మాటలూ పాటలూ విని ప్రేక్షకులు విజిల్స్ వేస్తారు!
‘‘సతీశ్ అనుకున్నదానికంటే బాగా అభినయించాడు. అతని నటన చూసి క్లైమాక్స్ మార్చేశాను. అంత గొప్పగా చేశాడు. ఇందులోని మాటలూ పాటలూ విని ప్రేక్షకులు విజిల్స్ వేస్తారు. యమునిగా మోహన్‌బాబుగారి రాజసంతో కూడిన నటన, బ్రహ్మానందం హాస్యం... ఇలా ఈ సినిమాలో అన్నీ హైలైట్సే’’ అని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పారు. అలీని హీరోగా పరిచయం చేస్తూ 20 ఏళ్ల క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘యమలీల’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా డా॥హీరోగా పరిచయం చేస్తూ ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యమలీల-2’. దియా నికోలస్ కథానాయిక.
ఎస్వీ కృష్ణారెడ్డి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శ్రీకాంత్ పాటల సీడీని ఆవిష్కరించి, ఎస్వీ కృష్ణారెడ్డికి అందించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘ఈ పాటలు విని ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్లిపోయాను. ఈ రోజు కుటుంబ ప్రేక్షకులకు నేను దగ్గరయ్యానంటే కారణం ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డిగార్లే. ఈ సినిమాతో ఎస్వీకేకి మంచి సక్సెస్ రావాలి. మళ్లీ ఆయన దర్శకత్వంలో నేను నటించాలి’’ అని ఆశాభావం వెలిబుచ్చారు. ‘యమలీల’ ఏడాది ఆడితే, ‘యమలీల-2’ రెండేళ్లు ఆడాలని కె.రాఘవేంద్రరావు ఆకాంక్షించారు. ‘‘శ్రేయోభిలాషుల సహకారం వల్లే ఈ సినిమాను త్వరగా పూర్తి చేయగలిగాను. అచ్చిరెడ్డిగారి ప్లానింగ్, కృష్ణారెడ్డిగారి ఎగ్జిక్యూషన్ వల్ల అనుకున్నదానికంటే నెలరోజుల ముందే సినిమాను విడుదల చేయగలుగుతున్నాం. ఇందులో కృష్ణారెడ్డిగారి ఎమోషన్స్ మరో స్థాయిలో చూస్తారు. పాటలన్నీ కథలో భాగంగానే ఉంటాయి’’
అని సతీశ్ చెప్పారు. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్,
సి.కల్యాణ్, శివలెంక కృష్ణప్రసాద్, సుధీర్‌బాబు, జె.కె.భారవి, శాసనసభ్యులు
ప్రభాకరచౌదరి తదితరులు పాల్గొన్నారు. కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో డి.ఎస్.మ్యాక్స్
సమర్పణలో, క్రిష్వీ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.