'వారసత్వం'పై చర్చలు అసంపూర్తి?
గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో విధివిధానాలపై బుధవారం హైదరాబాద్‌లో చర్చలు జరిగాయి. హైదరాబాద్‌లో సీఎం క్యాంపు ఆఫీస్‌లో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, సింగరేణి మాజీ సీఅండ్‌ఎండీ నర్సింగరావు ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ప్రస్తుత సీఅండ్‌ఎండీ శ్రీధర్, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్, మాజీ ఎంపీ వివేక్ చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన మేరకు సింగరేణి కార్మికులకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద కాలపరిమితి విధించకుండా, షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నాయకులు సీఎండీని కోరారు. అయితే ఇందుకు ఆయన ససేమిరా అంటూ 1981 నుంచి 1998 వరకు కార్మికుడి రెండేళ్ల సర్వీస్‌ను సంస్థకు వదిలిపెట్టిన వారికే ఈ పథకాన్ని అమలుపర్చారని, ప్రస్తుతం కూడా ఆ విధంగానే వ్యవహరించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సర్వీస్‌తో సంబంధం లేకుండా, షరతులు విధించకుండా వారసత్వ ఉద్యోగాలు ఇస్తే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు.
ఈ సమావేశంలోనే వీఆర్‌ఎస్ కార్మికులకు ఉద్యోగావకాశాలపై చర్చించారు. వీఆర్‌ఎస్ కార్మికుల వారసులకు ఉద్యోగానికి బదులు రూ.2 లక్షలు సంస్థ ముట్టజెప్పిందని, దీనిపై యూనియన్‌తో ఒప్పందం జరిగిందని, అలాగే డిస్మిస్ కార్మికులకు కూడా మూడుసార్లు అవకాశం కల్పించామని, ఇక వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేమని సింగరేణి సీఎండీ స్పష్టం చేసినట్టు తెలిసింది. వారసత్వ ఉద్యోగాల విషయంలో నిర్ణయించే కాలపరిమితిపై మరోసారి ఆలోచించాలని నేతలు కోరారు. గురువారం కూడా ఈ విషయమై మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 4న జరగనున్న సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో విధివిధానాలు ప్రకటించే అవకాశాలున్నాయి.