sunbath
-
బీచ్‌లో బైడెన్ సందడి.. వైరల్‌గా ఫొటోలు
డెలావర్: ఊపిరిసలపని పనుల్లో సతమతమయ్యే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెలావర్ బీచ్‌లో సందడి చేశారు. 80 ఏళ్ల వయసున్న బైడెన్ భార్య జిల్ బైడెన్, మనవరాలు ఫిన్నెగన్తో కలిసి బీచ్‌లో కాసేపు సన్ బాత్ తీసుకున్నారు. కుటుంబంతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ పని ఒత్తిళ్ల నుంచి రిలాక్సయ్యారు. బీచ్‌కి వెళ్లే వారికి అధ్యక్షుడు వస్తున్నారని సమాచారం కాస్త ముందుగా ఇచ్చారు. దీంతో బీచ్‌లో అక్కడక్కడా జనం కనిపిస్తూనే ఉన్నారు. అయిదు రోజుల యూరప్ పర్యటనకి వెళ్లడానికి ముందు శనివారం డెలావర్‌లోని రెహోబాత్ బీచ్‌కు బైడెన్ వచ్చారు. ఆ రోజు కాస్త సూర్యుడు రావడంతో సన్ బాత్ తీసుకున్న ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. -
నగ్నంగా బీచ్‌లో.. ఊహించని ఘటనతో పరుగో పరుగు
ఒక పక్క కొత్త వేరియెంట్ల విజృంభణ. మరోవైపు లాక్డౌన్ తరహా ఆంక్షల విధింపు. అనవసరంగా బయట అడుగుపెట్టొద్దనే ఆదేశాలు. అయినా కూడా ఆస్ట్రేలియాలో ఆదేశాల్ని పెడచెవిన పెట్టి నిబంధనల్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఓ విచిత్రమైన ఘటనలో ఇద్దరికి మొట్టికాయలు వేశారు అధికారులు. సౌత్‌వేల్స్: సౌత్ సిడ్నికీ చెందిన ఇద్దరు వ్యక్తులు.. సన్‌బాత్ కోసమని ఆదివారం మధ్యాహ్నాం దగ్గర్లోని బీచ్‌కు చేరుకున్నారు. నగ్నంగా ఒడ్డున కూర్చుని సూర్య కాంతిని ఆస్వాదిస్తున్నారు. ఆ టైంలో ఎటునుంచి వచ్చిందో తెలియదుగానీ.. ఓ దుప్పి వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. అంతే.. దానిని చూడగానే వాళ్ల గుండెలు జారిపోయాయి. అక్కడి నుంచి పరుగులు అందుకున్నారు. వాళ్లను తరుముతూ అది వెనకాలే వెళ్లింది. ఆ కంగారులో పక్కనే ఉన్న రాయల్ నేషనల్ పార్క్‌లోకి దౌడు తీశారు వాళ్లిద్దరూ. ఇక వాళ్ల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రంతా గాలించి ఆ వ్యక్తుల్ని (ఒకరి వయసు 30, మరొకరి వయసు 49) ఆచూకీ కనిపెట్టగలిగారు. ఇద్దరూ ఓ చెట్టు మీద దాక్కుని రక్షించమని కేకలు వేస్తున్నారు. ‘ఇలాంటి మూర్ఖులను ఎలాంటి చట్టాలతో అడ్డుకోవాలో అర్థం కావట్లేదు’ అని సౌత్ వేల్స్ పోలీస్ కమిషన్ మిక్ ఫుల్లర్ వ్యాఖ్యానించాడు. కరోనా ఉల్లంఘనల నేరం కింద ఇద్దరికీ 760 డాలర్ల ఫైన్ విధించారు. సౌత్ వేల్స్ స్టేట్‌లో కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే సౌత్ వేల్స్లో 40మందికి జరిమానాలు విధించారు అధికారులు. చదవండి: పాత ఎఫైర్.. తన పేషీలోని జాబ్.. మంత్రి రాసలీలలు -
సన్బాత్తో గుండెపోటు, బీపీ కూడా రాదు
సూర్యుడి లేలేత కిరణాలకు సేదతీరితే శరీరంలో 'డి' విటమిన్ పెరిగి శరీరానికి కొత్త శక్తి వస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. సన్‌బాత్ వల్ల ఒక్క డి విటమిన్ రావడమే కాకుండా అనేక ప్రయోజనాలు ఉన్నాయని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, లావు తగ్గి సన్నబడతారని, ముఖ్యంగా లేత ఎండ వేడికి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ విడుదలవుతుందని, తద్వారా గుండెపోటు సమస్యలు కూడా రావని కనుగొన్నారు. అలాగే సన్‌బాత్ వల్ల మెదడులో సెరొటోనిన్ అనే రసాయనం విడుదల కావడంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారని, ఆస్తమా, కండరాల బలహీనతకు దారితీసే స్క్లేరోసిస్ లాంటి జబ్బులు రావని కూడా తేల్చారు. స్టాక్‌హోమ్‌లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ సరికొత్త అంశాలు వెలుగుచూశాయి. గత 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా సన్‌బాత్ చేస్తున్న స్వీడన్‌కు చెందిన మూడువేల మంది మహిళలపై అధ్యయనం చేయడం ద్వారా ఈ కొత్త ప్రయోజనాలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. డి విటమిన్‌కు, ఈ కొత్త ప్రయోజనాలకు ఎలాంటి సంబంధం లేదని కూడా వారు తెలిపారు. పొగతాగడం ఎంత ముప్పో, సన్‌బాత్ చేయకపోవడం అంత ముప్పని, పొగతాగే వారు ఎక్కువ కాలం బతకనట్లే సన్‌బాత్ చేయనివారు కూడా ఎక్కువ కాలం బతకరని వారన్నారు. సన్‌బాత్ వల్ల ఆయురారోగ్యాలతో ఎక్కువ కాలం జీవిస్తారని చెప్పారు. వారు తమ అధ్యయన వివరాలను ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు. సన్ బాత్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నా.. చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మాత్రం ఉంటుందని హెచ్చరించారు.