Startup Policy
-
నాటి స్టార్టప్ వెలుగులకు కితాబు
సాక్షి, అమరావతి : గత ఐదేళ్లలో స్టార్టప్ రంగంలో రాష్ట్రం వేగంగా దూసుకుపోయిన విధానాన్ని నారా లోకేశ్ మంత్రిగా నిర్వహిస్తున్న ఐటీ శాఖ తాజాగా విడుదల చేసిన స్టార్టప్ పాలసీలో ప్రముఖంగా ప్రస్తావించింది. వచ్చే ఐదేళ్లలోనూ స్టార్టప్‌లను ప్రోత్సహించేలా ఏపీ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 4.0ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గత ఐదేళ్లలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో 50 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే ఏర్పాటయ్యాయని.. రాష్ట్రంలో మొత్తం 6,600 స్టార్టప్స్ ఏర్పాటు కాగా, అందులో 2,400 స్టార్టప్‌లకు డీపీఐఐటీ గుర్తింపు లభించిందని కూటమి ప్రభుత్వం విడుదల చేసిన పాలసీలో పేర్కొంది. అంతే కాకుండా డీపీఐఐటీ గుర్తించిన స్టార్టప్‌లలో 1,159 స్టార్టప్‌లు మహిళల నేతృత్వంలో ఉన్నాయని చెప్పింది. ఇది రాష్ట్రంలో పారిశ్రామికీకరణ అన్ని వర్గాల్లో ఎంత బలంగా విస్తరించిందన్న విషయాన్ని ధృవీకరిస్తోందని పేర్కొంది. డీపీఐఐటీ విడుదల చేసిన 2022 స్టార్టప్ ర్యాంకుల్లో రాష్ట్రం “లీడర్’షిప్ హోదా దక్కించుకుందని, వరుసగా మూడేళ్లుగా సులభతర వాణిజ్యంలో మొదటి ర్యాంకును పొందుతూ వ్యాపారానికి ఏపీ అత్యంత అనువైన రాష్ట్రంగా నిలిచిందని ప్రశంసించింది. రాష్ట్రంలో 46 ఇంక్యుబేటర్స్ ఉండటమే కాకుండా కీలకమైన ఐవోటీ–ఏఐ, ఇండస్ట్రీ 4.0, బయోటెక్, మెడికల్ డివైసెస్, మారిటైమ్ అండ్ షిప్పింగ్, రూరల్ ఇన్నోవేషన్ సెంటర్ పేరుతో ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. ఇదీ స్టార్టప్ పాలసీ 4.0 లక్ష్యం » వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 20 వేల స్టార్టప్‌ల ఏర్పాటు లక్ష్యంగా ఏపీ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 4.0 విడుదల. »హబ్ అండ్ స్పోక్ మోడల్లో స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పాటు ద్వారా లక్షల మందికి ఉపాధి. »కొత్తగా 10 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు, 20 సూని కార్నర్స్, 10 యూనీ కార్నర్స్ ఏర్పాటు. »కీలకమైన 15 డిపార్ట్మెంట్లలో స్టార్టప్‌లకు ప్రోత్సాహం. రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపు. »అమరావతి కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) ఏర్పాటు.. దీనితో అనుసంధానం చేస్తూ ఐదు ప్రాంతాల్లో స్పోక్ సెంటర్లు. ఐదేళ్లల్లో స్టార్టప్‌లకు నిధులు సమకూర్చేలా ఆర్టీఐహెచ్కు రూ.250 కోట్లు, ప్రతి స్పోక్ సెంటర్‌కు రూ.100 కోట్ల గ్రాంట్ బడ్జెట్. »ఎంపికైన ప్రతి కాన్సెప్‌్టకు రూ.2 లక్షల ప్రారంభ గ్రాంట్.. దశల వారీగా రూ.15 లక్షల వరకు.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకైతే రూ.20 లక్షల వరకు గ్రాంట్.. 8 శాతం వడ్డీ రాయితీ, రూ.50 లక్షల చొప్పున సీడ్ ఫండింగ్, మార్కెటింగ్ సపోర్ట్.. »ఈవెంట్స్‌కు వెళ్లినప్పుడు అయ్యే ఖర్చులో 75 శాతం.. గరిష్టంగా రూ.3 లక్షలు అందజేత. ఐదేళ్లు ఎస్‌జీఎస్‌టీపై 100 శాతం రీయింబర్స్మెంట్. »వేగంగా అనుమతులు మంజూరు చేసేలా ఏపీ స్టార్టప్ వన్ పోర్టల్ ఏర్పాటు. సార్టప్ పాలసీ సేŠట్ట్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్న ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ.. త్వరలోనే ఆపరేషనల్ గైడ్‌లైన్స్ విడుదల. -
స్టార్టప్ పాలసీ పర్యవేక్షణకు కమిటీ
సరికొత్త స్టార్టప్ పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కామర్స్ సెక్రటరీ నేతృత్వంలో ఏర్పాటు చేసే ఈ కమిటీలో ఎలక్ట్రానిక్స్‌లోని పలువురు అధికారులను సభ్యులుగా చేర్చింది. ఐటీ విభాగం కార్యదర్శి ప్రద్యుమ్న ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేశారు. రాష్ట్రంలో 100 ఇంక్యుబేటర్స్, 5 వేల స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది. ఒక మిలియన్ చదరపు అడుగుల్లో ఇంక్యుబేషన్ అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇందుకు అనుగుణం నిపుణుల సలహాలు సూచనలను స్వీకరించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. -
ఫిబ్రవరి 13న ఐటీ, స్టార్టప్ పాలసీ!
హైదరాబాద్‌లో నాస్కామ్ 10 కే వేర్‌హౌజ్: కేటీఆర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :దేశంలో ఎప్పుడూ లేని విధంగా స్టార్టప్ కంపెనీల గురించి మాట్లాడుకోవటం చూస్తున్నామని, అది కూడా దేశ ప్రధాని నుంచే మొదలుకావటం శుభపరిణామమని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీ రామారావు చెప్పారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఎలాగైతే స్టార్టప్ పాలసీని ప్రకటించిందో... దానికి ఏమాత్రం తీసిపోని విధంగా తెలంగాణలోనూ ఐటీ, స్టార్టప్ పాలసీని తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పాలసీ ఆవిష్కరణను వాయిదా వేశామని, ఎన్నికల అనంతరం ఫిబ్రవరి 13న పాలసీని విడుదల చేస్తామని వెల్లడించారు. సోమవారమిక్కడ టీ-హబ్‌లో ‘నాస్కాం 10కే వేర్‌హౌజ్’ను ప్రారంభించిన సందర్భంగా నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్, చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘అకాడమీ స్థాయి నుంచే యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి. అందుకే త్వరలోనే కోర్స్ క్రెడిట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పాఠశాల, కళాశాల స్థాయిలోనే పారిశ్రామిక ఆలోచనలను వెలికితీసి సరైన మార్గదర్శనం చేయడానికిది ఉపకరిస్తుంది. టీ- హబ్‌లో మరిన్ని వేర్‌హౌజ్‌ల ప్రారంభానికి ప్రయత్నిస్తున్నాం’’ అన్నారాయన. సోషల్ రిలేషన్స్‌లోనే అవకాశాలు: చంద్రశేఖర్ దేశంలో యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సంప్రదాయ వ్యాపార పద్ధతుల నుంచి టెక్నాలజీ బిజినెస్‌ల వైపు అడుగులేస్తున్నారని నాస్కామ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ చెప్పారు. ‘‘గతంలో ఈ-కామర్స్, లాజిస్టిక్ రంగంలో ఎక్కువగా స్టార్టప్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు సామాజిక సంబంధమైన (సోషల్ రిలేషన్స్) రంగంలో అవకాశాలు ఎక్కువ’’ అన్నారాయన. సోషల్ రిలేషన్స్ అంటే ఎక్కువ మందికి అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలన్నారు. త్వరలో విశాఖలోనూ నాస్కామ్ వేర్‌హౌజ్‌ను ఆరంభిస్తామన్నారు. దీన్లో స్టార్టప్ కంపెనీలకు ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలుంటాయి. పారిశ్రామికవేత్తలు, నిపుణుల సల హాలు, సూచనలు, శిక్షణ శిబిరాలు, సదస్సులు, మెంటారింగ్‌లు ఉంటాయి. ఆచరణతోనే విజయం: మోహన్‌రెడ్డి చక్కని ఆలోచనతో స్టార్టప్‌ను తెచ్చినా, దాన్ని ప్రణాళికాబద్ధంగా ఆచరణయోగ్యం చేస్తేనే విజయం దక్కుతుందని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి చెప్పారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడమంటే మౌలిక సదుపాయాలు సమకూర్చడం కాదని, వాటికి అవసరమైన దిశానిర్దేశం, మెంటారింగ్, ఫండింగ్ సమకూర్చాల్సి ఉంటుందని చెప్పారు. టీ-హబ్ అలాగే మొదలైందన్నారు. ‘‘నేటి యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అదృష్టవంతులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ స్టార్టప్‌లను బాగా ప్రోత్సహిస్తున్నాయి. మౌలిక సదుపాయాలే కాదు గ్రాంట్లు, రాయితీలూ అందిస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, తయారీ.. ఇలా అన్ని రంగాల్లోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని టెక్నాలజీ ద్వారా నివృత్తి చేసి అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అన్నారాయన.