State mines
-
గనుల శాఖ మహిళా అధికారి హత్య
బనశంకరి: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర గనులు, భూ విజ్ఞానశాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ(40) అనే అధికారిణి దారుణహత్యకు గురయ్యారు. శనివారం రాత్రి 8 గంటలకు ఆమె ఆఫీసు నుంచి దొడ్డకళ్లసంద్రలోని తన అపార్టుమెంటులోని ఫ్లాటుకు చేరుకున్నారు. కొంతసేపటికి గుర్తుతెలియని దుండగులు చొరబడి ఆమెను గొంతుకోసి, చంపి పరారయ్యారు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో 8 గంటల సమయంలో స్నేహితులు వచ్చి చూశాక దారుణం వెలుగులోకి వచ్చింది. సుబ్రమణ్యనగర పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె భర్త, ఇంటర్ చదివిన కొడుకు సొంతూరైన శివమొగ్గలోని తీర్థహళ్లి తాలూకాలో ఉంటారు. -
అవినీతి సుడిలో సుజాత
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్ర గనులు.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మళ్లీ అవినీతి సుడిగుండంలో చిక్కుకున్నారు. ఇంటి ఆవరణలో నోట్ల కట్టల వ్యవహారం వెలుగు చూడగా.. నాలుగు రోజులు ఉక్కిరిబిక్కిరై ఎలాగోలా బయటపడిన మంత్రి సుజాతకు ఇప్పుడు విజయవాడలోని సొంత శాఖ ఉద్యోగి నుంచే మరో ఉపద్రవం ఎదురైంది. సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును తిరిగి ఇచ్చేందుకు రూ.15 వేల లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఉండ్రాజవరపు జెస్సీ డైమండ్ రోసీ సోమవారం రాత్రి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడింది. ఆ లంచం తన కోసం తీసుకోలేదని, మంత్రి పీతల ఖర్చుల కోసమే వసూలు చేస్తున్నానని ఆమె ఏసీబీ అధికారుల విచారణలో చెప్పడం, మంత్రి కోసం ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టాననే వివరాలు నమోదు చేసిన డైరీని ఏసీబీ అధికారులకు అందించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మంత్రి సుజాత విజయవాడ వచ్చినప్పుడల్లా స్టార్ హొఇటల్స్లో బస ఏర్పాటు చేయాల్సి వస్తోందని.. ఆమెతోపాటు వచ్చే కుటుంబ సభ్యులకు, మందీమార్బలానికి వాహనాలతోపాటు ఖరీదైన విందులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించేవారని విచారణలో జెస్సీ ఏసీబీ అధికారులకు మొరపెట్టుకుంది. ఆ ఖర్చుల కోసమే తాను లంచం తీసుకుంటున్నానని ఆమె ఆరోపించడంతోఅవాక్కైన అధికారులు ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోవాలని సూచించినట్టు తెలిసింది. కోర్టులో అదే వాంగ్మూలం ఇస్తే.. మంత్రి పీతల సుజాత ఖర్చుల కోసమే లంచం తీసుకున్నానని జెస్సీ కోర్టులో వాంగ్మూలం ఇస్తే పరిస్థితి ఏమిటన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే ఏసీబీ అధికారులు డైరీని స్వాధీనం చేసుకుని విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి తదుపరి ఆదేశాల కోసం వేచిచూస్తున్నారు. కాగా, జెస్సీ ఉదంతంపై మంత్రి పీతల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి చింతలపూడి, వీరవాసరం, ఏలూరులకు వచ్చివెళ్లే సందర్భంలో ఎప్పుడైనా విజయవాడలో బస కోసం ఆగినప్పుడు సంబంధిత శాఖ డీడీకి ఫోన్ చేస్తాం గానీ ఉద్యోగులతో నేరుగా ప్రొటోకాల్ విషయాలు ఎలా మాట్లాడతామని ఆమె వాదిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై ఎక్కడా బహిరంగంగా మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనం పాటించాలని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. పీతల మౌనం ఎలా ఉన్నా తాజాగా జెస్సీ ఆరోపణల వ్యవహారం ఎటుతిరిగి ఎటు వస్తుందోనని టీడీపీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
అవినీతిరహిత పాలన అందిస్తాం
మంత్రి పీతల సుజాత ఏలూరు : అవినీతికి తావులేని పారదర్శక పాలనను రాష్ట్ర ప్రజలకు అందిస్తామని రాష్ట్ర గనులు, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఏలూరు ఎంపీ మాగంటిబాబుతో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అవినీతిరహిత పాలనే తమ లక్ష్యమని, ఆ దిశగా అన్ని రంగాల్లో అభివృద్ధికి అధికారులను, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ముందుకు వెళతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. తన శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పరిశీలించి పరిష్కరిస్తానని చెప్పారు. జిల్లాలో వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ ప్రాంతంలో పాస్పోర్టు కార్యాలయం త్వరలో ప్రారంభినున్నట్టు చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, ఏలూరు నగరాలను హైటెక్ సిటీలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి కష్టపడి పనిచేస్తామని చెప్పారు. అంతకుముందు ఎన్టీఆర్, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుజాతకు పట్టుచీర పెట్టిన మాగంటి సతీమణి స్థానిక ఆర్ఆర్పేటలో ఎంపీ మాగంటి ఇంటికి శనివారం ఉదయం చేరుకున్న మంత్రి సుజాతకు మాగంటి బాబు సతీమణి పద్మవల్లీ దేవి ఘనస్వాగతం పలికారు. మంత్రికి పద్మవల్లీదేవీ పట్టుచీర పెట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సుజాత మాగంటి బాబు దంపతులకు పాదాభివందనం చేశారు.