చైనా విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు
21 మంది మృతి
బీజింగ్: చైనాలోని థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం అత్యంత ఒత్తిడితో కూడిన ఆవిరి గొట్టం పేలడంతో 21 మంది మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. హ్యుబే ప్రావిన్స్ డ్యాంగ్యాంగ్ నగరంలోని మాడియన్ గాంగ్యు విద్యుదుత్పత్తి కేంద్రంలో మధ్యాహ్నం ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. గాయపడ్డవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా, వారికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద వార్త తెలియగానే పని భద్రత అధికారులు రక్షణ చర్యలు చేపట్టారని డ్యాంగ్యాంగ్ అధికారులు తెలిపారు.
పైపును పరీక్షిస్తుండగా ఒక్కసారిగా పగలడంతోనే ప్రమాదం సంభవించిందన్నారు. నగరీకరణ, అభివృద్ధిలో దూసుకుపోతున్న చైనాలో కార్మికుల భద్రత, పర్యావరణ నిబంధలు పాటించడంలో నిర్లక్ష్యం వల్ల ఇటీవల పారిశ్రామిక ప్రమాదాలు చాలా సాధారణమయ్యాయి. చైనా ఈశాన్య నగరం తియాన్జిన్ ప్రమాదానికి ఏడాది పూర్తవుతున్న ఒక రోజు ముందే డ్యాంగ్యాంగ్ దుర్ఘటన జరగడం గమనార్హం. నాటి పేలుడులో 173 మంది మరణించారు.