గౌరి హత్య వెనుక సంఘ్ హస్తం
♦ మావోయిస్టుల ప్రమేయం లేదు
♦ మాజీ మావోయిస్టులు సిరిమనె నాగరాజు, నూర్ శ్రీధర్
శివాజీనగర :
సీనియర్ పాత్రికేయురాలు, సామాజికకర్త గౌరీ లంకేశ్‌ను మావోయిస్టులు ఎట్టి పరిస్థితిలోను హత్య చేయటానికి అవకాశమే లేదని మాజీ మావోయిస్టులు సిరిమనె నాగరాజు, నూర్ శ్రీధర్ స్పష్టం చేశారు. సోమవారం వారు ఇక్కడ విలేకరులతో మాట్లాడు తూ...మావోయిష్టులు ఏనాడు పోరాటదారులు, సాహితీవేత్తలను, సమాజ సేవకులను అంతం చేసే సాహసానికి ఒడిగట్టిన నిదర్శనాలు లేవని, ఉద్యమకారులకు అండగా నిలిచే మావోయిస్టులు ఓ పాత్రికేయురాలైన గౌరి లంకేశ్‌ను హత్య చేయరని సిరిమనె నాగరాజు స్పష్టం చేశారు. నక్సలైట్లతో గౌరి లంకేశ్‌కు ఎలాంటి విభేదాలు లేవని, ఈ హత్య వెనుక సంఘ్ పరివార్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. మావోయిష్టులు మాఫియా గ్యాంగ్ కాదని, అదొక క్రమశిక్షణతో కూడిన రాజకీయ పార్టీ అని, దానికి ఒక ప్రణాళిక ఉందని తెలిపారు.
నియమాలకు అనుగుణంగా ఆ పార్టీ పని చేస్తుందని, ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన ప్రతి ఒక్కరి అభిప్రాయం మేరకే నిర్ణయాలు ఉంటాయన్నారు. దేశంలో మావోయిస్టులు పాత్రికేయులను హత్య చేసిన సంఘటనలు లేవని, అదే విధంగా అధికారులను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిదర్శనాలు లేవని స్పష్టం చేశారు. ఈ విధమైన విధానాలను అనుసరిస్తున్న మావోయిస్టులు గౌరి లంకేశ్‌ను హత్య చేయటానికి ఒడిగట్టరన్నారు. దర్యాప్తు తప్పుదారి పట్టించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 12న నగరంలో సాహితీవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, పోరాట నాయకులు సమావేశం జరుపనున్నట్లు ఆయన తెలిపారు.