sundaraiah vignana kendram
-
3 రోజుల పాటు తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో నవంబర్ 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనందచారి తెలిపారు. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో లిటరరీ ఫెస్ట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లిటరరీ ఫెస్ట్‌లో వాగ్గేయ కారుల సమ్మేళనంతోపాటు సినిమా పాటల సాహిత్యంపై సెమినార్ ఉంటుందన్నారు. సుమారు 85 మంది కవులు రాసిన సినిమా పాటల సాహిత్యంపై వ్యాసాల పత్ర సమర్పణ ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది పాటకు పట్టం కడుతూ.. గీత రచయితలను, గీతాలాపకులను, వాగ్గేయ కారులను, సినిమా సాహిత్యకారులను ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితీ రాష్ట్ర నాయకులు రాంపల్లి రమేష్, అనంతోజు మోహన కృష్ణ, తంగిరాల చక్రవర్తి, ఎస్.కె. సలీమా, రేఖ, శరత్, ప్రభాకరచారి, రామకృష్ణ, చంద్రమౌళి, పేర్ల రాములు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: సమాజం విస్మరించిన అసలైన కోవిడ్ వారియర్స్ వాళ్లే) -
పౌరహక్కుల సంఘం ప్రథమ మహాసభలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం ప్రథమ మహాసభలను బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈ నెల 7,8 తేదీల్లో(శని, ఆదివారం) జరుగనున్నాయి. ప్రజాఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు ఆదివాసులపై అధర్మ యుద్ధాలు, బూటకపు ఎన్కౌంటర్లు అనే అంశాలపై ఈ సభలో చర్చించనున్నారు. దేశంలో మతోన్మాదం, మతతత్వం, దళితులపై దాడులు, ఆదివాసులను అడవినుంచి తరిమివేయడం, ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, ఉద్యమాలను అణచివేయడం, ప్రపంచ బ్యాంక్ ఎజెండాను ఇక్కడ అమలు పరచడం, జైళ్లలో ఉండే ఖైదీల హక్కులు లాంటి సమస్యలపై అతిథులు ప్రసంగించనున్నారు. ఈ సభకు అరుంధతి రాయ్, సోని సోరి, ప్రొఫెసర్ నందిని సుందర్, ఫ్రొఫెసర్ కాత్యాయనీ, ఫ్రొఫెసర్. హరగోపాల్, ఫ్రొఫెసర్. శేషయ్య పాల్గొననున్నట్లు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఫ్రొఫెసర్. గడ్డం లక్ష్మణ్, నారయణ రావులు ఓ ప్రకటనలో తెలిపారు. -
'ఎర్రజెండాలు కలవడం ఖాయం'
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): ఎప్పటికైనా ఎర్రజెండాలు కలిసిపోవటం ఖాయమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాలక పక్షానికి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. బుధవారం బాగ్‌లింగంపల్లిలోని పాలమూరు బస్తీలో జరిగిన ఎంసీపీఐ(యు) నేత ఓంకార్ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. వామపక్షాల ఐక్యతను సీపీఎం అంగీకరిస్తుందన్నారు. చీలిపోయి బూర్జువా పార్టీలకు వత్తాసు పలకటం వల్లనే కమ్యూనిస్టులకు ఈ దుస్థితి దాపురించిందని ఆయన అన్నారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. చీలిపోయిన వామపక్షాలు చిక్కిపోయాయని, విడిపోయి పడిపోయాయని అన్నారు. ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాండ్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యుడు విజయ్ కుమార్ చౌదరి, రాష్ట్ర కార్యదర్శి ఎండీ గౌస్ పాల్గొన్నారు. -
అణచివేతను తెలంగాణ ప్రజలు సహించరు
హైదరాబాద్: అణచివేతను తెలంగాణ ప్రజలు సహించరని, ఎంత ప్రజాస్వామ్యం ఉంటే అంత స్వేచ్ఛ ఉంటుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) ఆధ్వర్యంలో ‘టీవీవీ మహాసభల’పై నిర్బంధాన్ని ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి సంఘాల మీద దాడి చేసినా, అణచివేసినా ఎవరు ఏమి ప్రశ్నించరని భావించే నేతలకు కనువిప్పు కలగాలన్నారు. ఒక్క విద్యార్థి సంఘాన్ని అణచివేస్తే అన్ని విద్యార్థి సంఘాలు ఐక్యం కావటం శుభపరిణామమన్నారు. ఇలాగే కొనసాగితే ఉద్యమం చేయాల్సి వస్తుందని, ప్రజల్ని మరో ఉద్యమంలోకి నెట్టవద్దని కోరారు. మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు జీవన్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థును నిర్బంధంలోకి నెట్టటం హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమస్యపై సదస్సు నిర్వహించుకునే విద్యార్థ్ధి సంఘంపై నిర్బంధంరాజ్యాంగానికి విరుద్ధమన్నారు. టీవీవీ అధ్యక్షుడు ఎన్.మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీవీవీ కార్యదర్శి ఆజాద్, ప్రొఫెసర్ చక్రధర్ రావు, టీపీఎఫ్ అధ్యక్షుడు పులిమామిడి మద్దిలేటి, పలు ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.