దోచుకున్న వారికి దోచుకున్నంత..
3 రోజుల ఆర్టీసీ సమ్మెతో తాత్కాలిక కార్మికుల చేతివాటం
ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ శూన్యం
బిక్కుబిక్కుమంటూనే ప్రయాణికుల పయనం
జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల్లో ఇదే తంతు
ఆత్మకూరు : సమయం వచ్చింది..! దోచుకున్న వారికి దోచుకున్నంత అన్న తీరున ఆర్టీసీలో సమ్మె పుణ్యమాని తాత్కాలిక కార్మికులుగా నమోదైన వారు చేతివాటం చూపుతున్న ఉదంతమిది. ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారంతో మూడో రోజుకు చేరింది. దీంతో పలు ఆర్టీసీ డిపోల్లో అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసి బస్సులను నడిపేందుకు విశ్వప్రయత్నమే చేస్తున్నారు. దీంతో జిల్లాలోని నెల్లూరు 1, 2, ఆత్మకూరు, కావలి, రాపూరు, వెంకటగిరి, గూడూరు, సూళూరుపేట, వాకాడు, ఉదయగిరి డిపోల్లో మొత్తం 402 బస్సులను శుక్రవారం రోడ్డుపైకి పంపారు.
రోజుకు డ్రైవర్‌కు రూ.1000, కండెక్టర్‌కు రూ.800 వంతున చెల్లించే ఒప్పందాలు కుదిరాయి. అన్ని యూనియన్లతో పాటు ఆర్టీసీ సూపర్వైజర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో రోడ్డుపై వెళ్లే బస్సుల్లో ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. దీంతో తాత్కాలిక కార్మికులు రెచ్చిపోతున్నారు. శుక్రవారం ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తుండడంతో వీరి చేతివాటం మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారింది.
ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు ప్రయాణికుల సంఖ్యను నమోదు చేసుకుంటూ మిగిలిన సొమ్ము స్వాహా చేస్తున్నారు. ప్రయాణం మధ్యలో ఎవరు ఎక్కడ ఎక్కినా దిగినా వారి నుంచి లెక్కాపక్కా లేకుండా నగదు వసూలు చేస్తున్నారు. ఆ లెక్కలేమి ఎస్‌ఆర్‌లోకి ఎక్కకపోవడం గమనార్హం. ఉదాహరణకు ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో శుక్రవారం 57 బస్సులకు గాను 28 సర్వీసులు రోడ్డుపైకి వచ్చాయి. ఆత్మకూరు-నెల్లూరు వెళ్లే ప్రయాణికుల సంఖ్య మాత్రమే కొంతకు కొంత రికార్డుల్లోకి ఎక్కుతుంది.
మధ్యలో ఉండే ఊళ్లలో ఎవరూ ఎక్కడ ఎక్కిన దిగినా అదంతా వసూలు చేసుకోవడం, గాంధీ లెక్కతో జమకడుతున్నారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఈ తంతు కొనసాగుతుందని ప్రయాణికులు బాహాటంగా చెబుతున్నారు. అసలే సమ్మెతో ఆర్టీసీ నష్టాల ఊబిలో కొనసాగుతుండగా మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఆర్టీసీకి రావాల్సిన ఆదాయానికి తాత్కాలిక కార్మికులు గండి కొట్టడం చర్చనీయాంశమైంది. తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లకు అంతంతమాత్రమే అనుభవం ఉండటంతో ఈ బస్సుల్లో ప్రయాణించే వారు అభద్రతతోనే ప్రయాణిస్తున్నారు.
బస్సులపై నిఘా ఉంచుతాం : - దివ్య కామాక్షి, డీఎం, ఆత్మకూరు
తాత్కాలిక కార్మికుల చేతివాటంపై నిఘా ఉంచుతాం. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రయాణికుల చార్జీల సొమ్ము స్వాహా కాకుండా చూస్తాం. మోటారు వాహనాల తనిఖీ అధికారి పరిశీలన అనంతరమే తాత్కాలిక డ్రైవర్ల నియామకాలు చేపడుతున్నాం. ఎంసెట్ విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ఆత్మకూరు డిపో నుంచి 48 బస్సు సర్వీసులను నడిపాం. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు ఒక్కొక్కటిగా చేపడుతున్నాం.