పాలికెలో బోగస్ పౌర కార్మికులు
గుర్తించిన రాష్ట్ర సఫాయి కర్మచారి కమిషన్
బెంగళూరు(బనశంకరి) : బీబీఎంపీలో సుమారు ఆరు వేలకు పైగా బోగస్ పౌరకార్మికులు ఉన్నారని, వీరి వేతనాన్ని ఇతరులు స్వాహా చేస్తున్నట్లు రాష్ట్ర సఫాయి కర్మచారి కమిషన్ గుర్తించింది. బీబీఎంపీ రికార్డుల ప్రకారం 18,400 మంది కార్మికులు ఉండాల్సి ఉంది. అయితే అక్కడ పనిచేస్తున్నది కేవలం 12,800 మంది మాత్రమేనని తేలింది. 6,400 మంది కార్మికుల వేతనాలను ఎవరు స్వాహా చేస్తున్నది తేలాల్సి ఉందని కమిషన్ అధ్యక్షుడు నారాయణ అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల బీబీఎంపీలోని ఎనిమిది వలయాల జాయింట్కమిషనర్లు సమావేశం నిర్వహించగా బోగస్ పౌరకార్మికులు ఉండటం వెలుగుచూసిందని అన్నారు.
దీనిపై ప్రతి పరిధిలోనూ విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. విచారణ సమయంలో కార్మికులందరినీ హాజరుపరచాలని బీబీఎంపీకి సూచించినట్లు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు సక్రమంగా డబ్బు చెల్లించకుండా కాంట్రాక్టర్లు వేధిస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. సఫాయి కార్మికుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం నుంచి 2014-15 సంవత్సరంలో రూ.300 కోట్లు నిధులు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ అబివృద్ధి మండలికి అందాయని తెలిపారు. ఈ నిధులను సక్రమంగా వెచ్చించకపోవడంతో రూ. 280 కోట్లు వెనక్కు మళ్లాయని అన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర సపాయి కర్మచారి కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఎస్ఎస్.సంగాపుర తదితరులు పాల్గొన్నారు.