వారసత్వం మళ్లీ సొంతం
వారసత్వం మళ్లీ సొంతం
Published Sat, Oct 8 2016 2:54 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
ముఖ్యమంత్రి ప్రకటనతో కార్మికుడి బిడ్డగా గర్వపడుతున్నా..
ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు
ఘన స్వాగతం పలికిన టీబీజీకేఎస్ శ్రేణులు
మందమర్రి నుంచి రామకృష్ణాపూర్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ
మందమర్రి : ఏళ్లుగా సింగరేణి కార్మికులు ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగ ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన యావత్తు సింగరేణికి, కార్మికవర్గానికి ఎంతో సంతోషాన్నిచ్చిందని బతుకు నమ్మకాన్ని కలిగించిందని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన చర్చల్లో పాల్గొని శుక్రవారం సాయంత్రం మందమర్రికి వచ్చిన ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలును టీబీజీకేఎస్ నాయకులు స్థానిక బస్టాండ్ ప్రాంతంలో ఘన స్వాగతం పలికారు. పెట్రోల్ బంక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సెంటర్‌కు చేరుకోగా, విప్ ఓదేలు కార్మికులను, యూనియన్ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి గత వైభవం తీసుకురావాలనే ఆకాంక్ష బలంగా ఉండేదని తెలిపారు. వలస పాలకుల పాలనలో సింగరేణి ఛిద్రమైందని, దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డగా తనపై ఉందని కేసీఆర్ భావించే వారని ఆయన అన్నారు.
కేసీఆర్ ప్రకటించిన వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ ప్రకటనతో సింగరేణి కొంగు బంగారంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి పరిసర ప్రాంత గ్రామాలు, అతిపెద్ద పారిశ్రామిక నగరాలుగా విలసిల్లుతాయని ఆయన తెలిపారు. అనంతరం సుమారు వెయ్యి మోటారు వాహనాలతో భారీ ర్యాలీగా రామకృష్ణాపూర్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, నాయకులు జె.రవీందర్, ఎస్.ప్రభాకర్, కాంపెల్లి సమ్మయ్య, దాసరి రామన్న, లక్ష్మణ్, అన్ని గనుల డిపార్ట్‌మెంట్‌ల ఫిట్ కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.
Advertisement