సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్ర గనులు.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మళ్లీ అవినీతి సుడిగుండంలో చిక్కుకున్నారు. ఇంటి ఆవరణలో నోట్ల కట్టల వ్యవహారం వెలుగు చూడగా.. నాలుగు రోజులు ఉక్కిరిబిక్కిరై ఎలాగోలా బయటపడిన మంత్రి సుజాతకు ఇప్పుడు విజయవాడలోని సొంత శాఖ ఉద్యోగి నుంచే మరో ఉపద్రవం ఎదురైంది.
సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును తిరిగి ఇచ్చేందుకు రూ.15 వేల లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఉండ్రాజవరపు జెస్సీ డైమండ్ రోసీ సోమవారం రాత్రి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడింది. ఆ లంచం తన కోసం తీసుకోలేదని, మంత్రి పీతల ఖర్చుల కోసమే వసూలు చేస్తున్నానని ఆమె ఏసీబీ అధికారుల విచారణలో చెప్పడం, మంత్రి కోసం ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టాననే వివరాలు నమోదు చేసిన డైరీని ఏసీబీ అధికారులకు అందించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
మంత్రి సుజాత విజయవాడ వచ్చినప్పుడల్లా స్టార్ హొఇటల్స్‌లో బస ఏర్పాటు చేయాల్సి వస్తోందని.. ఆమెతోపాటు వచ్చే కుటుంబ సభ్యులకు, మందీమార్బలానికి వాహనాలతోపాటు ఖరీదైన విందులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించేవారని విచారణలో జెస్సీ ఏసీబీ అధికారులకు మొరపెట్టుకుంది. ఆ ఖర్చుల కోసమే తాను లంచం తీసుకుంటున్నానని ఆమె ఆరోపించడంతోఅవాక్కైన అధికారులు ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోవాలని సూచించినట్టు తెలిసింది.
కోర్టులో అదే వాంగ్మూలం ఇస్తే..
మంత్రి పీతల సుజాత ఖర్చుల కోసమే లంచం తీసుకున్నానని జెస్సీ కోర్టులో వాంగ్మూలం ఇస్తే పరిస్థితి ఏమిటన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే ఏసీబీ అధికారులు డైరీని స్వాధీనం చేసుకుని విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి తదుపరి ఆదేశాల కోసం వేచిచూస్తున్నారు. కాగా, జెస్సీ ఉదంతంపై మంత్రి పీతల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి చింతలపూడి, వీరవాసరం, ఏలూరులకు వచ్చివెళ్లే సందర్భంలో ఎప్పుడైనా విజయవాడలో బస కోసం ఆగినప్పుడు సంబంధిత శాఖ డీడీకి ఫోన్ చేస్తాం గానీ ఉద్యోగులతో నేరుగా ప్రొటోకాల్ విషయాలు ఎలా మాట్లాడతామని ఆమె వాదిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై ఎక్కడా బహిరంగంగా మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనం పాటించాలని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. పీతల మౌనం ఎలా ఉన్నా తాజాగా జెస్సీ ఆరోపణల వ్యవహారం ఎటుతిరిగి ఎటు వస్తుందోనని టీడీపీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
అవినీతి సుడిలో సుజాత
Published Thu, Jun 11 2015 2:09 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
Advertisement
Advertisement