సన్‌రైజర్స్ సందడి
టీమ్ ప్రాక్టీస్ ప్రారంభం
14 మంది ఆటగాళ్లు హాజరు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-7) కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ సన్నాహాలు మొదలు పెట్టింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఆ జట్టు బుధవారం ప్రాక్టీస్ ప్రారంభించింది. జట్టులోని మొత్తం 24 మంది సభ్యులలో 14 మంది ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఈ సెషన్ కొనసాగుతుంది. అనంతరం రైజర్స్ దుబాయ్ బయల్దేరి వెళుతుంది. ఈ నెల 18న అబుదాబిలో రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడనుంది.
సరదాగా... సీరియస్‌గా...
సన్‌రైజర్స్ తొలిరోజు ప్రాక్టీస్ సెషన్ దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. ముందుగా టీమ్ ట్రైనర్ జేడ్ రాబర్ట్స్ ఆటగాళ్లతో కొద్దిసేపు ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్‌లు చేయించాడు. చిన్నపిల్లల ఆటల తరహాలో కొన్ని సరదా విన్యాసాలతో శిక్షణను మొదలు పెట్టిన అతను ఆ తర్వాత సీరియస్‌గా కసరత్తు చేయించాడు.
అనంతరం ప్రధాన కోచ్ టామ్ మూడీ, అసిస్టెంట్ కోచ్ హెల్మట్ కలిసి మైదానంలో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించారు. దాదాపు గంటపాటు సాధన చేసిన అనంతరం జట్టు సభ్యులు నెట్స్‌లోకి వెళ్లారు. మరో గంటన్నర పాటు ఆటగాళ్లు బ్యాటింగ్ సాధనలో పాల్గొన్నారు. జట్టు మెంటర్లు శ్రీకాంత్, వీవీఎస్ లక్ష్మణ్ ఈ మొత్తం శిక్షణను పర్యవేక్షించారు. ముఖ్యంగా లక్ష్మణ్ బౌలర్లకు సూచనలిస్తూ వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు.
నేరుగా దుబాయ్‌కే...
తొలిరోజు భారత ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, ఇషాంత్ శర్మలతో పాటు దేశవాళీ ఆటగాళ్లు కరణ్ శర్మ, నమన్ ఓజా, అనిరుధ శ్రీకాంత్, పర్వేజ్ రసూల్, ప్రశాంత్ పరమేశ్వరన్, మన్‌ప్రీత్ జునేజా, కేఎల్ రాహుల్, అమిత్ పౌనికర్ హాజరయ్యారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ క్రికెటర్లు వేణుగోపాలరావు, ఆశిష్ రెడ్డి, సీవీ మిలింద్, రికీ భుయ్ కూడా పాల్గొన్నారు. జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్‌తో పాటు అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్ గురువారం లేదా చివరి రోజు జట్టుతో చేరే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌లో సభ్యులుగా ఉన్న విదేశీ ఆటగాళ్లు ఫించ్, బ్రెండన్ టేలర్, స్టెయిన్, స్యామీ, వార్నర్, హోల్డర్, హెన్రిక్స్ ఈ స్వల్ప కాలిక క్యాంప్‌కు హాజరు కావడం లేదు. వారు నేరుగా దుబాయ్‌లోనే జట్టుతో కలుస్తారని రైజర్స్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.