నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
బన్స్కా బిస్ట్రికా: దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో(59) పరిస్థితి విషమమే అయినప్పటికీ నిలకడగా ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆయనతో గురువారం మాట్లాడినట్లు ఎన్నికైన అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీ చెప్పారు. ఫికో ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రధాని ఫిగోకు ఐదు గంటలపాటు ఆపరేషన్ చేసినట్లు బన్స్కా బిస్ట్రికాలోని ఎఫ్డీ రూజ్వెల్ట్ హాస్పిటల్ డైరెక్టర్ మిరియమ్ లపునికోవా గురువారం చెప్పారు. విషమమే అయినప్పటికీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇలా ఉండగా, ప్రధాని ఫికోపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి(71) ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేనట్లుగా తేలిందని ఇంటీరియర్ మంత్రి మటుస్ సుటాజ్ ఎస్టోక్ తెలిపారు. ప్రధానిపై హత్యాయత్నం రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు. ఫికో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు అతడు తెలిపాడన్నారు. కవి కూడా అయిన నిందితుడు గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అతడి పేరు, ఇతర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. బుధవారం హండ్లోవా పట్టణంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఫికోపై దుండగుడు తుపాకీతో పలుమార్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ చోటుచేసుకున్న ఈ ఘటన యూరప్ వ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ఉక్రెయిన్‌కు అనుకూలంగా వ్యవహరించిన స్లొవాకియా అనంతరం రష్యా అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా పలు చర్యలు తీసుకుంది. ఫికో రాజకీయ ప్రత్యర్థి, మరికొద్ది రోజుల్లో పదవిని వీడనున్న అధ్యక్షురాలు జుజానా కపుటోవా గురువారం రాజధాని బ్రాటిస్లావాలో మీడియాతో మాట్లాడు తూ.. ‘సమాజంలో పెరుగుతున్న విద్వేషాలకు నిదర్శనం ఈ ఘటన. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి దేశంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తాం’అని తెలిపారు. ఈ సమయంలో ప్రతి పౌరుడూ బాధ్యతగా మెలగాలని ఆమె కోరారు.