ కానీ తండ్రి, కొడుకుల ఎమోషనల్‌ సీన్స్‌

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement