ముంపు నిర్వాసితులకు మంచి ప్యాకేజీ: హరీశ్‌రావు
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్లతో ముంపునకు గురయ్యే గ్రామాలను సహాయ పునరావాసం కింద మంచి ప్యాకేజీ అందజేస్తామని నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం ఈ అంశమై టీఆర్ఎస్ సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ప్రకారం నిర్వాసితులకు మార్కెట్ రేటుకు మూడురె ట్లు, ఎస్సీ, ఎస్టీలకు అయితే నాలుగు రెట్లు పరిహారం చెల్లిస్తామన్నారు. ఇక ప్రాణ హిత ఎత్తు, లెండి, పెన్‌గంగ, ఇచ్ఛంపల్లి ప్రాజెక్టుల సత్వర పూర్తికి సరిహద్దు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు మరో ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.
75 వేల మందికొక 108: లక్ష్మారెడ్డి
108, 104 సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం లక్షల మందికి ఒక అంబులెన్స్ ఉందని, దానిని 75 వేల మందికి ఒకటి అందుబాటులో ఉంచేలా వాటి సంఖ్యను 506కు పెంచామన్నారు. బడ్జెట్లో సైతం వాటి నిర్వహణకు రూ.60 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
మైనార్టీల సంక్షేమానికి చర్యలు: సీఎం
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మంగళవారం ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, బలాలా, ముంతాజ్ అహ్మద్ ఖాన్లు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మైనార్టీల సంక్షేమానికి వీలుగా సచార్ కమిటీ ప్రతిపాదనలను అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఎలాంటి సూచనలు చేయలేదని చెప్పారు. రాష్ట్ర పరిధిలోనే మైనార్టీల అభివృద్ధికి స్కాలర్షిప్పులు, స్టడీ సర్కిళ్లు, విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు.