రైజర్స్ కాదు లూజర్స్!
ఐపీఎల్‌లో హైదరాబాద్ విఫలం
చెత్త వ్యూహాలతో వరుస ఓటములు
సమష్టి వైఫల్యంతో ఆరో స్థానం
చెప్పుకోదగ్గ ప్రదర్శనే లేదు
సాక్షి, హైదరాబాద్: అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్ల వైఫల్యం... అందివచ్చిన అవకాశాలు జారవిడవటం... అర్థం లేని వ్యూహాలు... ఫలితమే ఐపీఎల్-7లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పరాభవం.
గత ఏడాది పరిమిత వనరులతోనే రైజర్స్ సంచలన విజయాలు సాధించింది. 16 మ్యాచుల్లో 10 గెలిచి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించగలిగింది. కానీ ఈసారి జట్టులో భారీతనం కనిపిస్తున్నా టోర్నీలో ఏ దశలోనూ తనదైన ముద్ర వేయలేకపోయింది. 14 మ్యాచుల్లో 6 మాత్రమే గెలిచి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. సరిగ్గా చెప్పాలంటే ఈ సీజన్‌లో అభిమానులను సంతృప్తిపరిచే విధంగా రైజర్స్ చెలరేగి ఆడిన మ్యాచ్ ఒక్కటీ లేకపోగా... ఒక్క ఆటగాడు కూడా అద్భుతం అనిపించే ప్రదర్శన ఇవ్వలేకపోయాడు.
వార్నర్ ఒక్కడే...
ప్రపంచ క్రికెట్‌లో భారీ హిట్టర్లుగా పేరున్న డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్‌లతో పాటు శిఖర్ ధావన్‌లాంటి ఆటగాడు టాప్-3లో ఉండటం ఏ జట్టుకైనా బలమే. కానీ ఇది రైజర్స్ విషయంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. వార్నర్ ఒక్కడే నిలకడగా అన్ని మ్యాచ్‌లు ఆడినా అవన్నీ మరో ఎండ్‌లో చేసిన ఒంటరి పోరాటాలే అయ్యాయి. 14 ఇన్నింగ్స్‌లో వార్నర్ 6 అర్ధ సెంచరీలు సహా 528 పరుగులు చేయడం విశేషం. ఫించ్, ధావన్ మాత్రం తమపై ఉన్న అంచనాలను నిలబెట్టలేకపోయారు.
ఫించ్ రెండు అర్ధ సెంచరీలు చేసినా అతని స్థాయి దూకుడు (117.49 స్ట్రైక్ రేట్) లేకపోవడంతో జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. కెప్టెన్సీ భారంతో ఇబ్బందులు పడిన ధావన్... వరుస వైఫల్యాల తర్వాత చివర్లో రెండు అర్ధ సెంచరీలు చేసినా అప్పటికే జట్టు పరిస్థితి చేజారిపోయింది. ఇక వికెట్ కీపర్ నమన్ ఓజా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడినా... అది టోర్నీ చివర్లోనే. ఆల్‌రౌండర్‌గా పనికొస్తారనుకున్న స్యామీ, ఇర్ఫాన్ పఠాన్, హెన్రిక్స్ రెండు రకాలుగానూ విఫలమయ్యారు. దేశవాళీ ఆటగాళ్లు వేణుగోపాలరావు, లోకేశ్ రాహుల్ ఇతర జట్లలోని భారత ఆటగాళ్ల తరహాలో ఏ మాత్రం కీలక ఇన్నింగ్స్‌లు ఆడలేకపోవడంతో రైజర్స్ బ్యాటింగ్ వనరులు పరిమితంగా మారిపోయాయి.
ఆకట్టుకున్న భువనేశ్వర్...
బౌలింగ్‌లో యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ రాణించడమే ఈ సీజన్‌లో సన్ జట్టుకు ఊరట కలిగించే అంశం. భారత ప్రధాన బౌలర్‌గా తనకున్న స్థాయిని నిలబెట్టుకుంటూ భువీ 14 మ్యాచుల్లో 20 వికెట్లు పడగొట్టాడు. ఆరంభ ఓవర్లలోనే కాకుండా చివర్లో కూడా అతను చాలా వరకు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలిగాడు. ఈసారి వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ గత సీజన్‌లాగే ఈసారి కూడా ఆకట్టుకున్నాడు. 7.42 ఎకానమీతో అతను 15 వికెట్లు తీశాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్ వికెట్లే అతను ఎక్కువగా తీయడం విశేషం. పొదుపుగా కూడా బౌలింగ్ చేస్తూ సహచరుడు అమిత్ మిశ్రాను వెనక్కి నెట్టి అన్ని మ్యాచ్‌లు ఆడిన కరణ్... తన ఫీల్డింగ్‌తో కూడా ప్రభావం చూపించగలిగాడు.
అయితే వరల్డ్ నంబర్ వన్ బౌలర్ డేల్ స్టెయిన్ వైఫల్యం మాత్రం హైదరాబాద్ టీమ్‌ను తీవ్రంగా దెబ్బ తీసింది. చివరి ఓవర్లలో స్టెయిన్ ఆదుకుంటాడనుకున్న ప్రతీసారి అతనిపై ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ప్రదర్శించడంతో రైజర్స్ ఆశలు దెబ్బ తిన్నాయి. ఈసారి అతని బౌలింగ్‌లో మూడు సార్లు ఒక్కో ఓవర్లో 22, 24, 26 పరుగులు బాదటం స్టెయిన్ పరిస్థితిని సూచిస్తోంది. అమిత్ మిశ్రా ఘోరంగా విఫలం కాగా... 3 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ శర్మ ఆ తర్వాత బెంచీకే పరిమితయ్యాడు.
వ్యూహాత్మక తప్పిదాలు...
కోల్‌కతాతో జరిగిన చివరి మ్యాచ్‌కు ముందే హైదరాబాద్‌కు ప్లే ఆఫ్ అవకాశాలు లేకపోవచ్చు గాక... కానీ ఏ జట్టైనా విజయంతో ముగించాలని భావిస్తుంది. ఇలాంటి మ్యాచ్‌లో ఫించ్‌లాంటి అంతర్జాతీయ ఆటగాడి స్థానంలో అనిరుధ శ్రీకాంత్‌కు అవకాశం ఇవ్వడం ఏ రకమైన వ్యూహమో అర్థం కాదు. ఈ మ్యాచ్‌కు ముందు అనిరుధ గత రెండు ఐపీఎల్‌లలో కలిపి ఎదుర్కొన్న బంతులు 2 మాత్రమే! ఇదొక్కటే కాదు... టోర్నీ ఆరంభం నుంచి జట్టు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తూనే వచ్చింది.
కోచ్ టామ్ మూడీ, మెంటర్‌లు శ్రీకాంత్, లక్ష్మణ్‌లతో కూడిన బృందం ఏం ఆలోచించిందో అర్ధం కాదు. ధావన్ కెప్టెన్సీకి పనికి రాడని 11 మ్యాచ్‌ల తర్వాత గానీ వారికి తెలియలేదు. ఓ వైపు మిశ్రాను చితకబాదుతున్నా, భువీ, స్టెయిన్‌లాంటి బౌలర్ల ఓవర్లు మిగిలి ఉన్నా అతనితో బౌలింగ్ కొనసాగించడం... స్ట్రైక్ పేసర్‌గా విండీస్ తరఫున ఆడిన స్యామీకి అసలు బౌలింగే ఇవ్వకపోవడం, లెఫ్ట్ హ్యాండర్ ఆడుతుంటే లెగ్‌స్పిన్నర్‌ను కొనసాగించడం... ఇలా ధావన్ పేలవ వ్యూహాలు టోర్నీ అంతా సాగాయి. వైవిధ్యం కోసమైనా ఆఫ్‌స్పిన్నర్ పర్వేజ్ రసూల్‌ను ఆడించాలని ఎవరూ భావించలేదు.
ఈసారికి ఇంతే...
పేరుకు హైదరాబాద్ జట్టే అయినా స్థానిక ఆటగాళ్లను అసలు రైజర్స్ మేనేజ్‌మెంట్ ఏ మాత్రం పట్టించుకోలేదు. హైదరాబాద్ ఆల్‌రౌండర్ ఆశిష్ రెడ్డి, ఆంధ్ర బ్యాట్స్‌మన్ రికీ భుయ్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్ పరిస్థితి కూడా ఇదే. వేణుగోపాలరావు ఒక్కడికే 7 మ్యాచ్‌లు దక్కాయి.
విదేశీ ఆటగాళ్లలో హోల్డర్ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాగా... బ్రెండన్ టేలర్‌కు అదీ దక్కలేదు. దేశవాళీ ఆటగాళ్లలో మన్‌ప్రీత్ జునేజా, ప్రశాంత్ పరమేశ్వరన్, అమిత్ పౌనికర్ డగౌట్‌లోనే కూర్చోగా... ‘డాడీ శ్రీకాంత్’ అండతో అనిరుధ ఒక మ్యాచ్ ఆడగలిగాడు! మొత్తానికి సన్‌రైజర్స్ నిరాశజనక ఆటతీరుతో సీజన్‌ను ముగించింది. దాదాపుగా ఇదే జట్టు మరో రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. అప్పుడైనా మంచి ప్రణాళికతో ముందుకొచ్చి విజయాలు సాధిస్తుందేమో చూడాలి.