మరోమారు దొంగల బీభత్సం
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : పట్టణంలో దొంగతనాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల బాలాజీనగర్‌లో జరిగిన దొంగతనం ఘటన మరువక ముందే.. తాజాగా స్థానిక మయూరి హొటల్ సమీపాన సుజ ఇన్ఫో టెక్ షాపులో చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని మయూరి హొటల్ సమీపాన ఉన్న శ్రీనివాసా నర్సరీ కాంప్లెక్స్‌లో సుజ ఇన్ఫోటెక్ షాపు ఉంది. గురువారం రాత్రి దొంగలు షట్టర్‌కు ఉన్న తాళాన్ని విరగ్గొట్టి, లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న సుమారు మూడు లక్షల విలువైన సెల్‌ఫోన్ రీఛార్జ్ ఓచర్లు, టాపప్ కూపన్లను దొంగిలించారు. కప్‌బోర్డులో ఉన్న కంప్యూటర్ విడివస్తువులు, ఐదు విలువైన సెల్ఫోన్లను అపహరించారు.
యజమాని జి.లోకేష్ బాబు శుక్రవారం ఉదయం యథావిధిగా షాపు తెరిచేందుకు వచ్చారు. దొంగతనం జరిగినట్లు గుర్తించి ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్‌టీం కూడా సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా... సుజ ఇన్ఫోటెక్ పక్కనున్న మరో కార్యాలయంలోనూ దొంగలు ప్రవేశించి, చోరీకి యత్నించారు. బీరువాను తెరిచేందుకు ప్రయత్నించారు. రాకపోవడంతో వెనుదిరిగారు.
వేంకటేశ్వరుని ఆలయంలో చోరీ
చీపురుపల్లి : పట్టణంలోని శివరాం రోడ్డులో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆలయం ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు. ప్రధాన హుండీలో ఉన్న సుమారు రూ.25 వేల కానుకలను అపహరించారు. శుక్రవారం ఉదయం ఆలయ అర్చకుడు మురళి వచ్చి చూసేసరికి తలుపులు తెరచి ఉండడంతో ఆలయ కమిటీకి సమాచారం అందించారు. దుండగులు ఆలయంలో ఉన్న బీరువాను కూడా తెరచి అందులో ఉన్న వస్తువులు, స్వామి వారి వస్త్రాలు చిందర వందరగా పడేసినట్లు గుర్తించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు ఏఎస్సై ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.