state history
-
మూడు వారాల్లో వైఎస్ సంక్షేమ రాజ్యం
పాడేరు, అరకు, కొత్తవలస బహిరంగ సభల్లో వైఎస్ విజయమ్మ సాక్షి, విశాఖపట్నం/శృంగవరపుకోట, న్యూస్‌లైన్: ‘‘మరో మూడు వారాలు ఆగండి. కష్టాలు పడుతున్న మీ అందరికి మీ మనవడు పింఛన్లు అందిస్తారు. వృద్ధులకు రూ.700, వికలాంగులకు రూ.1,000 చొప్పున ఇస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని తీసుకువస్తారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. జగన్ కూడా రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తారు. జగన్ వైఎస్‌లా మంచి నాయకుడు. మనసున్న నేత. జగన్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో అయిదు సంతకాలు చేస్తారు. అవి రాష్ట్ర చరిత్రనే తిరగరాస్తాయి. కష్టాల్లో ఉన్న మా కుటుంబానికి మీరంతా వెన్నుదన్నుగా నిలబడ్డారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. చంద్రబాబు మీ అందరినీ నమ్మించడానికి కల్లబొల్లి హామీలు ఇస్తున్నారు. వాటిని నమ్మకండి. విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబే. ఆయన ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇవ్వబట్టే ఈరోజు రాష్ట్రం ముక్కలైంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. ఆదివారం విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో ఎన్నికల ప్రచారంలో విజయమ్మ పాల్గొన్నారు. పాడేరు, అరకు, కొత్త వలస బహిరంగ సభల్లో ప్రసంగించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో, విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగిన రోడ్‌షోలలోనూ ప్రసంగించారు. భారీ వర్షంలోనూ విజయమ్మకు గిరిజనం బ్రహ్మరథం వైఎస్ విజయమ్మ తొలిసారిగా విశాఖజిల్లా ఏజెన్సీ ప్రాంతానికి రావడం తో ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతో ఎన్నో సంక్షేమ పథకాలను అందుకున్న తమకు ఆయన భార్యను తొలిసారిగా చూసే భాగ్యం దక్కడంతో గిరిజనం పండుగ చేసుకున్నారు. పాడేరు, అరకు బహిరంగ సభలకు వేలాదిగా తరలివచ్చారు. విజయమ్మ ప్రసంగాలకు జై కొట్టారు. విజయమ్మ పాడేరుకు చేరుకోగానే సభా వేదికకు కిలో మీటరున్నర ముందు నుంచే వేలాది జనం ర్యాలీగా ఆమె కాన్వాయ్ వెంట నడిచారు. అరకులోనూ విజయమ్మకు విశేష ఆదరణ లభించింది. జోరున వర్షం కురుస్తున్నా, ఆమెను చూసేందుకు ప్రజలు గంటల తరబడి అక్కడి నుంచి కదల్లేదు. వర్షంలోనే తడుస్తూ విజయమ్మ ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. ప్రచార రథానికి తప్పిన ప్రమాదం విశాఖ ఏజెన్సీలో విజయమ్మ కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న ప్రచార రథానికి ప్రమాదం తప్పింది. ఆ సమయంలో వాహనంలో విజయమ్మ లేరు. ఆదివారం సాయంత్రం ఆమె అరకులో ప్రచారరథంపై నుంచి ప్రసంగించి అనంతరం తన వాహనంలో ఘాట్‌రోడ్డులో తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో కాన్వాయ్‌లో ముందుగా వెళ్తున్న ప్రచారరథానికి అనంతగిరి మండలం డముకు సమీపంలో 5వ నంబరు మలుపు వద్ద బ్రేకులు ఫెయిలయ్యాయి. గమనించిన డ్రైవరు సమయస్ఫూర్తితో రోడ్డు పక్కన కొండ అంచును ఢీకొట్టించి ఆగేలా చేశారు. నెమ్మదిగా వస్తుండటం వల్ల ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత కాన్వాయ్‌లోని వాహనాలు ముందుకు సాగిపోయాయి. మరమ్మతులు చేసిన అనంతరం ప్రచార రథాన్ని విశాఖకు తీసుకెళ్లారు. -
చరిత్రను తిరగ రాయాలి
ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించాలి జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు పిలుపు పాయకరావుపేట, న్యూస్‌లైన్ : రాష్ట్ర చరిత్రను తిరగరాసేలా ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు అన్నారు. పాయకరావుపేటలో శుక్రవా రం మండల పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యఅతిధిగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో రాష్ర్టం లో అంధకారం అలుముకుందన్నారు. మహానేత వైఎస్సార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసి అన్నదాతలకు మేలు చేశారన్నారు. వృద్ధులు,వికలాంగులకు పెన్షన్, పేద విద్యార్థుల ఉన్నత చదువుకు పీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే మళ్లీ స్వర్ణయుగం వస్తుందన్నారు. అమ్మఒడి,డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయన్నారు. ప్రస్తు తం జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర చరిత్ర ను తిరగరాసే ఎన్నికలన్నారు. అభ్యర్థు లు నామినేషన్ పత్రాల్లో యువజన శ్రా మిక కాంగ్రెస్ పార్టీ అని నింపాలన్నారు. ఫ్యాన్ గుర్తును ప్రచారం చేయాలన్నారు. నియోజవర్గ సమన్వయకర్త చెంగల వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబును నమ్మే స్థితిలో జనం లేరన్నారు. జగన్మోహన్రెడ్డిని సీఎంను చేసేందుకు ఆతృతతో ఎదురుచూస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వీసం రామకృష్ణ,రాష్ట్ర యువజన కమిటీ సభ్యుడు చిక్కాల రామారావు, మండల కన్వీనర్ కోడా కోటేశ్వరరావు, ధనిశెట్టి బాబూరావు,సర్పంచ్ ధనిశెట్టి నాగమణి,లంక సూరిబాబు,దేవవరపు వెంకటేశ్వరరావు,పెనుమత్స నాగేశ్వరరావు,తిర్పర్ణ సత్యనారాయణ,అల్లాడిశివ,ఆడారి నూకరాజు, ఆడారి ప్రసాద్, దేవవరపు శేషగిరిరావు, శివలంక నాగమల్లి, జానకి శ్రీను,కుమారరాజా పాల్గొన్నారు. 19న జగన్ రోడ్‌షో తూర్పుగోదావరి జిల్లాలో ముగిశాక ఈ నెల 19న పాయకరావుపేటలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్‌షో ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయి విజయవంతం చేయాలని కోరారు. -
ప్రజాస్వామ్యంలో చీకటి రోజు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభ ఆమోదించడం రాష్ట్ర చరిత్రలో చీకటి రోజని వైఎస్ఆర్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. రెండు ప్రాంతాల్లో అన్నదమ్ములను పైశాచికంగా విడదీసిన ఇటలీ నియంత సోనియాగాంధీ అని అన్నారు. సీమాంధ్రులకు ఎటువంటి ప్రయోజనాలు లేకుండా, సీమాంధ్రను ఎడారిలా చేయడానికి ఆమె కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఆమెకు వంత పాడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును సీమాంధ్ర ప్రజలను క్షమించరని అన్నారు. వేలాదిమందితో ఢిల్లీకి వెళ్లి నిరసనలు తెలిపినా, లోక్‌సభలో నాలుగు గోడల మధ్య రాష్ట్ర ప్రజలను నిలువునా చీల్చారని దుయ్యబట్టారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నాయుడు నోరు మెదపకుండా, నీరో చక్రవర్తిలా ప్రవర్తించారని విమర్శించారు. పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి, అప్రజాస్వామికంగా విభజన చేపట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. రాష్ట్రాన్ని విడదీయడానికి దాపురించిన రెండు దుష్టశక్తులు సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు అని ఆయన ధ్వజమెత్తారు. ఇటువంటి దుర్దినం ఏ రాష్ట్రానికీ రాకూడదని అన్నారు. కొన్ని కోట్ల మంది వద్దని అంటున్నా, తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడం కోసం, రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చి వేశారని అన్నారు. సీమాంధ్రలోని ఏడు కోట్ల మంది ఉసురు సోనియా గాంధీకి తగులుతుందని అన్నారు.