టైటిల్: రూల్స్ రంజన్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు
నిర్మాణ సంస్థ : స్టార్‌లైట్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు : దివ్యాంగ్ లావనియా, మురళీ కృష్ణ వేమూరి
దర్శకత్వం: రత్నం కృష్ణ
సమర్పణ : ఏఎం రత్నం
సంగీతం: అమ్రీష్
విడుదల తేది: అక్టోబర్ 06, 2023
ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ, సరైన హిట్ పడడం లేదు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ‘రూల్స్ రంజన్’ చేశాడు. నేహా శెట్టి హీరోయిన్. ‘సమ్మోహణుడా’ అనే ఒకే ఒక పాట..ఈ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు (అక్టోబర్ 06) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడా? లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
తిరుపతికి చెందిన మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన సహోద్యోగులంతా అతనితో ఆడుకుంటారు. దీంతో మనో రంజన్ అలెక్సా సహాయంతో హిందీ నేర్చుకుంటారు. ఓ సారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్‌తో సహా అంతా మనో రంజన్‌పై ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్‌తో సహా మిగతా ఉద్యోగులంతా చేస్తారు. తను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా నాలుగేళ్లు గడిచిన తర్వాత.. తనకు సన(నేహా శెట్టి) పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్‌గా ఎందుకు మారాడు? సన కోసం విలేజ్‌కి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు సన, రంజన్ ఎలా కలిశారనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీని కంటే ముందు హీరో క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక మనో రంజన్ కాస్త రూల్స్ రంజన్‌గా ఎలా మారాడు అనేదే కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాల్టీకీ చాలా దూరంగా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా ముంబైలో సాగితే.. సెకండాఫ్ విలేజ్‌కి షిఫ్ట్ అవుతుంది.
అక్కడ హైపర్ ఆది, సుదర్శన్, హర్షలతో వచ్చే కామెడీ సీన్స్ కాస్త వినోదాన్ని పంచుతాయి. కానీ ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలా నిట్టూర్పుగా ఉన్న ప్రేక్షకులకు ‘సమ్మోహనుడా’ సాంగ్ ఎనర్జీని ఇస్తుంది. ఈ సినిమాకు ఈ పాట చాలా ప్లస్ అయిందని చెప్పాలి. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. దర్శకుడు కథలను మరింత బలంగా రాసుకొని ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
మనోరంజన్ పాత్రకి కిరణ్ అబ్బవరం న్యాయం చేశాడు. అయితే ఈ తరహా పాత్రలు అతనికి కొత్తేమి కాదు. గత సినిమాల మాదిరే అమాయకపు మాటలతో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. కిరణ్ పాత్ర తీరు.. డైలాగ్స్.. అన్నీ గత సినిమాలను గుర్తు చేస్తాయి. సనగా నటించిన నేహాశెట్టి తెరపై చాలా అందంగా కనిపించింది. బి గ్రేడ్ సినిమాల కో-డైరెక్టర్‌గా వెన్నెల కిషోర్ కామెడీ వర్కౌట్ కాలేదు. హీరో చిన్ననాటి స్నేహితులుగా హైపర్ ఆది, హర్ష, సుదర్శన్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. అమ్రీష్ సమకూర్చిన పాటల్లో ‘సమ్మోహనుడా’ ఒక్కటే బాగుంది. మిగతావి అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువసు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
- రేటింగ్: 2.25/5
Comments
Please login to add a commentAdd a comment