sun risers hyderabad team
-
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్‌కప్‌కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్‌లు వంటి స్టార్ ఆటగాళ్లకి భారత సెలక్షన్ కమిటీ చోటుఇవ్వలేదు. ముఖ్యంగా టీ20ల్లో టీమిండియా నయా ఫినిషర్‌గా మారిన రింకూ సింగ్‌ను సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం అందరిని షాక్‌కు గురిచేసింది. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌లతో బంతిని పంచుకునే మూడో పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్‌ను సెలక్టర్లు అనూహ్యంగా ఎంపిక చేశారు. ఐపీఎల్-2024లో నామమాత్రపు ప్రదర్శన చేస్తున్న అర్ష్‌దీప్‌ను ఎంపిక చేయడం పట్ల భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం షేన్ వాట్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత వరల్డ్‌కప్ జట్టులో మూడో పేసర్‌గా ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ చోటుదక్కుతుందని తను భావించినట్లు వాట్సన్ తెలిపాడు. "నటరాజన్‌కు భారత టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. నటరాజన్ యార్కర్లను అద్బుతంగా బౌలింగ్ చేయగలడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అతడు నిలికడగా రాణిస్తున్నాడు. అతడి బౌలింగ్‌లో వేరియషన్స్ కూడా ఉంటాయి. క్లిష్టపరిస్థితుల్లో తన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా నట్టూకు ఉందని" ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్సన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్.. 15 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. -
ఐపీఎల్ నష్టం రూ.3800 కోట్లు!
న్యూఢిల్లీ: ఓ వైపు వింబుల్డన్ రద్దయినా ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సంపూర్ణ బీమా గొడుగు కింద నష్టాల నుంచి గట్టెక్కగా... మరోవైపు ఐపీఎల్ రద్దయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం భారీగానే మూల్యం చెల్లించుకోనుంది. ఐపీఎల్–2020 సీజన్ జరగకపోతే బోర్డుకు భారీ నష్టం రానుంది. కోవిడ్–19 నుంచి రక్షణ పొందే కవరేజి లేకపోవడంతో సాధారణ బీమా వర్తించదు. దీంతో ఈ ఏడాది లీగ్ రద్దయితే రూ. 3800 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఓ నివేదిక తెలిపింది. ఇందులో సింహభాగం నష్టం బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కే వస్తుంది. ఏకంగా రూ. 3200 కోట్లు అధికారిక బ్రాడ్‌కాస్టర్‌కు వాటిల్లుతుంది. అయితే లీగ్ జరగలేదు కాబట్టి ప్రసారహక్కుల కోసం తాము చెల్లించాల్సిన భారీ మొత్తంనుంచి భారీ మినహాయింపు ఇవ్వాలని స్టార్ కచ్చితంగా బోర్డును కోరుతుంది. ఇరు పక్షాల ఒప్పందంలో ఇలాంటి నిబంధన ఉంటుందని క్రికెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇక మిగతా రూ. 600 కోట్లు స్టేక్హోల్డర్లకు వస్తుందని నివేదిక వెల్లడించింది. అంటే బోర్డుతో పాటు, ఫ్రాంచైజీలు, ఆతిథ్య వేదికల రాష్ట్ర క్రికెట్ సంఘాలు, లాజిస్టిక్స్, హోటల్స్, స్థానిక సంస్థలు, అలాగే పన్ను రూపేణా ఆయా ప్రభుత్వాలకు ఈ నష్టం ఎదురవుతుంది. ఇప్పటి వరకైతే ఈ సీజన్‌ను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసిన బీసీసీఐ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. లాక్డౌన్ పొడిగింపు అనివార్యమైన ప్రస్తుత తరుణంలో ఇక 14 తర్వాత కూడా టోర్నీ జరిగే అవకాశమైతే లేదు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తేసే ఆలోచన లేదని సూచనప్రాయంగా చెప్పేసింది. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలైతే కేంద్రానికి ముందే ఈ నెలాఖరుదాకా లాక్డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీంతో లాక్డౌన్ ఉంటే మ్యాచ్‌లకేం అవకాశముంటుంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న బీసీసీఐకి కూడా ఏప్రిల్ 15 తర్వాత ఆటకు అవకాశం లేదని తెలుసు. అయితే రద్దా లేక ఈ ఏడాది ఆఖరుకల్లా నిర్వహించే ప్రత్యామ్నాయాల్ని బోర్డు పరిశీలిస్తుంది. అయితే సాధ్యాసాధ్యాల్ని పరిశీలించాకే ప్రకటన చేస్తే బాగుంటుందని బోర్డు ఆఫీస్ బేరర్లు భావిస్తున్నారు. అందువల్లే బీసీసీఐ నుంచి ప్రకటన ఆలస్యమవుతుందనే వార్తలు వస్తున్నాయి. సన్‌రైజర్స్ సహాయం రూ. 10 కోట్లు కోవిడ్–19ను సమర్థంగా ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వానికి తమ వంతు ఆర్థిక సహాయం అందించేందుకు ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుకు వచ్చింది. సన్‌రైజర్స్ టీమ్ (సన్ టీవీ గ్రూప్) తరఫున కరోనా సహాయ నిధికి రూ. 10 కోట్లు ఇస్తున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దీనిపై హర్షం వ్యక్తం చేశాడు. ‘ఎంతో మంచి నిర్ణయం. వెల్డన్ సన్‌రైజర్స్’ అని వార్నర్ ట్వీట్ చేశాడు. -
మురళీ సార్.. దోశను చంపుతున్నారు
ఒకప్పుడు దూస్రాలతో బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించిన శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ దోస తింటున్న ఫొటో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న మురళీధరన్, తన టీం సభ్యులతో కలసి బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ తింటున్నప్పుడు కీపర్ శ్రీ వాత్సవ గోస్వామి ఫొటో తీశాడు. ‘మురళీ సార్ దోశను చంపుతున్నారు’ అనే అర్థంతో సన్ రైజర్స్ జట్టు ఆటగాడు గోస్వామి చేసిన ట్వీట్‌పై చాలామంది నెటిజన్లు జోకులు వేస్తూ, షేర్ చేస్తున్నారు. మురళీధరన్ దోశ తింటున్న ఫొటో షేర్ చేసిన శ్రీవాత్సవ గోస్వామికి పంజాబ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. సారథి కేన్ విలియమ్స్ గైర్హాజరీలో ఆడిన ఆ మ్యాచ్‌లో రైజర్స్ జట్టు ఓటమి పాలైంది. డేవిడ్ వార్నర్ 53 బంతుల్లో 85 పరుగులతో అదరగొట్టడంతో రైజర్స్ 181 పరుగులు చేయగలిగింది. కానీ ఛేదనలో భీకర ఆటగాడు ఆండ్రూ రస్సెల్ 19 బంతుల్లోనే 49 పరుగులు చేసి కోల్కత్తా జట్టును సులభంగా విజయ తీరాలకు చేర్చాడు. -
రైజర్స్ కాదు లూజర్స్!
ఐపీఎల్లో హైదరాబాద్ విఫలం చెత్త వ్యూహాలతో వరుస ఓటములు సమష్టి వైఫల్యంతో ఆరో స్థానం చెప్పుకోదగ్గ ప్రదర్శనే లేదు సాక్షి, హైదరాబాద్: అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్ల వైఫల్యం... అందివచ్చిన అవకాశాలు జారవిడవటం... అర్థం లేని వ్యూహాలు... ఫలితమే ఐపీఎల్-7లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పరాభవం. గత ఏడాది పరిమిత వనరులతోనే రైజర్స్ సంచలన విజయాలు సాధించింది. 16 మ్యాచుల్లో 10 గెలిచి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించగలిగింది. కానీ ఈసారి జట్టులో భారీతనం కనిపిస్తున్నా టోర్నీలో ఏ దశలోనూ తనదైన ముద్ర వేయలేకపోయింది. 14 మ్యాచుల్లో 6 మాత్రమే గెలిచి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. సరిగ్గా చెప్పాలంటే ఈ సీజన్లో అభిమానులను సంతృప్తిపరిచే విధంగా రైజర్స్ చెలరేగి ఆడిన మ్యాచ్ ఒక్కటీ లేకపోగా... ఒక్క ఆటగాడు కూడా అద్భుతం అనిపించే ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. వార్నర్ ఒక్కడే... ప్రపంచ క్రికెట్లో భారీ హిట్టర్లుగా పేరున్న డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్లతో పాటు శిఖర్ ధావన్‌లాంటి ఆటగాడు టాప్-3లో ఉండటం ఏ జట్టుకైనా బలమే. కానీ ఇది రైజర్స్ విషయంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. వార్నర్ ఒక్కడే నిలకడగా అన్ని మ్యాచ్‌లు ఆడినా అవన్నీ మరో ఎండ్‌లో చేసిన ఒంటరి పోరాటాలే అయ్యాయి. 14 ఇన్నింగ్స్‌లో వార్నర్ 6 అర్ధ సెంచరీలు సహా 528 పరుగులు చేయడం విశేషం. ఫించ్, ధావన్ మాత్రం తమపై ఉన్న అంచనాలను నిలబెట్టలేకపోయారు. ఫించ్ రెండు అర్ధ సెంచరీలు చేసినా అతని స్థాయి దూకుడు (117.49 స్ట్రైక్ రేట్) లేకపోవడంతో జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. కెప్టెన్సీ భారంతో ఇబ్బందులు పడిన ధావన్... వరుస వైఫల్యాల తర్వాత చివర్లో రెండు అర్ధ సెంచరీలు చేసినా అప్పటికే జట్టు పరిస్థితి చేజారిపోయింది. ఇక వికెట్ కీపర్ నమన్ ఓజా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడినా... అది టోర్నీ చివర్లోనే. ఆల్‌రౌండర్‌గా పనికొస్తారనుకున్న స్యామీ, ఇర్ఫాన్ పఠాన్, హెన్రిక్స్ రెండు రకాలుగానూ విఫలమయ్యారు. దేశవాళీ ఆటగాళ్లు వేణుగోపాలరావు, లోకేశ్ రాహుల్ ఇతర జట్లలోని భారత ఆటగాళ్ల తరహాలో ఏ మాత్రం కీలక ఇన్నింగ్స్‌లు ఆడలేకపోవడంతో రైజర్స్ బ్యాటింగ్ వనరులు పరిమితంగా మారిపోయాయి. ఆకట్టుకున్న భువనేశ్వర్... బౌలింగ్‌లో యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ రాణించడమే ఈ సీజన్లో సన్ జట్టుకు ఊరట కలిగించే అంశం. భారత ప్రధాన బౌలర్‌గా తనకున్న స్థాయిని నిలబెట్టుకుంటూ భువీ 14 మ్యాచుల్లో 20 వికెట్లు పడగొట్టాడు. ఆరంభ ఓవర్లలోనే కాకుండా చివర్లో కూడా అతను చాలా వరకు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలిగాడు. ఈసారి వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ గత సీజన్‌లాగే ఈసారి కూడా ఆకట్టుకున్నాడు. 7.42 ఎకానమీతో అతను 15 వికెట్లు తీశాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్ వికెట్లే అతను ఎక్కువగా తీయడం విశేషం. పొదుపుగా కూడా బౌలింగ్ చేస్తూ సహచరుడు అమిత్ మిశ్రాను వెనక్కి నెట్టి అన్ని మ్యాచ్‌లు ఆడిన కరణ్... తన ఫీల్డింగ్‌తో కూడా ప్రభావం చూపించగలిగాడు. అయితే వరల్డ్ నంబర్ వన్ బౌలర్ డేల్ స్టెయిన్ వైఫల్యం మాత్రం హైదరాబాద్ టీమ్‌ను తీవ్రంగా దెబ్బ తీసింది. చివరి ఓవర్లలో స్టెయిన్ ఆదుకుంటాడనుకున్న ప్రతీసారి అతనిపై ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ప్రదర్శించడంతో రైజర్స్ ఆశలు దెబ్బ తిన్నాయి. ఈసారి అతని బౌలింగ్‌లో మూడు సార్లు ఒక్కో ఓవర్లో 22, 24, 26 పరుగులు బాదటం స్టెయిన్ పరిస్థితిని సూచిస్తోంది. అమిత్ మిశ్రా ఘోరంగా విఫలం కాగా... 3 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ శర్మ ఆ తర్వాత బెంచీకే పరిమితయ్యాడు. వ్యూహాత్మక తప్పిదాలు... కోల్‌కతాతో జరిగిన చివరి మ్యాచ్‌కు ముందే హైదరాబాద్‌కు ప్లే ఆఫ్ అవకాశాలు లేకపోవచ్చు గాక... కానీ ఏ జట్టైనా విజయంతో ముగించాలని భావిస్తుంది. ఇలాంటి మ్యాచ్‌లో ఫించ్‌లాంటి అంతర్జాతీయ ఆటగాడి స్థానంలో అనిరుధ శ్రీకాంత్‌కు అవకాశం ఇవ్వడం ఏ రకమైన వ్యూహమో అర్థం కాదు. ఈ మ్యాచ్‌కు ముందు అనిరుధ గత రెండు ఐపీఎల్‌లలో కలిపి ఎదుర్కొన్న బంతులు 2 మాత్రమే! ఇదొక్కటే కాదు... టోర్నీ ఆరంభం నుంచి జట్టు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తూనే వచ్చింది. కోచ్ టామ్ మూడీ, మెంటర్లు శ్రీకాంత్, లక్ష్మణ్‌లతో కూడిన బృందం ఏం ఆలోచించిందో అర్ధం కాదు. ధావన్ కెప్టెన్సీకి పనికి రాడని 11 మ్యాచ్‌ల తర్వాత గానీ వారికి తెలియలేదు. ఓ వైపు మిశ్రాను చితకబాదుతున్నా, భువీ, స్టెయిన్‌లాంటి బౌలర్ల ఓవర్లు మిగిలి ఉన్నా అతనితో బౌలింగ్ కొనసాగించడం... స్ట్రైక్ పేసర్‌గా విండీస్ తరఫున ఆడిన స్యామీకి అసలు బౌలింగే ఇవ్వకపోవడం, లెఫ్ట్ హ్యాండర్ ఆడుతుంటే లెగ్‌స్పిన్నర్‌ను కొనసాగించడం... ఇలా ధావన్ పేలవ వ్యూహాలు టోర్నీ అంతా సాగాయి. వైవిధ్యం కోసమైనా ఆఫ్‌స్పిన్నర్ పర్వేజ్ రసూల్‌ను ఆడించాలని ఎవరూ భావించలేదు. ఈసారికి ఇంతే... పేరుకు హైదరాబాద్ జట్టే అయినా స్థానిక ఆటగాళ్లను అసలు రైజర్స్ మేనేజ్మెంట్ ఏ మాత్రం పట్టించుకోలేదు. హైదరాబాద్ ఆల్‌రౌండర్ ఆశిష్ రెడ్డి, ఆంధ్ర బ్యాట్స్‌మన్ రికీ భుయ్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్ పరిస్థితి కూడా ఇదే. వేణుగోపాలరావు ఒక్కడికే 7 మ్యాచ్‌లు దక్కాయి. విదేశీ ఆటగాళ్లలో హోల్డర్ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాగా... బ్రెండన్ టేలర్‌కు అదీ దక్కలేదు. దేశవాళీ ఆటగాళ్లలో మన్‌ప్రీత్ జునేజా, ప్రశాంత్ పరమేశ్వరన్, అమిత్ పౌనికర్ డగౌట్లోనే కూర్చోగా... ‘డాడీ శ్రీకాంత్’ అండతో అనిరుధ ఒక మ్యాచ్ ఆడగలిగాడు! మొత్తానికి సన్‌రైజర్స్ నిరాశజనక ఆటతీరుతో సీజన్‌ను ముగించింది. దాదాపుగా ఇదే జట్టు మరో రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. అప్పుడైనా మంచి ప్రణాళికతో ముందుకొచ్చి విజయాలు సాధిస్తుందేమో చూడాలి. -
రైజర్స్‌కు చావో.. రేవో
కోల్‌కతాతో నేడు కీలక మ్యాచ్ సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-7లో పడుతూ లేస్తూ సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో నిలిచింది. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించిన సన్‌రైజర్స్.. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇక దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. ఈ నేపథ్యంలో ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. సొంత వేదిక ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇప్పటికే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తొలిమ్యాచ్‌లో ముంబైపై బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగా ఓడినా.. పంజాబ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 205 పరుగుల భారీస్కోరు చేసి కూడా కాపాడుకోలేకపోయింది. డేల్ స్టెయిన్, భువనేశ్వర్, అమిత్ మిశ్రా, కరణ్ శర్మ వంటిబౌలర్లున్నా పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేకపోయారు. అయితే ప్రధానంగా బౌలింగ్ బలంపైనే ఆధారపడిన సన్‌రైజర్స్.. పంజాబ్‌పై ఓడినా భారీస్కోరు చేయడం జట్టుకు శుభసూచకమే. ఫించ్, వార్నర్, నమన్ ఓజాలు ఫామ్‌ను ప్రదర్శిస్తుండగా... తాజాగా కెప్టెన్ ధావన్ కూడా గాడిలో పడ్డాడు. అయితే వీరంతా సమష్టిగా రాణించడంపైనే భారీస్కోరు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. సూపర్‌ఫామ్‌లో నైట్‌రైడర్స్ మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుస విజయాలతో ఊపుమీదుంది. లీగ్‌లో తొలుత అనూహ్య పరాజయాలతో వెనకబడినా.. ఆపై తేరుకొని మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది. ఈ సీజన్లో తిరుగులేని విజయాలు సాధిస్తున్న పంజాబ్‌ను ఓడించడంతో పాటు ఆ తర్వాత వరుసగా మరో రెండు మ్యాచ్‌లు గెలవడంతో... రెట్టించిన ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. సన్‌రైజర్స్‌తో పోలిస్తే.. 10 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో ఉన్న కోల్‌కతా ప్లే ఆఫ్‌కు చేరువగా ఉంది. కెప్టెన్ గంభీర్, ఉతప్పలు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతోపాటు నాణ్యమైన విదేశీ, దేశవాళీ బ్యాట్స్‌మెన్ ఆ జట్టులో ఉన్నారు. బౌలింగ్‌లోనూ కలిస్, మోర్కెల్, వినయ్‌కుమార్, చావ్లా వంటి వారితో పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో కోల్‌కతా జైత్రయాత్రకు హైదరాబాద్ ఏ మేరకు బ్రేక్ వేయగలుగుతుందనేది ఆసక్తికరం. -
సన్‌రైజర్స్ సందడి
టీమ్ ప్రాక్టీస్ ప్రారంభం 14 మంది ఆటగాళ్లు హాజరు సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-7) కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ సన్నాహాలు మొదలు పెట్టింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఆ జట్టు బుధవారం ప్రాక్టీస్ ప్రారంభించింది. జట్టులోని మొత్తం 24 మంది సభ్యులలో 14 మంది ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఈ సెషన్ కొనసాగుతుంది. అనంతరం రైజర్స్ దుబాయ్ బయల్దేరి వెళుతుంది. ఈ నెల 18న అబుదాబిలో రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడనుంది. సరదాగా... సీరియస్‌గా... సన్‌రైజర్స్ తొలిరోజు ప్రాక్టీస్ సెషన్ దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. ముందుగా టీమ్ ట్రైనర్ జేడ్ రాబర్ట్స్ ఆటగాళ్లతో కొద్దిసేపు ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు చేయించాడు. చిన్నపిల్లల ఆటల తరహాలో కొన్ని సరదా విన్యాసాలతో శిక్షణను మొదలు పెట్టిన అతను ఆ తర్వాత సీరియస్‌గా కసరత్తు చేయించాడు. అనంతరం ప్రధాన కోచ్ టామ్ మూడీ, అసిస్టెంట్ కోచ్ హెల్మట్ కలిసి మైదానంలో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించారు. దాదాపు గంటపాటు సాధన చేసిన అనంతరం జట్టు సభ్యులు నెట్స్‌లోకి వెళ్లారు. మరో గంటన్నర పాటు ఆటగాళ్లు బ్యాటింగ్ సాధనలో పాల్గొన్నారు. జట్టు మెంటర్లు శ్రీకాంత్, వీవీఎస్ లక్ష్మణ్ ఈ మొత్తం శిక్షణను పర్యవేక్షించారు. ముఖ్యంగా లక్ష్మణ్ బౌలర్లకు సూచనలిస్తూ వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు. నేరుగా దుబాయ్‌కే... తొలిరోజు భారత ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, ఇషాంత్ శర్మలతో పాటు దేశవాళీ ఆటగాళ్లు కరణ్ శర్మ, నమన్ ఓజా, అనిరుధ శ్రీకాంత్, పర్వేజ్ రసూల్, ప్రశాంత్ పరమేశ్వరన్, మన్‌ప్రీత్ జునేజా, కేఎల్ రాహుల్, అమిత్ పౌనికర్ హాజరయ్యారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ క్రికెటర్లు వేణుగోపాలరావు, ఆశిష్ రెడ్డి, సీవీ మిలింద్, రికీ భుయ్ కూడా పాల్గొన్నారు. జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్‌తో పాటు అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్ గురువారం లేదా చివరి రోజు జట్టుతో చేరే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌లో సభ్యులుగా ఉన్న విదేశీ ఆటగాళ్లు ఫించ్, బ్రెండన్ టేలర్, స్టెయిన్, స్యామీ, వార్నర్, హోల్డర్, హెన్రిక్స్ ఈ స్వల్ప కాలిక క్యాంప్‌కు హాజరు కావడం లేదు. వారు నేరుగా దుబాయ్‌లోనే జట్టుతో కలుస్తారని రైజర్స్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
ముగ్గురికే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-7లో పాల్గొనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువ ఆటగాళ్లుకు చోటు లభించింది. హైదరాబాద్ ఆల్‌రౌండర్ ఆశిష్ రెడ్డి (రూ. 20 లక్షలు), లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్ (రూ. 10 లక్షలు), ఆంధ్ర బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (రూ. 10 లక్షలు) ఈ సారి ఐపీఎల్ బరిలోకి దిగనున్నారు. ఈ ముగ్గురిని కూడా హైదరాబాద్ ఫ్రాంచైజీనే వారి కనీసధరకు తీసుకుంది.ఆశిష్ రెడ్డి గత ఏడాది ఐపీఎల్‌లోనే సన్‌రైజర్స్ జట్టులో కీలక ఆటగాడిగా రాణించగా...భారత అండర్-19 జట్టు సభ్యులైన మిలింద్, భుయ్‌లకు ఇదే తొలి అవకాశం. ఇతర ఫ్రాంచైజీలు ఈ ఆటగాళ్లపై ఆసక్తి చూపించలేదు. అయితే గత సంవత్సరం రైజర్స్‌లో సభ్యుడిగా ఐపీఎల్‌తో పాటు చాంపియన్స్ లీగ్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడిన బ్యాట్స్‌మన్ హనుమ విహారికి మాత్రం ఈ సారికి చాన్స్ దక్కలేదు. హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్ అక్షత్ రెడ్డి, రవితేజ కూడా జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. గతంలో డెక్కన్ చార్జర్స్‌తో పాటు ముంబై, పుణే జట్లకు కూడా ఆడిన తిరుమలశెట్టి సుమన్‌కు కూడా నిరాశే ఎదురైంది. వీరితో పాటు రూ. 10 లక్షలనుంచి రూ. 30 లక్షల వరకు కనీస ధర పెట్టుకొని వేలంలో అదృష్టం పరీక్షించుకున్న హైదరాబాద్ ఆటగాళ్లు ఎవరినీ ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. మొత్తం 24 మంది ఆటగాళ్లతో రైజర్స్ జాబితా సిద్ధమైంది. జట్టుకు భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. ఈ జట్టులో 7 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా, 17 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. జట్టులో 8 మంది బ్యాట్స్‌మెన్, 9 మంది బౌలర్లు, నలుగురు ఆల్‌రౌండర్లు, ముగ్గురు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారత దేశవాళీ క్రికెటర్లు 1. కరణ్ శర్మ (రైల్వేస్) 2. కేఎల్ రాహుల్ (కర్ణాటక) 3. పర్వేజ్ రసూల్ (కాశ్మీర్) 4. పరమేశ్వరన్ (కేరళ) 5. ఏజీ పౌనికర్ (రైల్వేస్) 6. అనిరుధ (తమిళనాడు) 7. జునేజా (గుజరాత్) 8. ఆశిష్ రెడ్డి (హైదరాబాద్) 9. మిలింద్ (హైదరాబాద్) 10. రికీ భుయ్ (ఆంధ్ర) భారత ఆటగాళ్లు 1. శిఖర్ ధావన్ 2. అమిత్ మిశ్రా 3. భువనేశ్వర్ కుమార్ 4. ఇషాంత్ శర్మ 5. ఇర్ఫాన్ పఠాన్ 6. వేణుగోపాలరావు 7. నమన్ ఓజా విదేశీ ఆటగాళ్లు 1. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) 2. వార్నర్ (ఆస్ట్రేలియా) 3. ఫించ్ (ఆస్ట్రేలియా) 4. స్యామీ (వెస్టిండీస్) 5. హెన్రిక్స్ (ఆస్ట్రేలియా) 6. హోల్డర్ (వెస్టిండీస్) 7. బ్రెండన్ టేలర్ (జింబాబ్వే)