‘ఉచితం’ ఉత్తిదేనా!
యాచారం, న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీలు 50 యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగిస్తే ఉచితం అనే మాట ఉత్తుత్తి ప్రచారంగానే మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ ప్రచారార్భాటమే తప్ప ఆచరణలో అమలుకు నోచుకోకపోవడంతో పేదలకు ఏ మాత్రం ప్రయోజన కలగడం లేదు. దీంతో పేదలు 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తున్నా.. బిల్లులు మాత్రం నెలవారీగా చెల్లిస్తూనే ఉన్నారు. అసలు 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తే బిల్లులు ఉండవని కూడా లబ్ధిదారులకు అవగాహన లేకుండాపోయింది. ప్రభుత్వం గొప్పలకు ప్రచారం చేసుకుంటూ అమలులో మాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో ఎస్సీ, ఎస్టీలకు శాపంగా మారింది.
ఇందిరమ్మ కలల పథకం, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బడ్జెట్ కింద ఎస్సీ, ఎస్టీల గృహ వినియోగానికి సంబంధించి పాత బకాయిలు మాఫీ చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది మార్చి నుంచి పేదలు 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తే ఉప ప్రణాళిక ద్వారా బకాయిలు చెల్లించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మండలంలో ఏడు వేలకుపైగా అర్హులైన ఎస్సీ, ఎస్టీలు ఉండగా.. గత నెల క్రితం నిర్వహించిన రచ్చబండ-3లో మాత్రం కేవలం 1,047 మందికే ఉచిత విద్యుత్ వర్తించేలా ఎంపిక చేశారు. ఇక నుంచి ఎస్సీ, ఎస్టీలు 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తే మాత్రం బిల్లులు చెల్లించనవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. అర్హులైనవారు కేవలం కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తే సరిపోతుందని తెలియజేశారు.
చిత్తశుద్ధిలో లోపం.. అమలులో జాప్యం
50 యూనిట్లలోపు విద్యుత్ వాడితే బిల్లులుండవని అధికారులు రచ్చ బండ-3లో చెప్పిన మాటలతో ఎస్సీ, ఎస్టీలు ఎంతగానో సంతోషపడ్డారు. కానీ అధికారుల్లో చిత్తశుద్ధి లోపం కారణంగా అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. మండలంలోని 20 గ్రామాల్లో నెలకు 50 యూనిట్ల విద్యుత్ వినియోగించే ఏడు వేలకుపైగా కుటుంబాలున్నాయి. మంతన్‌గౌరెల్లి, నందివనపర్తి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నల్లవెల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎస్టీ కుటుంబాలున్నాయి.
చింతపట్ల, నక్కర్తమేడిపల్లి, యాచారం, చౌదర్పల్లి, మొండిగౌరెల్లి, చింతుల్ల, గునుగల్ తదితర గ్రామాల్లో వందలాది మంది ఎస్సీలు ఉన్నారు. కొన్ని గ్రామాల్లో పేదలు నెలనెలా బిల్లులు చెల్లిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో అధిక బిల్లులు రావడంతో చాలామంది ఎస్సీ, ఎస్టీల బకాయి బిల్లులు రూ. 50 లక్షలకు చేరాయి. అంధకారంలో ఉండలేక కొంతమంది పేదలు మాత్రం నెలవారీగా బిల్లులు చెల్లిస్తున్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితుల కారణంగా పలువురు బిల్లులు చెల్లించడంలో జాప్యంతో వేలాది రూపాయల బకాయిలు అలాగే ఉండిపోతున్నాయి.
విద్యుత్ అధికారులు సైతం అర్హులైన పేదలను ఎంపిక చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రచ్చబండ-3 తర్వాత మండలంలో పలు గ్రామాల్లో బిల్లులు తీసే సమయంలో విద్యుత్ సిబ్బంది 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారు కుల ధ్రువీకరణపత్రాలు ఇస్తే సరిపోతుంది. ఇక నుంచి బిల్లులు చెల్లించేది ఉండదు. కానీ 50 యూనిట్ల లోపు మాత్రమే విద్యుత్ వాడుకోవాలి అని అధికారులు గతంలో సూచించారు. అమలులో మాత్రం విఫలమతున్నారు. దీంతో అర్హులైన పేదలు బిల్లులు చెల్లిస్తూనే ఉన్నారు. కొన్నిచోట్ల బకాయిలు అలాగే ఉంటున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి.