13 ఏళ్లకే అమ్మాయిలు అలా..
చదువులో డిగ్రీ సాధించాలని, యూనివర్సిటీలో చేరాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఏ వయసులో మీకు చదువుల పట్ల సద్భావన కలిగింది? స్టడీస్ మీద శ్రద్ధపెట్టి ఎదగాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు?
మీరు అబ్బాయిలైతే గనక ఈ ప్రశ్నలను మరోసారి జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే డిగ్రీ సాధించడం, వర్సిటీల్లో చేరాలనే నిర్ణయాలు తీసుకోవడంలో అబ్బాయిలు వెనుకబడిపోతున్నారు. అదే అమ్మాయిలైతే 13 ఏళ్లకే వర్సిటీలో చేరాలనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనంలో ఉన్నత చదువులపై అమ్మాయిలు అబ్బాయిలకన్నా ఎక్కువ సానుకూల దృక్ఫథంలో ఉన్నట్లు వెల్లడైంది.
లండన్ కు చెందిన సట్టన్ ట్రస్ట్ నిర్వహించిన ఈ సర్వేలో 65 శాతం అమ్మాయిలు వర్సిటీల్లో చదువుకోవాలని చిన్నవయసులోనే ఫిక్స్ అవుతుండగా, అబ్బాయిలు 58 శాతం మందే అలా భావిస్తున్నారని తేలింది. యూరప్ లో ఉన్నత విద్యను అభ్యసించే అబ్బాయిల శాతం (36) కంటే అమ్మాయిల శాతమే (46) ఎక్కువగా ఉండటం కూడా వారి పాజిటివ్ ఆటిట్యూడ్ కు మరో కారణం. 61 శాతం మంది అమ్మాయిలు డిగ్రీ చదవడం అత్యావశ్యం అనుకుంటే, 13 శాతం మంది మాత్రం దానిని తేలికగా తీసుకుంటున్నారు. 10 మంది అమ్మాయిల్లో ఒక్కరు మాత్రమే డిగ్రీ అవసరమేలేదని భావిస్తున్నారట.
ఈ రిపోర్టు సాదాసీదాగా చేసిందేమీకాదని, 3000 మంది విద్యార్థినీ విద్యార్థుల సమగ్రవివరాలు సేకరించిన పిదప గణాంకాలను సిద్ధంచేశామని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ కేత్ సేల్వా చెబుతున్నారు. 13 ఏళ్ల వయసులో అమ్మాయిలు అబ్బాయిల మధ్య లింగపరమైన బేధాలు ఏర్పాడతాయని, అయితే భవిష్యత్ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలకే స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు.