రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా ఇబ్రహీం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి సీఎం. ఇబ్రహీం నియమితులయ్యారు. కేబినెట్ మంత్రి హోదాను కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఆయనను ఈ పదవిలో నియమించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన ఇబ్రహీం గత శాసన సభ ఎన్నికల్లో శివమొగ్గ జిల్లా భద్రావతి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడారు.
అంతకు ముందు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనను శాసన మండలికి పంపడానికి ప్రతిపక్ష నాయకుని హోదాలో సిద్ధరామయ్య చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన సీఎల్పీ నాయకత్వ పదవికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జోక్యంతో అలక మానారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇబ్రహీంకు ఏదో ఒక పదవి ఇప్పించాలని సీఎం తాపత్రయ పడ్డారు. ఎట్టకేలకు సంవత్సరం తర్వాత ఆయన ప్రయత్నం ఫలించింది.