తొలగిన తెర
సమ్మెటివ్–3లో మాత్రమే జంబ్లింగ్ విధానంలో మూల్యాంకనం
8 జీఓ105 విడుదల
బుచ్చిరెడ్డిపాళెం : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశపెట్టిన సమ్మెటివ్ పరీక్షల మూల్యాంకనంలో నెలకొన్న సందిగ్ధతకు జీవో 105తో తెరపడింది. విద్యా సంస్కరణల్లో భాగంగా క్వార్టర్లీ పరీక్షల బదులు సమ్మెటివ్–1, హాఫ్ ఇయర్లీ పరీక్షల బదులు సమ్మెటివ్–2, సాంవత్సరిక పరీక్షల బదులు సమ్మెటివ్–3 పరీక్షలను తాజాగా ప్రవేశపెట్టిన విషయం విదితమే. అయితే కామన్ పరీక్ష విధానం బాగున్నా, జవాబు పత్రాల మూల్యాంకనానికి జంబ్లింగ్ విధానం ప్రవేశపెట్టడంతో గందరగోళం నెలకొంది. దీనిని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు జరిపిన చర్చలతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సమ్మెటివ్–1, 2 మూల్యాంకనం ఆయా పాఠశాలల్లో జరుగుతుంది. 8,9 తరగతులకు సంబంధించి సమ్మెటివ్–3 మాత్రమే ఒక మండలం పేపర్లు మరో మండలంలో మూల్యాంకనం చేస్తారు. పదో తరగతి విషయంలో సమ్మెటివ్–3 లేదు. ప్రతి ఏడాదిలా పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. గతంలో మాదిరిగా ఒక జిల్లా పేపర్లను మరో జిల్లాకు పంపి మూల్యాంకనం చేస్తారు. ఈ మేరకు జీఓ 105ను మంగళవారం ప్రభుత్వం విడుదల చేసింది.
పరీక్షలకు 1,89,482 మంది విద్యార్థులు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సమ్మెటివ్–1 కామన్ పరీక్ష జరగనుంది. అం దుకు జిల్లాలో ఆరు నుంచి పదో తరగతి వ రకు తెలుగుమీడియం 75,831 మంది,ఇంగ్లిష్ మీడియం 1,13,651మంది మొత్తం 1,89, 482మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దీనికి సం బంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. సమ్మెటివ్–1 కు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఈ నెల 17వ తేదీ నాటికి అన్ని మండల విద్యాధికార్యాలయాలకు చేరాయి.
నేటి నుంచి సమ్మెటివ్ –1 పరీక్షలు
నెల్లూరు (టౌన్): జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలకు 21వ తేదీ నుంచి 28 వరకు సమ్మెటివ్–1 పరీక్షలు జరగనున్నాయి. అన్ని యాజమాన్య పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఒకే ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం 6,7,8 తరగతులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, 9,10 తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.45 గంటల వరకు వృత్తి విద్యా పరీక్షలు జరగనున్నాయి. 22 నుంచి 28వ తేదీ వరకు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఒక పేపరు, 9,10 తరగతులకు పేపరు–1, పేపరు–2 ఉదయం, మధ్యాహ్నం సమయంలో పరీక్షలు నిర్వహించనున్నారు.