సుజ్లాన్ ఎనర్జీ రైట్స్ ఇష్యూ 11న
న్యూఢిల్లీ: పవన విద్యుత్ రంగ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ రైట్స్ ఇష్యూ వచ్చే వారం(11న) ప్రారంభంకానుంది. కంపెనీ వ్యవస్థాపకులు, సీఎండీ తులసి తంతి ఇటీవల కన్ను మూసిన నేపథ్యంలో రైట్స్ ఇష్యూ అంశంపై సుజ్లాన్ తాజాగా స్పష్టతనిచ్చింది. రైట్స్ ద్వారా కంపెనీ రూ. 1,200 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ప్రమోటర్లు సైతం రైట్స్‌లో పాలుపంచుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రమోటర్ల కోటాలో రైట్స్‌కు పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ చేసేందుకు ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంసిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.
వెరసి గత నెల 28న ప్రతిపాదించిన ఎల్‌వోఎఫ్ ప్రకారం రైట్స్ ఇష్యూని చేపట్టనున్నట్లు వివరించింది. ఎల్‌వోఎఫ్ ప్రకారం షేరుకి రూ. 5 ధరలో 240 కోట్ల పాక్షిక చెల్లింపుల షేర్లను జారీ చేయనుంది. తద్వారా రూ. 1,200 కోట్లు సమకూర్చుకోనుంది. రైట్స్‌లో భాగంగా అక్టోబర్ 4కల్లా(రికార్డ్ డేట్) అర్హతగల వాటాదారుల వద్దగల ప్రతీ 21 షేర్లకుగాను 5 షేర్లను జారీ చేయనుంది. రైట్స్ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
రైట్స్ వార్తల నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 1.25 శాతం నీరసించి రూ. 7.90 వద్ద ముగిసింది.