సాఫ్ట్వేర్ టెస్టింగ్ భారీ డిమాండ్
సాఫ్ట్వేర్ నాణ్యతకి ప్రాధాన్యం పెరుగుతుండటంతో సెక్యూరిటీ టెస్టింగ్, మొబైల్ యాప్స్ టెస్టింగ్ వంటి వాటిపై సిగ్నిటీ టెక్నాలజీస్ దృష్టి సారిస్తోంది. మరోవంక విదేశాల్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించే దిశగా కొన్ని కంపెనీలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) శ్రీకాంత్ చక్కిలం, స్ట్రాటజీ అండ్ కార్పొరేట్ డెవలప్మెంట్ విభాగం ప్రెసిడెంట్ శ్రీరామ్ రాజారాం ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. టెస్టింగ్ రంగం తీరుతెన్నులు, కంపెనీ ప్రణాళికల గురించి బుధవారమిక్కడ వివరంగా చెప్పారు.
అవన్నీ వారి మాటల్లోనే...
35 బిలియన్ డాలర్ల మార్కెట్
సాఫ్ట్వేర్లు, యాప్‌లు (అప్లికేషన్లు) ఎంతమేర సమర్థతతో పనిచేయగలవో పరీక్షించేందుకు టెస్టింగ్ సర్వీసులు ఉపయోగపడతాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇటువంటి సర్వీసులకు మాత్రమే పరిమితమైన కంపెనీలకు సంబంధించి.. ఇండిపెండెంట్ టెస్టింగ్ సర్వీసుల మార్కెట్ సుమారు 35 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఇది 2020 నాటికి 50 బిలియన్ డాలర్లకు పెరగనుందని అంచనా. ఇక దేశీయంగా .. 2010లో ఈ రంగం 3.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది.
ఇది ఏటా 20 శాతం మేర పెరుగుతోంది. గతానికి భిన్నంగా ప్రస్తుతం సాఫ్ట్వేర్, యాప్స్ నాణ్యతకు ప్రాధాన్యం పెరుగుతోంది. పనితీరుతో పాటు భద్రత కూడా ముఖ్యమైన అంశంగా మారింది. మేమైతే ఆటోమేషన్, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ తదితర రంగాల్లో సేవలందిస్తున్నాం. ఇప్పుడిక సెక్యూరిటీ టెస్టింగ్, మొబైల్ యాప్స్, బిగ్ డేటా టెస్టింగ్ లాంటివాటిపై కూడా దృష్టి సారిస్తున్నాం. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసులు, బీమా రంగాలు), హెల్త్‌కేర్, టెలికం, రిటైల్ వంటివి వృద్ధికి ప్రధాన చోదకాలుగా ఉంటాయి.
నిపుణుల కొరత
దేశీయంగా 2020 నాటికి టెస్టింగ్ రంగానికి 3 లక్షల పైచిలుకు నిపుణులు అవసరమవుతారు. ప్రస్తుతం 70,000 మంది మాత్రమే ఉన్నారు. ఈ రంగంలో భారీ అవకాశాలున్నాయి. టెస్టింగ్ రంగానికి ప్రధానంగా నిపుణుల కొరత ఉంటోంది. దీన్ని అధిగమించాలంటే కళాశాల స్థాయిలో టెస్టింగ్కంటూ ప్రత్యేక కోర్సును ప్రవేశపెడితే బాగుంటుంది. మా మటుకు మేము... శిక్షణనిచ్చే సంస్థలతో టై అప్ పెట్టుకుని కొంత మేర సిబ్బందిని తీసుకుంటున్నాం. ఐఎస్టీక్యూబీ సర్టిఫికేషన్ ఉన్న నిపుణులకు సులువుగా అవకాశాలు లభిస్తాయి. ఇక, దేశీయ టెస్టింగ్ రంగానికి పోటీ విషయానికొస్తే.. ఫిలిప్పీన్స్ లాంటి ఇతర దేశాలు ఇప్పట్లోనైతే గట్టి పోటీనిచ్చే అవకాశాలు లేవు. ఈ రంగంలో కమ్యూనికేషన్ కీలకం. దీన్లో మన సంస్థలు పటిష్టంగా ఉండటం మనకు లాభించే అంశం.
కంపెనీల కొనుగోళ్లపై దృష్టి...
ప్రస్తుతం మా ప్రధాన మార్కెట్ ఉత్తర అమెరికాయే. సుమారు 60 మందికి పైగా క్లయింట్లుండగా.. ఇందులో సింహభాగం ఉత్తర అమెరికా ప్రాంతం నుంచే ఉన్నారు. ఇతర దేశాల్లో కార్యకలాపాలు విస్తరించే క్రమంలో.. ఆస్ట్రేలియా, యూరప్‌లలో కంపెనీల కొనుగోలు చేయాలని చూస్తున్నాం. 5-20 మిలియన్ డాలర్ల సంస్థలపై దృష్టి పెడుతున్నాం. వచ్చే 6-9 నెలల్లో ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి రావచ్చు. వచ్చే నెలన్నర రోజుల్లో రూ.48 కోట్ల మేర నిధులు సమీకరిస్తున్నాం. సేల్స్.. మార్కెటింగ్, కొనుగోళ్లు మొదలైన వాటికోసం వెచ్చిస్తాం. హైదరాబాద్ కేంద్రంలో దాదాపు 2,500 మంది దాకా సిబ్బందిని తీసుకోవడానికి అవకాశముంటుంది. ఇది పూర్తయ్యాకే దేశీయంగా ఇతర ప్రాంతాల్లో విస్తరణకు వీలుంటుంది.
మూడింతల ఆదాయమే లక్ష్యం...
గత ఆర్థిక సంవత్సరంలో మా ఆదాయం రూ.151 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 280 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీన్ని రూ.500 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇండిపెండెంట్ టెస్టింగ్ సర్వీసులకు సంబంధించి ప్రస్తుతం మేం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నాం. త్వరలో రెండో స్థానానికి చేరుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో వెయ్యిమంది ఉద్యోగులున్నారు. వీరిలో 300 మంది అమెరికా కార్యాలయాల్లో ఉన్నారు. ఈ మార్చ్‌లో మరో 100 మందిని తీసుకోబోతున్నాం.