sridher
-
దసరా కానుక: ఒక్కో కార్మికుడికి రూ.1.15 లక్షలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ కార్మికులకు ప్రకటించిన 29 శాతం లాభాల బోనస్ సొమ్మును ఈ నెల 11న చెల్లించనున్నట్టు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని కింద రూ.79.07 కోట్లను కార్మికులకు పంపిణీ చేస్తామన్నారు. అలాగే ఇటీవల ప్రకటించిన దీపావళి బోనస్ (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ బోనస్)ను నవంబర్ 1న కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇందుకోసం సంస్థ రూ.300 కోట్లను వెచ్చిస్తోందని, ప్రతి కార్మికుడు రూ.72,500 అందుకోనున్నాడని వివరించారు. ఇక పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేల చొప్పున సంస్థ ప్రకటించిందని, ఈ డబ్బును ఈ నెల 8వ తేదీన చెల్లించనుందని పేర్కొన్నారు. పై రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్ కలిపి కార్మికులు సగటున రూ.1.15 లక్షల వరకు రానున్న మూడు వారాల్లో అందుకోనున్నారని తెలిపారు. ఈ మొత్తాన్ని దుబారా చేయకుండా వినియోగించుకోవాలని, పొదుపు చేయడం లేదా గృహావసరాలకు వాడుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో మరింతంగా ఉత్సాహంగా, కలిసికట్టుగా పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని, తద్వారా ఈ ఏడాది మరింత మెరుగైన బోనస్‌లు, సంక్షేమం అందుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికులకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చదవండి: సాగర్‌ను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్లు -
సీఐకి షాకిచ్చిన కానిస్టేబుల్
బనశంకరి : విధులకు ఆలస్యంగా హాజరైనందుకు కారణం చెప్పాలని నోటీస్ ఇచ్చిన జయనగర పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యర్రిస్వామికి కానిస్టేబుల్ శ్రీధర్‌గౌడ ఇచ్చిన సమాధానం పోలీస్‌శాఖలో తీవ్రచర్చకు దారితీసింది. జయనగర పోలీస్‌స్టేషన్‌లో 5 మంది గస్తీ సిబ్బంది నిత్యం విధులకు ఆలస్యంగా వస్తున్నారని సీఐ వారికి నోటీసులు అందించారు. ఈ నోటీసులకు కానిస్టేబుల్ శ్రీధర్‌గౌడ సీఐ వ్యవహారశైలిని ప్రస్తావిస్తూ ఘాటుగా లేఖ రాయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే.. ‘మీ మాదిరిగా ఉదయం సుఖసాగర్ లేదా యుడి హోటల్లో టిఫిన్, మధ్యాహ్నం ఖానావళిలో భోజనం, రాత్రి ఎంపైర్‌లో భోజనం, మిలనోలో ఐస్‌క్రీం తిన్న తరువాత పోలీస్‌స్టేషన్ పైన ఉన్న గదిలో నివాసం ఉండేట్లయితే నేను కూడా ఉదయం తీరిగ్గా విధులకు హాజరయ్యేవాణ్ని. కానీ నాకు వయసు మీదపడిన తల్లిదండ్రులు, పోలీస్‌శాఖలో పనిచేసే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఆలనపాలన చూసిన అనంతరం పోలీస్‌స్టేషన్‌కు రావడం ఆలస్యమౌతుంది. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేదు’ అని శ్రీధర్‌గౌడ సమాధానమిచ్చారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారుల స్పందన ఎలా ఉంటుందోనని కుతూహలం నెలకొంది. -
ఎస్‌సీసీఎల్‌కి మరో ప్రతిష్టాత్మక అవార్డు
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అమెరికాకు చెందిన బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు 2018 సంవత్సరానికిగానూ ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డుకు ఎస్‌సీసీఎల్‌ని ఎంపిక చేశారు. అద్భుతమైన వృద్ధిరేటుతోపాటూ అసాధారణమైన పనితీరుతో సింగరేణి కాలరీస్‌ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. మార్చి 8న ముంబైలో లీలా హోటల్ లో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఎన్ . శ్రీధర్ ను బెర్క్ షైర్ మీడియా సీఈవో హేమంత్ కౌశిక్ , వైస్ ప్రసిడెంట్ ఎమిలీ వాల్ష్ ఆహ్వానించారు. SCCL Wins prestigious " India's best company award ", awarded by US consultancy firm Berkshire Media https://t.co/7rGutPG6rw, for its amazing growth rate and extraordinary performance. pic.twitter.com/ibfj447paA — Singareni Public Relations (@PRO_SCCL) February 15, 2019 -
తెలంగాణ సామాజిక అంశంపై చిత్రం
‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సినిమా రంగంలో మార్పులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సినిమా అభివృద్ధి చెందాలి. తెలుగు సినిమాల్లో తెలంగాణ పరిమళాలు పరిపూర్ణంగా వెదజల్లాలి’’ అని దర్శక–నిర్మాత అల్లాణి శ్రీధర్ అన్నారు. ‘కొమరంభీమ్’ చిత్రంతో ఆయన జాతీయ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నేడు అల్లాణి శ్రీధర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చేపట్టిన ఉద్యమం విజవంతమైంది. రాష్ట్ర సామాజిక, రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటీ? అన్న సామాజిక అంశంపై ఒక ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీని ప్లాన్ చేస్తున్నాం. ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర జలవనరుల చైర్మన్ వి. ప్రకాశ్ ఓ పరిశోధనాత్మక కథ రాశారు. ఈ కథతో సినిమా తీయనున్నాను. అలాగే తెలుగులో 50 రోజులాడిన ‘చిలుకూరు బాలాజీ’ చిత్రాన్ని ‘బాలాజీ మందిర్’ పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నాం. ఈ చిత్రానికి కూడా దర్శకుడిని నేనే. ఓ ప్రముఖ బ్యానర్లో దర్శకుడిగా ఓ సినిమా కమిట్ అయ్యా’’ అన్నారు. గతేడాది జరిగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో తాను తీసిన ‘డూడూ డీడీ’ ప్రదర్శి తమైందని, ‘సమక్క–సారక్క’ జాతరపై తీసిన డాక్యుమెంటరీకి ఫ్రాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో అభినందనలు లభించడం ఆనందం’’ అని అన్నారు అల్లాణి. -
శంభో... ట్రైలర్ అదిరింది
శంకర్ హీరోగా శ్రీధర్ ఎన్. దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శంభో శంకర’. ఆర్.ఆర్. పిక్చర్స్ సంస్థ, ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో వై.రమణా రెడ్డి, సురేశ్ కొండేటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో సెకండ్ సాంగ్‌ను హీరో విశాల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘ఫస్ట్ నాకీ సినిమా టైటిల్ బాగా నచ్చింది. ట్రైలర్ అదిరింది. గతంలో శంకర్ నటించిన రెండు మూడు సినిమాలు చూశాను. అప్పటికీ ఇప్పటికీ తనలో చాలా చేంజ్ కనిపిస్తోంది. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ పాట చాలా నచ్చింది. సాయి కార్తీక్ మ్యూజిక్ బావుంది. సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘విశాల్ గారు పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు శంకర్. శ్రీధర్ మాట్లాడుతూ – ‘‘విశాల్‌గారు రిలీజ్ చేసినది హీరో ఇంట్రడక్షన్ సాంగ్. భాను మాస్టర్ నేతృత్వంలో ఈ పాటను భారీగా చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత రమణా రెడ్డి. -
సంక్రాంతికి మినహాయింపు
ఇలా అండర్‌స్టాండింగ్‌కి రావడానికి ఏర్పాటైన సమావేశంలో ఆ రెండు చిత్రాల నిర్మాతలతో పాటు నిర్మాత ‘దిల్’ రాజు, కె.ఎల్ నారాయణ పాల్గొన్నారు. ‘‘రెండు భారీ చిత్రాల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలని మాట్లాడుకున్నాం. అందుకే ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని ఏప్రిల్ 20న, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని మే 4న రిలీజ్ చేయాలని నిర్ణయించాం. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలన్న అభిప్రాయంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేసిన మా హీరోలు, దర్శకులకు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాతలు డివీవీ దానయ్య, లగడపాటి శ్రీధర్, ‘బన్నీ’ వాసు. ‘‘సంక్రాంతి సీజన్‌ను మినహాయించి మిగిలిన సందర్భాల్లో రెండు భారీ చిత్రాల మధ్య ఇలా రెండు వారాల గ్యాప్ ఇచ్చి రిలీజ్ డేట్స్ ప్లాన్ చేయడం వల్ల పరిశ్రమకు ఎంతో మేలు జరగుతుంది. ‘భరత్ అనే నేను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల నిర్మాతల మధ్య మంచి అండర్స్టాండింగ్ కుదరడం శుభపరిణామంగా భావిస్తున్నాం’’ అన్నారు నాగబాబు. ఏప్రిల్ 20న ‘భరత్ అనే నేను’, ఆరు రోజుల గ్యాప్ తర్వాత 27న ‘కాలా’, ఆ నెక్ట్స్ వీక్ మే 4న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వస్తాయి. ఎలాగూ ఏప్రిల్ 5న నితిన్ ‘ఛల్ మెహన్రంగ’, ఏప్రిల్ సెకండ్ వీక్‌లో నాని ‘కృష్ణార్జున యుద్ధం’ వచ్చేస్తాయి. అటు ఆ రెండు సినిమాలకూ.. ఆ తర్వాత విడుదల కానున్న సినిమాలకూ మధ్య గ్యాప్ రావడంతో ఏప్రిల్ వార్ వేడి తగ్గింది. -
'వారసత్వం'పై చర్చలు అసంపూర్తి?
గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో విధివిధానాలపై బుధవారం హైదరాబాద్‌లో చర్చలు జరిగాయి. హైదరాబాద్‌లో సీఎం క్యాంపు ఆఫీస్‌లో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, సింగరేణి మాజీ సీఅండ్ఎండీ నర్సింగరావు ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ప్రస్తుత సీఅండ్ఎండీ శ్రీధర్, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్, మాజీ ఎంపీ వివేక్ చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన మేరకు సింగరేణి కార్మికులకు వన్‌టైం సెటిల్మెంట్ కింద కాలపరిమితి విధించకుండా, షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నాయకులు సీఎండీని కోరారు. అయితే ఇందుకు ఆయన ససేమిరా అంటూ 1981 నుంచి 1998 వరకు కార్మికుడి రెండేళ్ల సర్వీస్‌ను సంస్థకు వదిలిపెట్టిన వారికే ఈ పథకాన్ని అమలుపర్చారని, ప్రస్తుతం కూడా ఆ విధంగానే వ్యవహరించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సర్వీస్‌తో సంబంధం లేకుండా, షరతులు విధించకుండా వారసత్వ ఉద్యోగాలు ఇస్తే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. ఈ సమావేశంలోనే వీఆర్ఎస్ కార్మికులకు ఉద్యోగావకాశాలపై చర్చించారు. వీఆర్ఎస్ కార్మికుల వారసులకు ఉద్యోగానికి బదులు రూ.2 లక్షలు సంస్థ ముట్టజెప్పిందని, దీనిపై యూనియన్‌తో ఒప్పందం జరిగిందని, అలాగే డిస్మిస్ కార్మికులకు కూడా మూడుసార్లు అవకాశం కల్పించామని, ఇక వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేమని సింగరేణి సీఎండీ స్పష్టం చేసినట్టు తెలిసింది. వారసత్వ ఉద్యోగాల విషయంలో నిర్ణయించే కాలపరిమితిపై మరోసారి ఆలోచించాలని నేతలు కోరారు. గురువారం కూడా ఈ విషయమై మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 4న జరగనున్న సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో విధివిధానాలు ప్రకటించే అవకాశాలున్నాయి.