
హైదరాబాద్: ఇరవై ఎనిమిది పార్టీలతో కలసి ఈ నెల 25న హైదరాబాద్‌లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) ఆవిర్భావ సదస్సు జరగనుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బీఎల్‌ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆవిర్భావ సదస్సుకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ హాజరవుతారని చెప్పారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సదస్సు పోస్టర్‌ను తమ్మినేని ఆవిష్కరించారు.
కార్పొరేటర్ శక్తుల దోపిడీ, అగ్రకులాల పెత్తనాన్ని అడ్డుకోవడానికే ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. బీఎల్‌ఎఫ్ చైర్మన్ నల్లా సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన గతానికి భిన్నంగా ఏమీ లేదని విమర్శించారు. ప్రజలను మోసం చేయడానికే మంత్రి నాయిని, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డ్రామా ఆడుతున్నారని తెలంగాణ లేబర్ పార్టీ అధ్యక్షుడు జి.రమేశ్ విమర్శించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు జానకిరాములు, పీఎల్.విశ్వేశ్వరరావు, మద్దికాయల అశోక్, ఖాన్ షబాదుల్లాఖాన్, డాక్టర్ రామనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment