sudha narayan murthy
-
వ్యక్తిగత ప్రపంచం
‘ఒక గ్రంథాలయం, ఒక గార్డెన్ ఉందంటే నీకు కావాల్సినవన్నీ ఉన్నట్టే’ అన్నారు రోమన్ తత్వవేత్త సిసిరో. ఆ రెండింటితో పాటు ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ, కేవలం గ్రంథాలయం గురించే ముచ్చటగా తలుచుకున్నారు ఇటీవల ముగిసిన ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో తల్లి, రచయిత్రి సుధామూర్తితో అక్షతామూర్తి (బ్రిటన్ మాజీ ప్రధాని రిషీ సునాక్ భార్య) సంభాషిస్తూ తల్లికీ, తండ్రి (నారాయణ మూర్తి)కీ విడి పర్సనల్ లైబ్రరీలు (Personal Library) ఉండేవనీ; తల్లి దగ్గర సాహిత్యం, చరిత్ర పుస్తకాలుంటే, తండ్రి దగ్గర సైన్సు, టెక్నాలజీ పుస్తకాలుండేవనీ; తానూ, తమ్ముడు రోహన్ రెంటినీ కలగలిపి చదివేవారమనీ చెప్పారు. అన్నట్టూ, రోహన్ మూర్తి (Rohan Murty) పూనికతో 2015లో ప్రారంభమైన ‘మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ భారత సాహిత్యంలోని అన్ని క్లాసిక్స్ ఆంగ్లానువాదాలను ప్రచురిస్తోంది. ఏమైనా ఈ ‘ఇన్ఫోసిస్’ కుటుంబం పర్సనల్ లైబ్రరీ అనే భావనను మరోసారి సాహిత్య పాఠకులకు తియ్యగా గుర్తుచేసింది.వ్యక్తిగత లైబ్రరీ అనేదానికి నిర్దిష్ట కొలతలు లేవు. అన్ని సైజుల్లో, షేపుల్లో ఉంటుంది. అసలు ఏ ఆకృతి లేకుండా కేవలం పుస్తకాల దొంతర రూపంలోనూ ఉండొచ్చు. ఒంటరి పాఠకుడిగానూ, జీతం లేని లైబ్రేరియన్‌గానూ ద్విపాత్రాభినయం చేసే ఒకరి లైబ్రరీ ఇంకొకరి లైబ్రరీలా ఉండదు. అది వారి అభిరుచికీ, సౌకర్యానికీ అద్దం. పుస్తకాలను అక్షర క్రమంలో పెట్టుకుంటామా, సైజుల వారీగానా, వర్గీకరణ పరంగానా, రచయితల పరంగానా అన్నది వారి వారి ఛాయిస్. ఠక్కున తీసి చదువుకోగలిగే ఫేవరెట్స్ ఎక్కడ పెట్టుకోవాలో, రిఫరెన్స్ కోసం అవసరమయ్యే పుస్తకాలు ఎటువైపుంచాలో, ఎప్పుడోగానీ తీయమని తెలిసేవి ఎటు పక్కుంచాలో, అసలు ప్రతిపూటా తీయడం వల్ల నలిగిపొయ్యే నిఘంటువుల లాంటివి ఎక్కడ ఉంచితే మేలో, కొనడమేగానీ ఎన్నడూ పేజీ తిప్పిన పాపానపోని పుస్తకాలను ఏం చేయాలో ఎవరిది వారికే తెలుస్తుంది. ఏ పుస్తకం పక్కన ఏది వస్తే చెలిమి చేసినట్టుంటుందో, దేని పక్కన ఏది రాకుండా చూసుకుంటే గొడవ తప్పించినట్టు అవుతుందో కూడా చూసుకోవాలి. లైబ్రరీ అనేది భిన్న రూపాలుగా విస్తరించి ఉంటుందనేది నిజమే అయినా, ప్రాథమికంగా అది అచ్చు పుస్తకాల నిలయం. అమెరికా రచయిత్రి సూసన్ సోంటాగ్ దగ్గర 15,000 పుస్తకాల భారీ భాండాగారం ఉండేది. వాటిని ఆమె ఆర్ట్, ఆర్కిటెక్చర్, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, చరిత్ర, మతం... ఇలా ప్రక్రియలుగా విభజించి పెట్టుకునేవారు. అర్జెంటీనా– కెనడా రచయిత ఆల్బెర్టో మాంగ్యూల్ దగ్గర ఏకంగా 35,000 పుస్తకాలు ఉన్నాయి. వాటిని ఎక్కడా సరిగ్గా సర్దుకోలేక ఫ్రాన్స్‌లో అవి పట్టేంతటి ఒక పాత భవంతి దొరికితే దాన్ని ఆయన కొనేశారు. ఇక అబ్బురపరిచే మేధానిధి లాంటి ‘బాబాసాహెబ్’ అంబేడ్కర్ తన జీవితకాలంలో తన నివాసం ‘రాజగృహ’లో సుమారు యాభై వేల పుస్తకాలను సేకరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యక్తిగత గ్రంథాలయాల్లో ఇదీ ఒకటి. వందల నుంచి వేల పుస్తకాల ఇంటి లైబ్రరీలు ఉన్న రచయితలు, సాహిత్య ప్రేమికులు తెలుగులోనూ గురజాడ అప్పారావు నుంచి మొదలుకొని ఎందరో ఉన్నారు.సాహిత్య వాసన ఉన్నవారికైనా ఒకరి ఇంటికెళ్తే ముందు చూపు పడేది వారింట్లో ఉన్న పుస్తకాలపైనే! అది సంభాషణకు మంచి ఊతం కాగలదు. కానీ అన్నీ మూటగట్టేసి అటక మీద పెట్టేసే జీవితపు కరుకు వాస్తవంలోకి మనుషులు జారిపోతున్నారు. అందుకే కనీసం ప్రదర్శన నిమిత్తం అయినా లైబ్రరీలు ఇళ్లల్లో ఆకర్షణగా ఉండటం లేదు. చేతిలో పుస్తకంతో కనబడటం పాత వాసనగా మారిపోయింది. కలిసి ఒక సినిమాకో, షాపింగ్‌కో వెళ్లినట్టుగా స్నేహంగా లైబ్రరీకి వెళ్లడం అనేది ట్రెండీగా ఉండటం లేదు. అందుకే పర్సనల్ లైబ్రరీలు అటుండనీ, అసలు లైబ్రరీలే తగ్గిపోతున్నాయి. పుస్తకాలను చదవడం బరువైపోతోంది, వాటిని నిర్వహించడం భారమైపోతోంది. ‘‘మనం చదివిన స్కూల్ లైబ్రరీలోని తెలుగు పుస్తకాలు గత పాతికేళ్లుగా చదివినవాళ్లు లేరుట. తీసేస్తున్నారని తెలిసి కొంచెం సొమ్ము ఇచ్చి కొనేశాను’ అంటూ విశ్వం నుంచి మెసేజ్’’ అని మొదలవుతుంది విజయ కర్రా రాసిన ‘ఆ ఒక్కటి’ కథ. కథానాయకుడు పదో తరగతిలో ఉన్నప్పుడు రాసిన ప్రేమలేఖను ఆ అమ్మాయికి ఇచ్చే ధైర్యం లేక ఒక పుస్తకంలో పెడతాడు. ఇన్నింట్లో ఆ పుస్తకం ఏమిటో ఇన్నేళ్ల తర్వాత వెతకడం ఇందులో కథ. ఆ పుస్తకాల డబ్బాలు విప్పుతు న్నప్పుడు బయటపడే తెలుగు, బెంగాలీ, సంస్కృత, రష్యన్ రచయితల పేర్లు బయటికి చదువు కోవడం పుస్తక ప్రేమికులకు మాత్రమే అర్థమయ్యే సంతోషం. చివరకు ‘భ్రమరవాసిని’ నవల ఆఖరు పేజీలలో ఆ ప్రేమలేఖ బయటపడుతుంది. అలా ‘మన జాతి సంపద’ ఏమిటో తెలుస్తుంది.ఇటాలియన్ రచయిత అంబెర్తో ఎకో వ్యక్తిగత గ్రంథాలయంలో ముప్పె వేలకు పైగా పుస్తకాలు ఉండేవి. ఇందులో చాలా పుస్తకాలు చదవనివి ఉంటాయని దీన్ని ‘యాంటీ–లైబ్రరీ’ అని అభివర్ణించారు లెబనీస్–అమెరికన్ వ్యాసకర్త నసీమ్ నికోలస్ తలాబ్. ఒక్క క్లిక్ దూరంలో వందల ఈ–బుక్స్ అందుబాటులో ఉన్న సాంకేతిక యుగంలో, అవసరమైనది ఇట్టే బ్రౌజ్ చేయడం వీలుకాక పుస్తకాల దొంతరలన్నీ తిప్పి తిప్పలు పడాల్సిన పరిస్థితిలో... మన ఇంట్లో ‘స్పేస్’ ఇవ్వాల్సివచ్చే భౌతిక పుస్తకం విలువైనది అయివుండాలి. కానీ పుస్తకాలంటూ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే డిజిటల్ పుస్తకం చదివిన ఫీలివ్వదు; పుస్తకంలోని విషయమే తప్ప, ఆ పుస్తకం బయటి వ్యవహారంతో ముడిపడే జ్ఞాపకాన్నివ్వదు. మనసుకు నచ్చే కొన్ని పుస్తకాలతో అయినా ఇంటిని అలంకరించుకుందాం. గుండెల్లో భౌతిక పుస్తకాన్ని పదిలపరుచుకుందాం. -
ఆయనైతే 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా సుధామూర్తి
దేశంలో యువత "వారానికి 70 గంటలు" పని చేయాలని ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy)ఇచ్చిన సలహాపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, రచయిత్రి సుధా మూర్తి (Sudha Murty) స్పందించారు. తన భర్త నారాయణ మూర్తి వ్యాఖ్యలను సమర్థించారు. నిజమైన కష్టాన్నే నమ్ముతారు నారాయణమూర్తి స్వయంగా వారానికి 80-90 గంటలు పనిచేశారని, నిజమైన హార్డ్ వర్క్‌పై ఆయనకు నమ్మకం ఉందని సుధామూర్తి చెప్పారు. ‘ఆయన వారానికి 80 నుండి 90 గంటలు పని చేశారు. ఆయనకు అదే తెలుసు. నిజమైన కష్టాన్ని నమ్మే ఆయన అలాగే జీవించారు. అందుకే ఆయనకు అనిపించింది చెప్పారు’ అని సుధామూర్తి న్యూస్ 18కి చెప్పారు. ఈ రోజుల్లో కార్పొరేట్ ఇండియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నారాయణమూర్తికి చెప్పడానికి ప్రయత్నించారా అని అడిగినప్పుడు.. యువత భిన్న భావాలను కలిగి ఉంటారని, అయితే స్వయంగా ఎక్కువ గంటలు పనిచేసిన నారాయణ మూర్తి తన అనుభవాన్ని పంచుకున్నారని ఆమె వివరించారు. (టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..) భారతీయ యువత ఉత్పాదకతపై నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. యువత రోజుకు 12 గంటలు పని చేస్తేనే గత 2-3 దశాబ్దాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన దేశాలను భారత్ చేరుకోగలదని నారాయణమూర్తి ఇటీవల పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. భారతదేశ ఉత్పాదకత ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని ఆయన అన్నారు. -
సుధా నారాయణమూర్తిపై అసత్య ప్రచారం
సాక్షి, తిరుమల: టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. సుధా నారాయణమూర్తిపై ఫేస్బుక్లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. దాంతోపాటు శ్రీవారి ఆలయ చరిత్ర, టీటీడీపై దుష్ప్రచారం చేసిన మరో 8 మందిపై కూడా కేసులు పెట్టామని వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేల వ్యవహరించిన వారిపై చర్యలకు వెనకాడేది లేదని అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: తిరుపతి: 11 నుంచి దర్శనాలకు అనుమతి..) కాగా, తమిళ నటుడు శివకుమార్ ఓ వీడియోలో టీటీడీపై తప్పుడు ప్రచారం చేశారు. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అసత్య ప్రచారం చేశారు. తిరుమలకు వెళ్లొద్దంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీనిపై శ్రీవారి భక్తుడు తమిళ్ మయ్యన్ శివ కుమార్‌పై టీటీడీకి సమాచారం ఇచ్చారు. టీటీడీపై శివకుమార్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక జూన్ 30 వరకు శ్రీవారి దర్శనాలు రద్దు అంటు సోషల్ మీడియా, పత్రికలో అసత్య ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులపై, రెండు పత్రికలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీడీపీ తెలిపింది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ద్వారా వీరిపై కేసు నమోదైంది. ఫేస్బుక్ పేజీపైనా కేసు: డీఎస్పీ శ్రీవారి ఆలయం, భక్తులపై వివాదస్పద పదజాలం వాడిన తమిళ నటుడు శివకుమార్‌పై కేసు నమోదు చేసినట్టు తిరుమల డిఎస్పీ ప్రభాకర్ బాబు తెలిపారు. టీటీడీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.. తెలుగు ఎతిస్ట్ ఫేస్ బుక్ పేజీపైనా కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. (చదవండి: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరో కేసు) -
ఉన్నత విద్య సంస్కరణలపై కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ చైర్మన్‌గా 12 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) జేఎస్వీ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో సభ్యులుగా ప్రొఫెసర్ దేశాయ్ (ఐఐటీ డైరెక్టర్, హైదరాబాద్), ప్రొఫెసర్ జంధ్యాల బీజీ తిలక్ (మాజీ వీసీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్), ప్రొఫెసర్ నళిని జునేజా (ఎన్‌ఐయూపీఏ, ఢిల్లీ), ఆర్.వెంకటరెడ్డి (ఎంవీ ఫౌండేషన్), శ్రీమతి సుధా నారాయణమూర్తి (చైర్పర్సన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్), డాక్టర్ ఎన్.రాజశేఖరరెడ్డి, (మాజీ వీసీ, ఉన్నత విద్యామండలి), ఎస్.రామకృష్ణంరాజు (సామాజిక సేవా కార్యకర్త, భీమవరం), ఆలూరి సాంబశివారెడ్డి (విద్యాసంస్థల ప్రతినిధి), పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, కన్వీనర్, బి.ఈశ్వరయ్య (రిషివ్యాలీ, ఏనుములవారిపల్లి), డీవీఆర్కే ప్రసాద్ (ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్) ఉంటారు. జీవోలో పేర్కొన్న అంశాలివీ ప్రస్తుతం వేర్వేరు ప్రభుత్వ యాజమాన్యాల కింద నడుస్తున్న విద్యా సంస్థలకు సంబంధించి ఒకే రకమైన సమగ్ర పారదర్శక విధానాల అమలుకు సూచనలు చేయాలి. విద్యా సంస్థల్లో సుస్థిర ప్రమాణాల సాధనకు మౌలిక సదుపాయాల ఏర్పాటు, మానవ వనరుల కల్పన అంశాలపై సలహాలివ్వాలి. కేంద్ర మానవ వనరుల శాఖ నూతన విద్యావిధానం–2019 ముసాయిదాను అనుసరించి పాఠశాల విద్యలో కే–12 విధానంపై సూచనలు చేయాలి. ఓకేషనల్ విద్య మెరుగుదలకు సూచనలివ్వాలి ఎస్సీఈఆర్టీ సహా వివిధ సంస్థల పనితీరు మెరుగుపరిచేందుకు అవసరమైన సలహాలు ఇవ్వాలి. ఆరువారాల్లో ఈ కమిటీకి అవసరమైన సమాచారం, ఇతర అంశాలను సమకూర్చి, అది అందించే సూచనల మేరకు ’క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టు’ కింద యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. 2019–20 విద్యాసంవత్సరంలోనే దీని ప్రభావంతో మార్పులు కనిపించాలి. -
మైసూరులో ప్రారంభమైన దసరా ఉత్సవాలు
-
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి
తిరుమల ఆలయంలో ప్రమాణ స్వీకారం సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మ కర్తల మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 6 గంటలకు తిరుమల ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో ఆమెతో టీటీడీ ఈవో సాంబశివరావు ప్రమాణం చేయించారు. అనంతరం ఆమె శ్రీవారిని దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. సుధా నారాయణమూర్తి ప్రమాణ స్వీకారం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగింది. శ్రీవారి ధర్మకర్తల మండలిలో చోటు లభించటం అదృష్టంగా భావిస్తున్నానని సుధానారాయణమూర్తి ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత శ్రీవారిని దర్శించుకోవటం మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు. -
టీటీడీ సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణమూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. తమిళనాడులో ఏసీబీ దాడుల్లో పదవి కోల్పోయిన శేఖర్ రెడ్డి స్థానంలో సుధా నారాయణమూర్తిని నియమించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని టెల్కోలో డెవలప్మెంట్ ఇంజనీరింగ్‌గా తన కెరీర్ ప్రారంభించారు. బెంగళూరు యూనివర్సిటీలో కూడా ఆమె కంప్యూటర్ సైన్సును బోధిస్తున్నారు. అంతేకాక ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చైర్ పర్సన్‌గా ఆమె సేవలందిస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్యాల కార్యక్రమాలకు ఆమె ఓ సభ్యురాలుగా ఉన్నారు. కన్నడ, ఇంగ్లీష్‌లో ఆమె పలు రచనలు చేశారు. లోకోపకారిగా సుధా నారాయణమూర్తికి ఎంతో పేరొంది.