చుట్టరికాలు
టూకీగా ప్రపంచ చరిత్ర 16
మనిషి, లేదా మనిషిని పోలిన జంతువు అప్పట్లో ఉండే వుండాలని గట్టిగా నమ్మేందుకు దొరికిన మొట్టమొదటి ఆధారాలు ‘రాతి పనిముట్లు.’ అవి చెకుముకిరాయి వంటి కఠినాతి కఠినమైన రాళ్ళతో అతి మోటుగా చెక్కిన పరికరాలు. వాటిల్లో కోసేందుకు ఉపయోగించేవి కొన్ని, గోకేందుకు ఉపయోగించేవి కొన్ని. ఇలాంటివన్నీ ఒకే తావున కూటమిగా దొరకడంతో అనుమానం తలెత్తింది. వాటిది ప్రకృతిసిద్ధమైన ఆకారమో, కృత్రిమంగా తయారైన ఆకారమో తెలుసుకోవడం ఆ శాస్త్రంలో నిపుణులకే వీలౌతుంది. అవి ఎవరో తయారుచేసినవా కాదా అనే వాదోపవాదాలు సుదీర్ఘంగా జరిగి, చివరకు పనిముట్లేనని శాస్త్రజ్ఞులందరూ తీర్మానించారు. వాటితోపాటు ఆ తయారుచేసిన వారి అవశేషం ఏవొక్కటీ, ఏవొక్క తావులో దొరకలేదు. వాటిల్లో అతి పురాతనమైనవి సీనోజోయిక్ యుగంలోని తొలిఘట్టానికి చివరిదైన ప్లియోసీన్ శకానివని నిర్ధారించారు. అంటే, ప్రైమేట్లకు అవి కోటి సంవత్సరాల తరువాతివి, మనకు ఇరవై లక్షల ఏళ్ళ పూర్వానివి.
‘మనిషి పనిముట్టును తయారుచేశాడా లేక పనిముట్టు మనిషిని తయారుచేసిందా?’ అనేది ఒక పట్టాన తెగే తర్కం కాదు. దాన్ని వదిలేసి, పనిట్టును వాడడానికీ, పనిముట్టును తయారుచేయడానికి మధ్యనుండే తేడాను కొద్దిగా పరిశీలిద్దాం. పనిముట్టును వాడడమనేది మనిషొక్కడే నేర్చిన నైపుణ్యం గాదు. చింపాంజీ, గొరిల్లాలవంటి వాలిడి తెగలన్నీ పనిముట్లను వాడగలవు. అవి కర్రలతో బండలు పెకలిస్తాయి, పొదలను కుళ్ళగిస్తాయి; గుండ్రాళ్ళతో కాయలను పగలగొట్టుకుంటాయి; రాళ్ళు విసిరి శత్రువులను పరిగెత్తిస్తాయి; చింపాంజీలు చెట్లమీదనే కొమ్మలు అల్లుకుని గుడిసె కప్పులా తయారుజేసుకుంటాయి. అయితే, అవి సిద్ధంగా దొరికిన పనిముట్టును వాడగలవే గానీ, తమకు తాముగా పనిముట్టును తయారుచేసుకోలేవు. పనిముట్టును తయారుజేసుకునే మేధస్సు కలిగిన ఒకే జంతువు ‘మనిషి.’
ఆదిమకాలం పనిముట్లన్నీ రాతివే దొరకడం వల్ల ఇతర ముడిసరుకుతో తయారుచేసిన సామగ్రి ఉండేదికాదనే అభిప్రాయం సరిగాదు. వెదురుతోనూ, కలపతోనూ తయారైన సాధనాలను అప్పటి మనుషులు ఉపయోగించే ఉండొచ్చు. అవి దీర్ఘకాలం మన్నికయ్యేవి కాకపోవడంతో మనకు దొరికుండవు. ఉండేవని ఎందుకు భావిస్తున్నామంటే - పవిత్రమైన కార్యాలకు శాఖాసంబంధమైన సామగ్రిని విధిగా వాడే సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉందిగాబట్టి. యాగశాలను నిర్మించేందుకు వేదాలలో విధించిన నిబంధనలు పరిశీలిస్తే, ఇటుకలతో నిర్మించేది ఒక్క యజ్ఞకుండమే తప్ప, పాకలూ చాపలూ స్తంభాలవంటివన్నీ - గరిటెలతో సహా, శాఖావయవజనితాలే. నిప్పును ‘అరణి’తో- ఎండిన జమ్మి లేక రావి కట్టెల రాపిడితో - పుట్టించాలి. ఈ ఆచారం కొన్నిచోట్ల ఇప్పటికీ ఉంది.
మనిషి పూర్వీకుల కోసం జరుగుతున్న అన్వేషణలో, భారతదేశంలోని సిమ్లా సమీపాన, హిమాలయ పర్వత శ్రేణుల్లోని శివాలిక్ కొండల తవ్వకాల్లో దొరికిన దవడ ఎముకలు ఆసక్తిని రేకెత్తించాయి. మనిషికి దగ్గర పోలికలు ఉన్నాయనే కారణంగా దాన్ని ‘శివా పిథికస్’ అన్నారు. ‘పిథికస్’ అంటే నరవానరం. నేలపొరను బట్టి దాని వయసు ఒక కోటీ నలభై లక్షల సంవత్సరాలదని అనుకున్నారు. దవడ ఎముకనుబట్టి నిటారుగా నడిచేదని చెప్పేందుకు వీలుపడదుగానీ, ఆ జీవి వాలిడికంటే పైస్థాయి పరిణామదశకు చేరిందని కచ్చితంగా తెలుసుకోవచ్చు. దానికి కారణం - పై దవడకు 16, కింది దవడకు 16 దంతాలుండేది మనిషికీ, వానరాలకు మాత్రమే. అందులో తోకకోతుల దవడ దంతానికి నాలుగు శిఖరాలే ఉండగా, హోమినాయిడీల దవడపళ్ళకు ఐదేసి శిఖరాలుంటాయి. అయితే, వాలిడి జాతుల దవడ ముందుభాగం, కోరపళ్ళదాకా, చాపంలా వంగివున్నా, వెనకభాగం - అంటే, దవడ దంతాలూ, మునిదవడ దంతాలూ ఉండే భాగం, సమాంతరంగా రైలుపట్టాల్లా ఉంటుంది. అంగిలి బల్లపరుపుగా ఉంటుంది. మనిషి దవడలు ఆసాంతం చాపంలాగే ఉంటాయి. చివరకు పోనుపోనూ కుడి ఎడమ దంతాల మధ్యదూరం పెరుగుతూ పోతుంది. పైగా, అంగిలి బల్లపరుపుగా కాక, కమానులాగా (‘డోమ్’లాగా) వంగివుంటుంది.
క్రీస్తుశకం ఇరవయ్యో శతాబ్దపు తొలిరోజుల్లో ఇండియా, పాకిస్థాన్, నేపాల్ దేశాల్లో అనేకచోట్ల ఇదే జాతికి చెందిన జంతువుల అస్థిపంజరాలు మొత్తంగా దొరకడంతో ఆశ నిరాశైంది. అది ఇంకా శాఖాజీవితం మానుకోని జంతువు. ఎత్తు ఐదూ ఐదున్నర అడుగులు ఉంటుంది. దంతాలు కాయలూ పళ్ళ వంటి మృదువైన ఆహారాన్ని తీసుకునేందుకు మాత్రమే అనుకూలించేవి. కాకపోతే అది, చింపాంజీలకంటే పైస్థాయికి ఎదిగి, ఆ తరువాత అంతరించి పోయిన జాతి. మనం వెదుకుతున్నది దీనికోసం కాదు. మనకు కావలసింది నేలమీద పరిగెత్తుతూ, కొండల్లో గుట్టల్లో దాక్కున్న నరవానరం. బహుశా, సేబర్ టీత్ టైగర్ వంటి క్రూరమృగం వదిలేసిన జంతుమాంసాన్ని ఇప్పటి నక్కలాగా పొంచేసుకుని శుభ్రం చేసిన నరవానరం. శాఖాజీవితానికి స్వస్తిపలికి, నేలమీదికి నివాసం మార్చుకున్న నరవానరం.
రచన: ఎం.వి.రమణారెడ్డి