
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ చైర్మన్‌గా 12 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) జేఎస్వీ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో సభ్యులుగా ప్రొఫెసర్ దేశాయ్ (ఐఐటీ డైరెక్టర్, హైదరాబాద్), ప్రొఫెసర్ జంధ్యాల బీజీ తిలక్ (మాజీ వీసీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్), ప్రొఫెసర్ నళిని జునేజా (ఎన్‌ఐయూపీఏ, ఢిల్లీ), ఆర్.వెంకటరెడ్డి (ఎంవీ ఫౌండేషన్), శ్రీమతి సుధా నారాయణమూర్తి (చైర్‌పర్సన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్), డాక్టర్ ఎన్.రాజశేఖరరెడ్డి, (మాజీ వీసీ, ఉన్నత విద్యామండలి), ఎస్.రామకృష్ణంరాజు (సామాజిక సేవా కార్యకర్త, భీమవరం), ఆలూరి సాంబశివారెడ్డి (విద్యాసంస్థల ప్రతినిధి), పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, కన్వీనర్, బి.ఈశ్వరయ్య (రిషివ్యాలీ, ఏనుములవారిపల్లి), డీవీఆర్కే ప్రసాద్ (ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్) ఉంటారు.
జీవోలో పేర్కొన్న అంశాలివీ
- ప్రస్తుతం వేర్వేరు ప్రభుత్వ యాజమాన్యాల కింద నడుస్తున్న విద్యా సంస్థలకు సంబంధించి ఒకే రకమైన సమగ్ర పారదర్శక విధానాల అమలుకు సూచనలు చేయాలి.
- విద్యా సంస్థల్లో సుస్థిర ప్రమాణాల సాధనకు మౌలిక సదుపాయాల ఏర్పాటు, మానవ వనరుల కల్పన అంశాలపై సలహాలివ్వాలి.
- కేంద్ర మానవ వనరుల శాఖ నూతన విద్యావిధానం–2019 ముసాయిదాను అనుసరించి పాఠశాల విద్యలో కే–12 విధానంపై సూచనలు చేయాలి. ఓకేషనల్ విద్య మెరుగుదలకు సూచనలివ్వాలి
- ఎస్సీఈఆర్టీ సహా వివిధ సంస్థల పనితీరు మెరుగుపరిచేందుకు అవసరమైన సలహాలు ఇవ్వాలి.
- ఆరువారాల్లో ఈ కమిటీకి అవసరమైన సమాచారం, ఇతర అంశాలను సమకూర్చి, అది అందించే సూచనల మేరకు ’క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టు’ కింద యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. 2019–20 విద్యాసంవత్సరంలోనే దీని ప్రభావంతో మార్పులు కనిపించాలి.