ఆ ఆత్మాహుతి దాడి.. ఐఎస్ఐఎస్ పనే!
ఇస్తాంబుల్: ప్రపంచంలోని ప్రఖ్యాత పర్యాటక నగరమైన టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గూపేనని భావిస్తున్నారు. చారిత్రక పర్యాటక ప్రాంతమైన ఇస్లాంబుల్‌లోని సుల్తానామెట్‌లో సిరియాకు చెందిన సూసైడ్ బాంబర్ దాడికి పాల్పడ్డాడని, ఈ దాడిలో విదేశీ పర్యాటకులు సహా పది మంది చనిపోయారని టర్కీ అధ్యక్షుడు తయిపీ ఎర్డోగాన్ తెలిపారు.
సుల్తానామెట్‌లోని బ్లూ మసీదు, హజియా సోఫియా వద్ద విదేశీ పర్యాటకులు లక్ష్యంగా జరిగిన ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఉన్నది ఐఎస్ఐఎస్‌యేనని పోలీసులు భావిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ పర్యాటక నగరాల్లో ఒకటి.. ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే యూరప్ నగరమైన ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి దాడితో భీతావహ పరిస్థితి నెలకొంది. పేలుడు జరిగిన సుల్తానామెట్ స్వ్కేర్ వద్ద మృతిచెందిన వారి శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిఉండి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ ఘటనలో మృతిచెందిన, గాయపడిన వారిలో విదేశీ పర్యాటకులు కూడా ఉండటంతో పలు దేశాలు ఇప్పటికే అక్కడికి వెళ్లిన తమ దేశ పౌరులపై ఆరా తీస్తున్నాయి. జర్మనీ, నార్వే దేశాలు ఇస్తాంబుల్‌లోని తమ పర్యాటకుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాయి.