Sammathame Movie Review And Rating In Telugu | Kiran Abbavaram | Chandini Chowdary - Sakshi
Sakshi News home page

Sammathame Movie Review Telugu: ‘సమ్మతమే’ మూవీ రివ్యూ

Published Fri, Jun 24 2022 12:30 PM | Last Updated on Sat, Jun 25 2022 1:12 PM

Sammathame Movie Review And Rating In Telugu - Sakshi

మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ(కిరణ్‌ అబ్బవరం) చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. దీంతో బాల్యంలోనే చాలా అడ్డంకులు ఎదుర్కొంటాడు. ఇంట్లో ఆడవాళ్లు లేకపోవడం వల్లే ఇవన్ని ఇబ్బందులని భావించిన కృష్ణ.. తల్లిలా చూసుకునే జీవిత భాగస్వామి రావాలనుకుంటాడు.

టైటిల్‌ : సమ్మతమే
నటీనటులు : కిరణ్‌ అబ్బవరం, చాందిని చౌదరి, గోపరాజు రమణ తదితరులు
నిర్మాణ సంస్థ : యూజీ ప్రొడక్షన్స్ 
నిర్మాతలు: కంకణాల ప్రవీణ
దర్శకత్వం : గోపినాథ్ రెడ్డి
సంగీతం :శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ :సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్‌ : విప్లవ్ నైషధం 
విడుదల తేది :జూన్‌ 24,2022

Sammathame Movie Review In Telugu
 
కొంతమంది హీరోలు తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకుంటారు.అలాంటి వారిలో కిరణ్‌ అబ్బవరం ఒకరు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించాడు. ఆ వెంటనే ఎస్.ఆర్.కళ్యాణమండపం, సెబాస్టియన్‌ చిత్రాలతో అలరించాడు. తాజాగా ఈ యంగ్‌ హీరో ‘సమ్మతమే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘సమ్మతమే’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జూన్‌ 24) విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.   

Sammathame Movie Cast And Rating

కథేంటంటే..
మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ(కిరణ్‌ అబ్బవరం) చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. దీంతో బాల్యంలోనే చాలా అడ్డంకులు ఎదుర్కొంటాడు. ఇంట్లో ఆడవాళ్లు లేకపోవడం వల్లే ఇవన్ని ఇబ్బందులని భావించిన కృష్ణ.. తల్లిలా చూసుకునే జీవిత భాగస్వామి రావాలనుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక భార్యనే ప్రేమించాలని భావిస్తాడు. అయితే తనకు కాబోయే భార్య మాత్రం పద్దతిగా, అబద్దాలు చెప్పకుండా ఉండాలనుకుంటాడు.

ఇలాంటి వ్యక్తి.. తనకు పూర్తి వ్యతిరేకమైన శాన్వీ(చాందిని చౌదరి)తో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను ఎలాగైన తన పద్దతిలోకి తెచ్చుకోవాలనుకుంటాడు. శాన్వీ కూడా కృష్ణని ప్రేమిస్తుంది. కానీ అతని అతిప్రేమ తట్టుకోలేకపోతుంది. దీంతో ఇద్దరి మధ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిని కృష్ణ ఎలా పరిష్కరించుకున్నాడు? అసలు పెళ్లికి ముందు ఎవరిని ప్రేమించను అని చెప్పిన కృష్ణ.. శాన్వీ ప్రేమలో ఎలా పడ్డాడు? తన అతిప్రేమతో శాన్వీని ఎలా ఇబ్బంది పెట్టాడు? చివరకు శాన్విని కృష్ణ పెళ్లి చేసుకున్నాడా లేదా? అనేది మిగతా కథ. 

Sammathame Movie Stills

ఎలా ఉందంటే..?
పెళ్లి చేసుకునే ప్రతి యువకుడు తనకు కాబోయే భార్య ఇలా ఉండాలి..అలా ఉండాలని అనుకుంటారు. కన్నవాళ్లని వదులుకొని వచ్చిన భార్యకు ఆంక్షలు విధిస్తారు. అది తన భార్యపై తనకున్న ప్రేమ అని భావిస్తారు. కానీ ఆ ఆంక్షల వల్ల అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడుతుంది? పాతికేళ్లు తనకు నచ్చినట్లుగా బతికే అమ్మాయి.. పెళ్లి తర్వాత భర్తకు నచ్చినట్లుగా ఉండాలనడం ఎంతవరకు సమంజసం?  తనకంటూ ఓ జీవితం ఉంటుంది కదా? ఇదే విషయాన్ని ‘సమ్మతమే’చిత్రం ద్వారా తెలియజేశాడు దర్శకుడు గోపినాథ్ రెడ్డి. డైరెక్టర్‌ ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటికీ...కథనం మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

సినిమా మొత్తం కృష్ణ, శాన్వీల చుట్టే తిరుగుతుంది. ప్రతిసారి కండీషన్స్‌ పెట్టడం.. అనుమానించడం..చివరకు సారీ చెప్పడం.. కథంతా ఇలానే సాగుతుంది. కృష్ణ హైదరాబాద్‌కు రావడం..శాన్వీని ప్రేమించడం.. తనకు నచ్చే విధంగా మార్చుకోవాలనుకోవడం..ఇలా సోసోగా ఫస్టాఫ్‌ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథంతా సాగదీసినట్లుగా ఉంటుంది. కృష్ణ, శాన్వీల మధ్య ప్రేమ, గొడవలు..సారీలు చెప్పుకోవడం ఇలానే సాగుతుంది. కృష్ణ సంఘర్షనకు అసలు అర్థమే లేదనిపిస్తుంది. ఎలాంటి ట్విస్టులు లేకుండా కథంతా నీరసంగా సాగుతుంది. క్లైమాక్స్‌ కూడా రొటీన్‌గా ఉంటుంది. అయితే చివరల్లో గోపరాజు రమణ చెప్పే డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. చివరగా ఇది సాధారణ ప్రేమ కథే అయినప్పటికీ.. దర్శకుడి ఇచ్చిన సందేశానికి మాత్రం సమ్మతం తెలుపాల్సిందే.

Kiran Abbavaram And Chandini Chowdary

ఎవరెలా చేశారంటే..
కృష్ణ పాత్రలో కిరణ అబ్బవరం చక్కగా నటించాడు. నేటి తరం యువకులకు ప్రతి రూపంగా అతని పాత్ర ఉంటుంది. అయితే సినిమా మొత్తం ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో నటించడం కాస్త మైనస్‌. ఇక శాన్వీగా చాందిని చౌదరి అదరగొట్టేసింది. తెరపై అందంగా కనిపించడమే కాకుండా.. మోడ్రన్‌ అమ్మాయిగా తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తండ్రిగా గోపరాజు రమణ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. కథంతా కిరణ్‌, శాన్వీ పాత్రలే తిరిగినా...క్లైమాక్స్‌లో మాత్రం గోపరాజు రమణ చెప్పే డైలాగ్స్‌ ప్రేక్షకుడికి అలా గుర్తిండిపోతాయి.

సెకండాఫ్‌లో సప్తగిరి తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. శివ నారాయణ, అన్నపూర్ణమ్మ, సద్దాం తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం శేఖర్ చంద్ర సంగీతం. పాటలతో అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. కథకు అనుగుణంగా పాటలు వస్తాయి. ఎక్కడా ఇరికించినట్లు అనిపించదు..అలా అని గుర్తిండిపోయే పాటలు కూడా కాదు. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ విప్లవ్ నైషధం తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement