ఆకాశం నుంచి పడిన వింత వస్తువు
వేలూరు: ఆకాశం నుంచి ఏదో వస్తువు పడి పేలిన పెద్ద శబ్ధం వచ్చి, ఆ ప్రాంతంలో ఐదు అడుగుల మేర గుంత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని అచ్చమంగలం కోట గౌండర్ ప్రాంతానికి చెందిన రైతు రవి. ఇతని వ్యవసాయ భూమిలో గత రెండు రోజుల క్రితం పెద్ద పేలుడు శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు గమనించి వ్యవసాయ భూమి వద్దకు వెల్లి పరిశీలించగా ఐదు అడుగుల లోతు, రెండు అడుగుల వెడల్పుతో కూడిన గుంత ఏర్పడి ఉండడాన్ని గమనించారు. అలాగే ఈ గుంత నుంచి అధికంగా వేడి గాలి వచ్చినట్లు స్థానికులు గుర్తించిన ఆకాశం నుంచి ఏదైనా వస్తువు పడిందా? లేక వేరే ఏమైనా పడిందా? అనే కోణంలో స్థానికులు జోలార్‌పేట తహసీల్దార్‌కు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ దర్పకరాజ్, తహసీల్దార్ ఆనంద క్రిష్ణన్, రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి, విచారణ జరిపారు. వీటిపై కలెక్టర్ దర్పకరాజ్ మాట్లాడుతూ వ్యవసాయ పొలంలో పెద్ద శబ్దంతో కూడిన వస్తువు పడినట్లు స్థానికులు తెలపడంతో వాటిని తనిఖీ చేశామని, అయితే వీటిపై పరిశోధన కేంద్రం అధికారులకు సమాచారం అందజేయడంతో వీటిని నిపుణులు పరిశోధన చేయనున్నారని, ఇప్పటికే గుంటలోని మట్టిని పరిశోధనకు పంపామన్నారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మంగళవారం ఉదయం వే లూరులోని పరిశోధన కేంద్రం అధికారుల బృందం నేరుగా వచ్చి తనిఖీ చేశారని పల్లంలోని మట్టితోపాటు బాగా కాలిన బూడిదను పరిశోధనకు తీసుకెళ్లినట్లు తెలిపారు. పల్లం చుట్టూ ఎవరూ దగ్గరకు వెళ్లకుండా ట్రంచ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.