subsidy cylinders
-
ఏప్రిల్ 1 నుంచి రూ.500లకే గ్యాస్ సిలిండర్!
జైపూర్: దేశంలో వంట గ్యాస్ ధరలు ఆకాశన్నంటుతూ సామాన్యుడికి పెనుభారంగా మారిన వేళ తమ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి సిలిండర్ ధరను రూ.500లకు తగ్గిస్తామని ప్రకటించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఉజ్వల పథకంలో నమోదు చేసుకున్న వారికి ఈ రాయితీ అందిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఈ ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం సన్నద్ధమవుతున్నాం. ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఉజ్వల స్కీంలో పేదలకు ప్రధాని మోదీ ఎల్పీజీ కనెక్షన్లు, స్టౌవ్ ఇచ్చారు. కానీ, సిలిండర్లు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ధరలు రూ.400 నుంచి రూ.1,040 మధ్య ఉండటమే. ఉజ్వల స్కీంలో నమోదు చేసుకున్న నిరుపేదలకు రూ.500లకే ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తాం.’ అని పేర్కొన్నారు. మరోవైపు.. వచ్చే ఏడాదిలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తున్నట్లు విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ తొలిరోజున సరిహద్దులో ఉద్రిక్తత.. బెళగావిలో 144 సెక్షన్ అమలు -
గ్యాస్ రాయితీ వదిలించండి!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పేదలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి సబ్సిడీ సిలిండర్లు అందించేందుకు వీలుగా... సంపన్న వర్గాలు పొందుతున్న గ్యాస్ రాయితీని వదిలించుకొనేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఏటా రాయితీ సిలిండర్ల ద్వారా ఒక్కో కనెక్షన్‌పై దాదాపు రూ.6వేల వరకు సబ్సిడీ భారం పడుతోందని, సంపన్న వర్గాలు దీన్ని వదులుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తోంది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతోద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఆర్థికంగా ఉన్నవారు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకునేలా చర్యలు చేపట్టాలని ఆయిల్ కంపెనీలు, పౌర సరఫరాల శాఖపై ఒత్తిడి తెస్తోంది. తాజాగా ‘గివ్ ఇట్ అప్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. విస్తృతంగా ప్రచారం: కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆయిల్ కంపెనీలు.. ‘గివ్ ఇట్ అప్’ పేరుతో ప్రచారం మొదలెట్టాయి. మొబైల్ యాప్, ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఎస్సెమ్మెస్ ద్వారా అయితే... ‘గీవ్ ఇట్ అప్’ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి భారత్‌గ్యాస్ వినియోగదారులు 773829899కు, హెచ్‌పీ గ్యాస్ అయితే 9766899899కు, ఇండియన్ గ్యాస్ అయితే 8130792899కు పంపి రాయితీని వదులుకోవచ్చు. హెచ్‌పీ, భారత్, ఇండియన్ గ్యాస్ కంపెనీల మొబైల్ యాప్ ద్వారా, లేదా డిస్ట్రిబ్యూటర్ల వద్ద దరఖాస్తు చేసుకుని సబ్సిడీని వదులుకునే అవకాశం ఉందని ఆయిల్ కంపెనీల రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసన్ తెలిపారు. వదులుకున్నది 17వేల మంది ఇప్పటికే కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, ప్రముఖులు గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు. ఆయిల్ కంపెనీల వద్ద ఉన్న సమాచారం మేరకు తెలంగాణలో 10,347, ఆంధ్రప్రదేశ్‌లో 6,617 మంది కలిపి 16,964 మంది రాయితీని వదులకున్నారు. ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే 3,194 మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాలో మరో 2,566 మంది ఉన్నారు. రాయితీని వదులుకున్న వారిలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ, ఏపీ మంత్రులు ఈటల రాజేందర్, పరిటాల సునీత, ఎంపీలు కవిత, కేవీపీ రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, పార్వతమ్మ, ఐఏఎస్‌లు కె.పున్నయ్య, రతన్ప్రకాశ్, పింగళి రామకృష్ణారావుతో పాటు ఇతర ప్రముఖుల్లో వైఎస్ భారతి, రామోజీరావు, వి.చాముండేశ్వరినాథ్ తదితరులు ఉన్నారు. వీరి తరహాలో మరింత మంది ముందుకు రావాలని ఆయిల్ కంపెనీలు విజ్ఞప్తి చేశాయి. -
ఆధార్ లేకున్నా సబ్సిడీ సిలిండర్లు
న్యూఢిల్లీ: ఆధార్ నంబర్ లేకున్నా సబ్సిడీ సిలిండర్లు కొనుగోలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సబ్సిడీ సిలిండర్ల జారీకి ఆధార్ లింకును తొలగిస్తూ వారంలో స్పష్టమైన ప్రకటన జారీ చేస్తామని పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. ఆధార్ తప్పనిసరి అనే నిబంధనను తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని, ఇకపై సబ్సిడీ సిలిండర్లను ఆధార్ లేకున్నా కొనుగోలు చేయవచ్చని మంత్రి చెప్పారు. ఒకే చిరునామాలో రెండు వంటగ్యాస్ కనెక్షన్ల విషయమై మాట్లాడుతూ.. రెండు వేర్వేరు వంట గదులు ఉన్నట్లయితే వాటిని అనుమతిస్తామన్నారు. దీనిపై వినియోగదారులు ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. -
తత్వం బోధపడినట్టేనా!
సంపాదకీయం: దేశ ప్రజలందరినీ ప్రభావితం చేయగల నిర్ణయాలను తీసుకునే ముందు క్షేత్రస్థాయి పరిశీలనలు, లోతైన సమీక్షలూ అవసరం. లేనట్టయితే అలాంటి నిర్ణయాలు బెడిసికొడతాయి. ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్లపై యూపీఏ ప్రభుత్వం తీసుకున్న రెండు నిర్ణయాలు ఆ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఏడాదిలో ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచినట్టు... సిలిండర్లతో ముడిపెట్టిన నగదు బదిలీ పథకాన్ని నిలిపేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు... 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభిం చాల్సిన తదుపరి దశ ఆధార్ నమోదు కార్యక్రమంపై వెనకడుగేసింది. ‘తగిన వ్యవధిలేకపోవడంతో’ దానికి సంబంధించిన ప్రతిపాదనను పరిశీలించడం కేంద్ర కేబినెట్‌కు సాధ్యం కాలేదట! ఆధార్ కార్యక్రమం ప్రారంభించిననాడూ... సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్లంటూ వర్గీకరించిన నాడూ... ఆధార్ కార్డుంటేనే సబ్సిడీ సిలిండర్, నగదు బదిలీ ఉంటుందని చెప్పిననాడూ చాలా మంది వ్యతిరేకించారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే విఫలమైన ఆధార్‌వంటి పథకాన్ని ఇక్కడ వర్తింపజేయాలనుకోవడం, దాని ఆధారంగా నగదు బదిలీ పథకం వంటివి ప్రారంభించాలనుకోవడం ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఏ దశలోనూ ఎవరి మాటా వినకుండా ముందుకెళ్లిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ మొహం చెల్లక తన నిర్ణయాలను తానే సవరించుకుంది. న్యూఢిల్లీలో ఈమధ్య జరిగిన ఏఐసీసీ సదస్సు సందర్భంగా మాట్లాడిన రాహుల్‌గాంధీ సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9నుంచి 12కు చేయాలని కోరినందువల్లే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు చెబుతున్నా ఇందులో అంతకుమించిన అంతరార్ధమే ఉంది. ఆధార్ నమోదు కార్యక్రమం ఒక పెద్ద ప్రహసనంగా తయారైంది. ఇలాంటి పథకాన్ని ఆసరా చేసుకుని అమలుజేయబూనుకున్న వంటగ్యాస్ సబ్సిడీ బెడిసికొట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్లే రాహుల్‌గాంధీ కోరినట్టు సిలిండర్ల సంఖ్య పెంపుతో ఊరుకోక నగదు బదిలీ పథకాన్ని కూడా నిలిపేశారు. దాంతోపాటు ఆధార్ తదుపరి కార్యక్రమంపైనా నిర్ణయాన్ని వాయిదావేశారు. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో... ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను ఉపశమింపజేయాలంటే ఇంతకంటే మార్గంలేదని యూపీఏ సర్కారు భావించింది. అందుకు రాహుల్‌ను అడ్డుబెట్టు కుంది. నగదు బదిలీ పథకం పనితీరును సమీక్షించడానికి ఒక కమిటీవేస్తామని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చమురు శాఖ మంత్రి వీరప్పమొయిలీ చెబుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో 18 రాష్ట్రాల్లోని 289 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ నెలనుంచి దీన్ని ఢిల్లీ, ముంబైలతోసహా మరో 105 జిల్లాలకు విస్తరించింది కూడా. గత ఏడాది జూన్ వరకూ సబ్సిడీ సిలెండర్ల సంఖ్యకు పరిమితిలేదు. అందువల్లే సబ్సిడీయేతర సిలిండర్ల సంఖ్య ఎంత పెరిగినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, సబ్సిడీ సిలిండర్లకు ఆంక్షలు విధించి 9మాత్రమే ఇవ్వడం మొదలెట్టాక, పదో సిలిండర్ నుంచి రెట్టింపుపైగా వసూలు చేయడం ప్రారంభించాక జనంలో వ్యతిరేకత మొదలైంది. అసలు ఆధార్‌కున్న చట్టబద్ధతే సందేహాస్పదం. 2009లో కేవలం పాలనాపరమైన ఉత్తర్వు ద్వారా ఇది అమల్లోకి వచ్చింది. 2011లో ఆధార్‌కు సంబంధించిన బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. సుప్రీంకోర్టు సైతం దీని చెల్లుబాటుపై సందేహాలు వ్యక్తంచేసింది. ఒకపక్క ఇదంతా సాగుతుండగానే దేశంలో పలు రాష్ట్రాల్లో ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం దాని తోవన అది నడుస్తూనే ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొననివారూ, పాల్గొన్నా కార్డురాని వారూ కోట్ల సంఖ్యలో ఉండగా... ఆకతాయిలు కొందరు జంతువుల పేర్లపైనా, పక్షుల పేర్లపైనా తీసుకున్న ఆధార్ కార్డులు వెలుగుచూసి ఆ పథకం పరువు తీశాయి. ఇంతటి అయోమయం పథకంతో నగదు బదిలీని ముడిపెట్టడం సహజంగానే అందరికీ ఆగ్రహం తె ప్పించింది. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 28.29 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో 9.03 లక్షలమందికి ఆధార్ కార్డు లేకపోవడంతో సబ్సిడీ సిలెండర్లు రావడంలేదు. మన రాష్ట్ర హైకోర్టు సైతం ఆధార్ కార్డుతో వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీని ముడిపెట్టవద్దని సూచించింది. దేశవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లలో 89.2 శాతం మంది ఏడాదికి 9 సిలిండర్లే వాడతారుగనుక మిగిలిన పది శాతం మంది మాత్రమే అదనపు మొత్తం చెల్లించాల్సి వస్తుందని కేంద్రం గతంలో కాకిలెక్కలు చెప్పింది. ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12 చేస్తూ చెప్పిన లెక్కల్లోనూ తేడాలున్నాయి. అదనంగా పెంచిన మూడు సిలిండర్లకూ ప్రభుత్వంపై అదనంగా ఏడాదికి రూ.5,000 కోట్ల భారం పడుతుందని...మొత్తం సబ్సిడీ భారం రూ.80,000 కోట్లవుతుందని మొయిలీ సెలవిస్తున్నారు. కానీ, చమురు సంస్థలపై కేంద్రం విధిస్తున్న అమ్మకం పన్ను, దిగుమతి సుంకం... ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్ వగైరాలన్నీ తీసేస్తే ఈ సబ్సిడీ భారం నికరంగా ఎంతో... ప్రజలకు ఇంకెంత చవగ్గా సిలిండర్లు సరఫరా చేయవచ్చునో తేటతెల్లమవుతుంది. మొత్తానికి కారణం ఏంచెప్పినా ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ల సంఖ్యా పెరిగింది, దాన్ని ఆధార్‌తో ముడిపెట్టే విధానమూ ఆగింది. ఈ అనుభవంతోనైనా ఇకపై నిర్ణయాలు తీసుకోవడంలో యూపీఏ సర్కారు విజ్ఞతను పాటిస్తుందని ఆశించాలి. -
ఏడాదికి ఇక 12 సబ్సిడీ సిలిండర్లు
-
ఏడాదికి ఇక 12 సబ్సిడీ సిలిండర్లు
గృహ వినియోగదారులకు సబ్సిడీ మాద ఇచ్చే గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. దేశంలోని దాదాపు 99 శాతం మంది ప్రజలు సబ్సిడీ మీద అందే గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కాస్త ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 17వ తేదీన జరిగిన ఏఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో సబ్సిడీ సిలెండర్ల సంఖ్య విషయంలో సర్కారు ఆఘమేఘాల మీద స్పందించింది. ''ప్రధానమంత్రి గారూ మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏడాదికి 9 సిలిండర్లు చాలవు. దేశ మహిళలు తమకు కనీసం 12 సిలిండర్లు కావాలని అడుగుతున్నారు'' అంటూ రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సమావేశం ముగియగానే వీరప్ప మొయిలీ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్ త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. అదే నిర్ణయం ఇప్పుడు వెల్లడైంది.