ఏసీ స్టేడియం అభివృద్ధికి రూ.20 లక్షలు
నెల్లూరు(బృందావనం): నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మౌలిక వసతుల కల్పనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయిస్తానని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. వాకర్స్ అసోసియేషన్, సింహపురి స్విమ్మర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు బుధవారం ఆయన స్టేడియంను సందర్శించారు.
తన విజయానికి సహకరించిన వాకర్స్‌కు రాజమోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్టేడియం అభివృద్ధికి తన వంతు తోడ్పాటునందిస్తానన్నారు. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఆయా అసోసియేషన్లు అంచనాలు రూపొందిస్తే తక్షణమే రూ.20 లక్షలు కేటాయిస్తామన్నారు.
స్విమ్మింగ్‌పూల్, జిమ్‌తో పాటు మైదానాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. స్టేడియం పరిస్థితిని డీఎస్డీఓ ఎతిరాజ్ ఎంపీకి వివరించారు. వివిధ అభివృద్ధి పనులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లు కేటాయించిందని చెప్పారు. అనంతరం ఏసీ స్టేడియం వాకర్స్, సింహపురి స్విమ్మర్స్ అసోసియేషన్ల అధ్యక్షులు పూండ్ల దయాకర్‌రెడ్డి, నిర్మల నరసింహారెడ్డి మాట్లాడుతూ వాకర్స్‌కు మరుగుదొడ్లు, మినీ వాటర్ ప్లాంట్, ఫుట్ట్రాక్, బేబి స్విమ్మింగ్‌పూల్, స్విమ్మింగ్‌పూల్‌లో జిమ్‌కు నిధులు కేటాయించాలని ఎంపీ మేకపాటిని కోరారు. కార్యక్రమంలో ఆయా అసోసియేషన్ల నిర్వాహకులు శేషగిరిరావు నారాయణ, దద్దోలు రమణయ్య, డాక్టర్ శ్రీనివాసకుమార్, వీరిశెట్టి హజరత్‌బాబు, నలబోలు బలరామయ్యనాయుడు, సుందరరామిరెడ్డి, ఎల్లారెడ్డి, రమేష్, విజయకుమార్‌రెడ్డి, రాఘవేంద్రశెట్టి, దశయ్య, కోటుసింగ్, బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.