'ఎర్రజెండాలు కలవడం ఖాయం'
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): ఎప్పటికైనా ఎర్రజెండాలు కలిసిపోవటం ఖాయమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాలక పక్షానికి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. బుధవారం బాగ్‌లింగంపల్లిలోని పాలమూరు బస్తీలో జరిగిన ఎంసీపీఐ(యు) నేత ఓంకార్ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. వామపక్షాల ఐక్యతను సీపీఎం అంగీకరిస్తుందన్నారు. చీలిపోయి బూర్జువా పార్టీలకు వత్తాసు పలకటం వల్లనే కమ్యూనిస్టులకు ఈ దుస్థితి దాపురించిందని ఆయన అన్నారు.
అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. చీలిపోయిన వామపక్షాలు చిక్కిపోయాయని, విడిపోయి పడిపోయాయని అన్నారు. ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాండ్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యుడు విజయ్ కుమార్ చౌదరి, రాష్ట్ర కార్యదర్శి ఎండీ గౌస్ పాల్గొన్నారు.