సంపాదకీయం: దేశ ప్రజలందరినీ ప్రభావితం చేయగల నిర్ణయాలను తీసుకునే ముందు క్షేత్రస్థాయి పరిశీలనలు, లోతైన సమీక్షలూ అవసరం. లేనట్టయితే అలాంటి నిర్ణయాలు బెడిసికొడతాయి. ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్లపై యూపీఏ ప్రభుత్వం తీసుకున్న రెండు నిర్ణయాలు ఆ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఏడాదిలో ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచినట్టు... సిలిండర్లతో ముడిపెట్టిన నగదు బదిలీ పథకాన్ని నిలిపేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు... 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభిం చాల్సిన తదుపరి దశ ఆధార్ నమోదు కార్యక్రమంపై వెనకడుగేసింది.
‘తగిన వ్యవధిలేకపోవడంతో’ దానికి సంబంధించిన ప్రతిపాదనను పరిశీలించడం కేంద్ర కేబినెట్‌కు సాధ్యం కాలేదట! ఆధార్ కార్యక్రమం ప్రారంభించిననాడూ... సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్లంటూ వర్గీకరించిన నాడూ... ఆధార్ కార్డుంటేనే సబ్సిడీ సిలిండర్, నగదు బదిలీ ఉంటుందని చెప్పిననాడూ చాలా మంది వ్యతిరేకించారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే విఫలమైన ఆధార్‌వంటి పథకాన్ని ఇక్కడ వర్తింపజేయాలనుకోవడం, దాని ఆధారంగా నగదు బదిలీ పథకం వంటివి ప్రారంభించాలనుకోవడం ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఏ దశలోనూ ఎవరి మాటా వినకుండా ముందుకెళ్లిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ మొహం చెల్లక తన నిర్ణయాలను తానే సవరించుకుంది.
న్యూఢిల్లీలో ఈమధ్య జరిగిన ఏఐసీసీ సదస్సు సందర్భంగా మాట్లాడిన రాహుల్‌గాంధీ సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9నుంచి 12కు చేయాలని కోరినందువల్లే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు చెబుతున్నా ఇందులో అంతకుమించిన అంతరార్ధమే ఉంది. ఆధార్ నమోదు కార్యక్రమం ఒక పెద్ద ప్రహసనంగా తయారైంది. ఇలాంటి పథకాన్ని ఆసరా చేసుకుని అమలుజేయబూనుకున్న వంటగ్యాస్ సబ్సిడీ బెడిసికొట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్లే రాహుల్‌గాంధీ కోరినట్టు సిలిండర్ల సంఖ్య పెంపుతో ఊరుకోక నగదు బదిలీ పథకాన్ని కూడా నిలిపేశారు. దాంతోపాటు ఆధార్ తదుపరి కార్యక్రమంపైనా నిర్ణయాన్ని వాయిదావేశారు.
లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో... ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను ఉపశమింపజేయాలంటే ఇంతకంటే మార్గంలేదని యూపీఏ సర్కారు భావించింది. అందుకు రాహుల్‌ను అడ్డుబెట్టు కుంది. నగదు బదిలీ పథకం పనితీరును సమీక్షించడానికి ఒక కమిటీవేస్తామని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చమురు శాఖ మంత్రి వీరప్పమొయిలీ చెబుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో 18 రాష్ట్రాల్లోని 289 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ నెలనుంచి దీన్ని ఢిల్లీ, ముంబైలతోసహా మరో 105 జిల్లాలకు విస్తరించింది కూడా. గత ఏడాది జూన్ వరకూ సబ్సిడీ సిలెండర్ల సంఖ్యకు పరిమితిలేదు. అందువల్లే సబ్సిడీయేతర సిలిండర్ల సంఖ్య ఎంత పెరిగినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, సబ్సిడీ సిలిండర్లకు ఆంక్షలు విధించి 9మాత్రమే ఇవ్వడం మొదలెట్టాక, పదో సిలిండర్ నుంచి రెట్టింపుపైగా వసూలు చేయడం ప్రారంభించాక జనంలో వ్యతిరేకత మొదలైంది.
అసలు ఆధార్‌కున్న చట్టబద్ధతే సందేహాస్పదం. 2009లో కేవలం పాలనాపరమైన ఉత్తర్వు ద్వారా ఇది అమల్లోకి వచ్చింది. 2011లో ఆధార్‌కు సంబంధించిన బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
సుప్రీంకోర్టు సైతం దీని చెల్లుబాటుపై సందేహాలు వ్యక్తంచేసింది. ఒకపక్క ఇదంతా సాగుతుండగానే దేశంలో పలు రాష్ట్రాల్లో ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం దాని తోవన అది నడుస్తూనే ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొననివారూ, పాల్గొన్నా కార్డురాని వారూ కోట్ల సంఖ్యలో ఉండగా... ఆకతాయిలు కొందరు జంతువుల పేర్లపైనా, పక్షుల పేర్లపైనా తీసుకున్న ఆధార్ కార్డులు వెలుగుచూసి ఆ పథకం పరువు తీశాయి. ఇంతటి అయోమయం పథకంతో నగదు బదిలీని ముడిపెట్టడం సహజంగానే అందరికీ ఆగ్రహం తె ప్పించింది. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 28.29 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో 9.03 లక్షలమందికి ఆధార్ కార్డు లేకపోవడంతో సబ్సిడీ సిలెండర్లు రావడంలేదు. మన రాష్ట్ర హైకోర్టు సైతం ఆధార్ కార్డుతో వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీని ముడిపెట్టవద్దని సూచించింది.
దేశవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లలో 89.2 శాతం మంది ఏడాదికి 9 సిలిండర్లే వాడతారుగనుక మిగిలిన పది శాతం మంది మాత్రమే అదనపు మొత్తం చెల్లించాల్సి వస్తుందని కేంద్రం గతంలో కాకిలెక్కలు చెప్పింది. ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12 చేస్తూ చెప్పిన లెక్కల్లోనూ తేడాలున్నాయి. అదనంగా పెంచిన మూడు సిలిండర్లకూ ప్రభుత్వంపై అదనంగా ఏడాదికి రూ.5,000 కోట్ల భారం పడుతుందని...మొత్తం సబ్సిడీ భారం రూ.80,000 కోట్లవుతుందని మొయిలీ సెలవిస్తున్నారు. కానీ, చమురు సంస్థలపై కేంద్రం విధిస్తున్న అమ్మకం పన్ను, దిగుమతి సుంకం... ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్ వగైరాలన్నీ తీసేస్తే ఈ సబ్సిడీ భారం నికరంగా ఎంతో... ప్రజలకు ఇంకెంత చవగ్గా సిలిండర్లు సరఫరా చేయవచ్చునో తేటతెల్లమవుతుంది. మొత్తానికి కారణం ఏంచెప్పినా ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ల సంఖ్యా పెరిగింది, దాన్ని ఆధార్‌తో ముడిపెట్టే విధానమూ ఆగింది. ఈ అనుభవంతోనైనా ఇకపై నిర్ణయాలు తీసుకోవడంలో యూపీఏ సర్కారు విజ్ఞతను పాటిస్తుందని ఆశించాలి.
తత్వం బోధపడినట్టేనా!
Published Fri, Jan 31 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
Advertisement
Advertisement