అంతా గోప్యమే..
► అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా అంతరిక్ష కేంద్రం
► బయటకు పొక్కనీయకుండా అధికారుల జాగ్రత్తలు
► ఇదే అదునుగా రెచ్చిపోతున్న కొందరు
► షార్ ప్రతిష్టకే మచ్చ తెస్తున్న ఘటనలు
శ్రీహరికోట(సూళ్లూరుపేట) : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది. తరచుగా చోటు చేసుకుంటున్న ఏదో ఒక ఘటనతో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన శ్రీహరిపేట పేరుప్రతిష్టలు చిన్నబోతున్నాయి. ఇలాంటి ఘటనల మీద ఘాటుగా స్పందించాల్సిన పరిపాలనా యంత్రాంగం బయటకు పొక్కనీయకుండా రహస్యంగా ఉంచడంతో ఎవరికీ భయం లేకుండా పోతోంది. ఇక్కడ జరుగుతున్న అనేక ఘటనలను విచారణ పేరుతో అధికారులే గోప్యంగా వుంచుతున్నారు. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రీయ విద్యాలయం లో విద్యార్థినులతో కొందరు ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించడం అలవాటైపోయింది.
గతంలో ఈ స్కూ ల్లో ఇదే తరహాలోనే ఎన్నో ఘటనలు జరిగాయి. అప్పట్లో జరిగిన ఘటనలను తేలికగా తీసుకుని ఇంక్రిమెంట్ కటింగ్‌తో సరిపెట్టడంతో వేధింపులు, వెకిలిచేష్టలు పునరావృతమవుతున్నాయి. వారితో ఎదురవుతున్న బా ధలను ఎవరికీ చెప్పుకోలేక విద్యార్థినులు లోలోపల కుమిలిపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఉపాధ్యాయుల చేష్టలు పరాకాష్టకు చేరడంతో బాధిత విద్యార్థినులు తల్లిదండ్రుల వద్ద గొల్లుమన్నారు. వారు ఈ ఘటనలపై రెండు రోజుల క్రితం షార్ కంట్రోలర్ జేవీ రాజారెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఆయన లలితకుమారితో మహిళా వేధింపుల నిరోధక కమిటీ వేసి నివేదిక కోరారు. ఆమె నేతృత్వం లో జరిగిన విచారణలో ఉపాధ్యాయులు దార్భజీ, కృష్ణప్రసాద్, షణ్ముగనాథన్, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు సుధీర్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. విచారణ నివేదికను ఆమె గురువారం షార్ కంట్రోలర్‌కు సమర్పించగా నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి పక్కన పెట్టారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని కంట్రోలర్ రాజారెడ్డి తెలిపారు.
కఠినమైన చర్యలు లేకనే
గతంలోనూ షార్‌లో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ప్రాజెక్ట్‌లు చేయడం కోసం వచ్చే ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థినులతోనూ అసభ్యంగా ప్రవర్తించిన దాఖలాలున్నా యి. అయితే ఘటనకు కారకులైన వారిపై కఠినచర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ యథాప్రకారం చెలరేగిపోతున్నారు. తప్పు చేసిన వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తే మరొకరు అదే తప్పు చేసేందుకు వెనకడుగు వేస్తారని షార్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
ప్రిన్సిపల్‌కు మెమో
అంతరిక్ష కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్‌కు శుక్రవారం షార్ పరిపాలనా విభాగం అధికారులు మెమో ఇచ్చినట్లు సమాచారం. స్కూలులో విద్యార్థినులపై వేధింపులు జరుగుతుంటే ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడాన్ని క్రమశిక్షణరాహిత్యంగా భావించినట్లు తెలిసింది.