
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి
తిరుమల ఆలయంలో ప్రమాణ స్వీకారం
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మ కర్తల మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 6 గంటలకు తిరుమల ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో ఆమెతో టీటీడీ ఈవో సాంబశివరావు ప్రమాణం చేయించారు. అనంతరం ఆమె శ్రీవారిని దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు.
ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. సుధా నారాయణమూర్తి ప్రమాణ స్వీకారం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగింది. శ్రీవారి ధర్మకర్తల మండలిలో చోటు లభించటం అదృష్టంగా భావిస్తున్నానని సుధానారాయణమూర్తి ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత శ్రీవారిని దర్శించుకోవటం మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు.