గ్రీవెన్స్... నో క్లియరెన్స్ !
పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లెకు చెందిన సూరా జయలక్ష్మమ్మకు ఇందిరమ్మ ఇల్లు ఉంది. అదే గ్రామానికి చెందిన మరోవ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించాడు. బతిమలాడినా గృహాన్ని అప్పగించలేదు. తహశీల్దార్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఏడేళ్లుగా ఆమె కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉంది. సమస్య పరిష్కారం కానే లేదు.
బంగారుపాళెం మండలం దామరాకలవజ్జు గ్రామానికి చెందిన పుష్పరాజు ఇంటివద్ద దారిస్థలాన్ని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఆక్రమించాడు. ఇంట్లోకి వెళ్లాలన్నా ఇబ్బందే. తహశీల్దారు స్పందించకపోవడంతో కోర్టుకెళ్లాడు. పుష్పరాజుకు అనుకూలంగానే తీర్పువచ్చింది. కానీ అధికారులు పట్టించుకోలేదు. ఐదేళ్లుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు.
సాక్షి, చిత్తూరు: మండల కేంద్రాల్లో అధికారులు సమస్యలు పరిష్కరించడంలేదు. కొన్నిచోట్ల గ్రీవెన్స్డేలు మొక్కుబడిగా నిర్వహిస్తుండగా మరికొన్ని చోట్ల అస్స లు ఆ వైపే కన్నెత్తి చూడడంలేదు. దీంతో సమస్యలు పేరుకుపోతున్నాయి. ప్రజలు కలెక్టర్ కార్యాలయ తలుపు తడుతున్నారు. ఇక్కడి అధికారులు అర్జీలు తీసుకుని తిరిగి వారిని మండల కేంద్రాలకే పంపుతున్నారు. ఇలా ఏళ్లకొద్దీ తిరుగుతున్నా సమస్యలు పరిష్కరం కావడంలేదు. జిల్లా వ్యాప్తంగా గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు వివిధ సమస్యలపై 1,557 వినతి పత్రాలు అందగా అందులో కేవలం 451 సమస్యలను మాత్రమే అధికారులు పరిష్కరించారంటే గ్రీవెన్స్‌డే ఎంతమొక్కుబడిగా సాగుతోందో స్పష్టమవుతోంది.
చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్, చిన్నగొట్టిగల్లు, రామచంద్రాపురం మండలాల్లో సోమవారం గ్రీవెన్స్ డేకు అధికారులు ఢుమ్మా కొట్టారు. రూరల్ తహశీల్దార్ హాజరుకాలేదు. చిన్నగొట్టిగల్లులో తహశీల్దార్, ఎంపీడీవోతో పాటు మిగిలిన అధికారులు గ్రీవెన్స్‌డేకి హాజరుకాలేదు. రామచంద్రాపురం మండలంలోనూ ఇదే పరిస్థితి. పెన్షన్లు, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
జీడీనెల్లూరు నియోజకవర్గంలో పాలసమద్రంలో తహశీల్దార్ మినహా ఏ అధికారీ గ్రీవెన్స్‌డేకు రాలేదు. పెనుమూరులో ఎంపీడీవో, వెలుగు, ఏవో మినహా మిగిలిన అధికారులు రాలేదు. వెదురుకుప్పంలో తహశీల్దార్ మినహా ఎవరూ హాజరుకాలేదు. జీడీనెల్లూరులో ఎంపీడీవో మాలతీకుమారి తప్ప మిగిలిన వారు హాజరుకాలేదు.
పలమనేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రెవెన్యూ అధికారులు మినహా మిగిలిన శాఖల వారు హాజరుకాలేదు. పలమనేరులో తహశీల్దార్ కొంతసేపు మాత్రమే ఉండి డీలర్ల సమావేశానికి వెళ్లిపోయారు. తరువాత హైదరాబాద్‌కు వెళ్లారు. 60 మంది వరకు ప్రజలు వినతిపత్రాలను కార్యాలయంలో ఇచ్చి వెళ్లారు
పీలేరు నియోజకవర్గంలో గ్రీవెన్స్‌డేకు ముఖ్యమైన అధికారులెవ్వరూ రాలేదు. కేవలం పంచాయతీ కా ర్యదర్శులు వచ్చి అర్జీలను తీసుకుని వెళ్లిపోయారు.
పూతలపట్టు నియోజకవర్గంలోని పూతలపట్టులో తహశీల్దార్ మాత్రమే గ్రీవెన్స్‌డేకు వచ్చారు. మిగిలిన చోట్ల తహశీల్దార్, ఎంపీడీవోలు కూడా హాజరుకాలేదు. ప్రజలు తొలగించిన పెన్షన్ సమస్యలపై, భూ సమస్యలపై వినతిపత్రాలు తెచ్చి అధికారులు లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు
తంబళ్లపల్లె నియోజకవర్గంలో నామమాత్రం గ్రీవెన్స్ డే జరిగింది. బి.కొత్తకోటలో గ్రీవెన్స్‌డే జరగలేదు. చాలా చోట్ల ఇదే పరిస్థితి. పింఛన్లు, ఇంటి స్థలాలు కావాలంటూ అర్జీదారులు వచ్చి తిరిగి వెళ్లిపోయారు.
మదనపల్లె నియోజకవర్గంలోని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్‌డే మొక్కుబడిగా సాగింది. ఉదయం కార్యాలయానికి వచ్చిన సబ్ కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ క్యాంపునకు వెళ్లిపోయారు. తిరిగి 12.10 గంటలకు కార్యాలయానికి వచ్చారు. వైద్యాధికారులు, పంచాయతీరాజ్ , అగ్రికల్చర్ , ఆర్డబ్ల్యూఎస్ శాఖకు చెందిన నలుగురు అధికారులు మాత్రమే వచ్చారు. మండలస్థాయి అధికారులు రాలేదు. 200 మంది ప్రజలు అర్జీలిచ్చేందుకు వచ్చారు.
సత్యవేడు నియోజకవర్గంలో సత్యవేడు, నారాయణవనం, బుచ్చినాయుడుకండ్రిగల్లో 11 గంటలవరకు తహశీల్దార్, ఎంపీడీవోలు గ్రీవెన్స్‌డే కార్యక్రమానికి రాలేదు. మిగిలిన మండలాల్లో సైతం ఇదే పరిస్థితి. పుంగనూరు, నగరి నియోజకవర్గాల్లోనూ ఇదేపరిస్థితి.
కుప్పం నియోజకవర్గంలో గ్రీవెన్స్‌డే మొక్కుబడిగా జరిగింది. కుప్పంలో అధికారులు గ్రీవెన్స్‌డే నిర్వహించకుండా ఉపాధి హామీ సమావేశం నిర్వహించారు. శాంతిపురంలో ఎంపీడీవో మాత్రమే హాజరయ్యారు.
చిత్తూరు కలెక్టరేట్లో కలెక్టర్ లేరు. హైదరాబాద్‌కు వెళ్లారు. జాయింట్ కలెక్టర్ గ్రీవెన్స్‌డే నిర్వహించారు.