swachabharath
-
చెత్తే కదా అని పారేస్తే..
సాక్షి, ముంబై: ముంబై నగరంతోపాటు తూర్పు, పశ్చిమ ఉప నగరాలలో నాలాల్లో చెత్త వేయడం, పరిసరాలను దుర్గంధం చేస్తున్న వారి నుంచి జరిమానా విధించడం బీఎంసీ ప్రారంభించింది. స్వచ్ఛతా అభియాన్‌లో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు బీఎంసీ అధికారులు చేపట్టిన దాడుల్లో మొత్తం రూ.50 లక్షల జరిమానా వసూలు చేశారు. దీంతో నాలాల్లో, మురికి కాల్వల్లో చెత్తవేసి పరిసరాలను దుర్గంధం చేస్తున్న మురికివాడల ప్రజల్లో దడ మొదలైంది. అంతేగాకుండా స్వచ్ఛతా అ భియాన్ను మరింత విస్తరించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ అభియాన్‌లో పాల్గొననున్నారు. దీంతో ఈ పథకం మరింత పకడ్భందిగా అమలు కానుంది. వీకెండ్స్‌లో జనజాగృతి నగరంలో బహిరంగ ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా జనజాగృతి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అందుకు ప్రతీ నెల అన్ని శని, ఆదివారాలు ఇలా నెలలో కనీసం పది రోజులైన ప్రజలు పాలుపంచుకునేలా ప్రయత్నాలు చేయనున్నారు. అందుకు పోలీసుల సహకారంతో బీఎంసీ ద్వారా చెత్త రహిత ముంబై అభియాన్ చేపట్టనున్నారు. ఈ అభియాన్మ ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దీంతో ప్రజల్లో చైతన్యం వస్తుందని, ఫలితంగా మురికివాడల ప్రజలు నాలాల్లో చెత్తవేయడం మానుకోవడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులు మూత్ర విసర్జన, దుర్గంధం చేయడం లాంటి పనులు మానుకుంటారని అశోక్ ఖైరే అభిప్రాయపడ్డారు. రైల్వే ట్రాక్‌ల వెంబడి.. మ్యాక్ స్పెషల్ ట్రైన్(చెత్త రైలు)తో సెంట్రల్, హార్బర్, పశ్చిమ మార్గంలో 2.80లక్షల క్యూబిక్‌ల చెత్తను రైల్వే పోగుచేసింది. ఏడాదిలో సెంట్రల్, హర్బర్ రైల్వే మార్గంలో ఒక లక్ష క్యూబిక్కులు, పశ్చిమ మార్గంలో 1.80 లక్షల క్యూబిక్కులు పోగుచేసినట్లు తెలిసింది. లోకల్ రైల్వే ట్రాక్‌లపై పడేస్తున్న చెత్తను పోగు చేసేందుకు అర్ధరాత్రి దాటిన తరువాత ‘మ్యాక్ స్పెషల్ ట్రైన్’ (చెత్త రైలు) నడుపుతున్నారు. నగరంలో సెంట్రల్, హార్బర్, పశ్చిమ మార్గాలున్నాయి. ఇందులో ప్రతీరోజు 75 లక్షలకుపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే ట్రాక్ ప్రహరీ గోడకు ఆనుకుని అనేక చోట్ల మురికివాడలున్నాయి. ప్రయాణికులతోపాటు ట్రాక్‌కు ఆనుకుని ఉన్న మురికివాడల ప్రజలు పడేసిన చెత్త నిత్యం కొన్ని వందల కేజీల్లో ఉంటుంది. ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఇంకా వినియోగం కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులు తిని పారేసిన బిస్కెట్లు, చిప్స్ తదితర తినుబండారాల ఖాళీ ప్యాకెట్లు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు రైల్వే ట్రాక్‌లపై పాడేస్తుంటారు. అదేవిధంగా ట్రాక్‌కు అనుకుని ఉన్న మురికివాడల ప్రజలు ఇళ్లలో పోగైన చెత్తను కూడా తీసుకొచ్చి పట్టాల పక్కన విసిరేస్తున్నారు. పెద్ద ఎత్తున చెత్త పోగుకావడంతో వర్షాకాలంలో మురికి కాల్వలు, నాలాల్లోకి వెళుతుంది. వర్షపు నీరు సాఫీగా వెళ్లకుండా అడ్డుకోవడంతో రైల్వే ట్రాక్‌లపై నీరుచేరి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అర్ధరాత్రి లోకల్ రైళ్ల రాకపోకలు నిలిపివేసిన తరువాత ఈ ప్రత్యేక మ్యాక్ స్పెషల్ ట్రైన్ నడుపుతున్నారు. సెంట్రల్ మార్గంలో సీఎస్ఎంటీ నుంచి కళ్యాణ్, హార్బర్ మార్గంలో సీఎస్ఎంటీ నుంచి మాన్‌ఖుర్ద్, పశ్చిమ మార్గంలో చర్చిగేట్ నుంచి విరార్ వరకు రైల్వే ట్రాక్‌ల వెంబడి పాడేసిన చెత్తను పోగు చేస్తారు. అందుకు నాలుగు బోగీలతో కూడిన రెండు రైళ్లను నడుపుతున్నారు. ప్రతీరోజు మూడు మార్గాలలో 12 వేల సంచుల చెత్త పోగు చేస్తారు. ఇలా ఏడాదిలో పోగుచేసిన 2.80 లక్షల క్యూబిక్కుల చెత్తను డంపింగ్ గ్రౌండ్‌కు తరలించారు. 19,776 మందిపై.. స్వచ్ఛతా అభియాన్‌లో భాగంగా బీఎంసీ ఈ నెల ఒకటో తేదీ నుంచి 23వ తేదీ వరకు నాలాలో చెత్తవేస్తున్న 5,400 మందిపై చర్యలు తీసుకుంది. వీరి నుంచి దాదాపు 10 లక్షలు జరిమానా వసూలు చేసింది. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో, పర్యాటక ప్రాంతాల్లో, జనం రద్దీ ఉన్న చోట విచ్చల విడిగా మూత్ర విసర్జన చేసిన 14,376 మందిపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి రూ.39.77 లక్షలు జరిమానా వసూలు చేశారు. ఇక నుంచి రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారిపై, పరిసరాలను దుర్గంధం చేస్తున్న వారిపై నిఘా వేసేందుకు సీసీ టీవీ కెమెరాల నిఘా ఉంటుందని బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అశోక్ ఖైరే స్పష్టం చేశారు. -
స్వచ్ఛ దోపిడీ
ప్రకాశం ,గిద్దలూరు: స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్తను ఆరుబయట పడేయకుండా నిల్వ చేసి గ్రీన్ అంబాసిడర్లకు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. గృహాల్లో చెత్తను నిల్వ చేసేందుకు వీలుగా ప్రతి కుటుంబానికి రెండు ప్లాస్టిక్ డబ్బాలు పంపిణీ చేస్తున్నారు. ప్లాస్టిక్ డబ్బాలకొనుగోలులో అధికార పార్టీ నాయకులు చేతివాటం ప్రదర్శించారు. రూ.25 విలువ చేసే ప్లాస్టిక్ డబ్బాలను రూ.67లకు కొనుగోలు చేసినట్లు బిల్లులు చేసుకుని అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు దండుకుంటున్నారు. జిల్లాలో సుమారు 5 లక్షల గృహాలకు రెండు డబ్బాల చొప్పున 10 లక్షలు కొనుగోలు చేశారు. ఇందుకు రూ.6.70 కోట్లు ఖర్చు చేయగా ఇందులో అదనపు ధరల ద్వారా రూ.4.20 కోట్లు అదనంగా ఖర్చు చేసి అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు దోచుకు తింటున్నారు. చెత్త బండ్లు, చెత్త సేకరణ కేంద్రాలు నిర్మాణం ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అక్రమాలకు పాల్పడి ప్రజాదనాన్ని అప్పనంగా ఆరగించేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వచ్ఛభారత్ పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా గ్రామాలు, పట్టణాలు, వార్డులు పరిశుభ్రంగా ఉండాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా పట్టణం, గ్రామం తేడా లేకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15 వేలు మంజూరు చేసింది. బహిరంగ మల, మూత్ర విసర్జన చేయరాదన్న ఉద్దేశంతో ప్రజా మరుగుదొడ్లను నిర్మించింది. దీంతో పాటు గ్రామాల్లోని చెత్త సేకరించి ఎరువుగా తయారు చేసేందుకు షెడ్లు నిర్మించారు. ఇందుకు గాను ఒక్కో పంచాయతీకి 6 నుంచి 10 మంది గ్రీన్ అంబాసిడర్లు (కార్మికుల)ను నియమించారు. వీటన్నింటిలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. కొన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు చేసుకుని జేబులు నింపుకున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుని కార్యకర్తలకు దోచిపెట్టిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. చెత్త డబ్బాల కొనుగోలులో రూ.4.20 కోట్లు దోపిడీ: స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని గృహాల నుంచి చెత్తను సేకరించి చెత్త నుంచి ఎరువు తయారీ కేంద్రాలకు చెత్తను తరలించేందుకు ప్రతి గృహానికి రెండు చెత్త డబ్బాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డబ్బాల కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గృహాల్లో మిగిలిన తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేసేందుకు గాను గతంలో నీలి రంగు, ఆకు పచ్చ రంగుతో ఉన్న డబ్బాలను పంపిణీ చేసేవారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వారికి అనుగుణంగా పసుపు, ఎరువు రంగులున్న డబ్బాలను ప్రజలకు పంపిణీ చేస్తోంది. చెత్త డబ్బాల కొనుగోలులో అధికార పార్టీ నాయకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఐదు లీటర్ల కెపాసిటీ ఉన్న ప్లాస్టిక్ డబ్బా బహిరంగ మార్కెట్లో రూ.25లకు లభ్యమవుతుంది. అలాంటి డబ్బాను ప్రభుత్వం తనకు అనుకూలమైన వారికి కాంట్రాక్టు ఇచ్చి రూ.67లకు కొనుగోలు చేశారు. ఒక్కో డబ్బాపై సుమారు రూ.42 అదనంగా చెల్లిస్తున్నారు. ఇలా జిల్లాలోని 5 లక్షల గృహాలకు 10 లక్షల డబ్బాలను కొనుగోలు చేశారు. 10 లక్షల డబ్బాలకు గాను రూ.4.20 కోట్లు అదనంగా చెల్లించినట్లు బిల్లులు చేసుకుని దండుకున్నారని కొందరు అధికారులు సైతం విమర్శిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని సగం మండలాలకు పంపిణీ చేసిన అధికారులు గిద్దలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం పంపిణీ చేసేందుకు పంచాయతీ కార్యాలయాలకు డబ్బాలను చేరవేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ నాయకుల జేబులు నింపేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని, వీటి వలన ప్రజలకు ఒరిగేదేమీ లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
ఐఎస్ఎల్ సొమ్ము స్వాహాపై విజిలెన్స్ విచారణ
తొండంగి(తుని) : కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ అమలులో భాగంగా అమలు చేస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్ఎల్) నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు తెలియకుండానే మరుగుదొడ్లు నిర్మించినట్టు చూపించి నిధులు కాజేసిన వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు మంగళవారం విచారణ ప్రారంభించారు.పైడికొండ పంచాయతీలో పైడికొండతోపాటు ఆనూరు గ్రామాల్లో అధికారులు, కాంట్రాక్టర్ కలిసి 684 మరుగుదొడ్లు నిర్మించినట్టు ఆన్లైన్ రికార్డుల్లో చూపించారు. వీటిలో సగానికి పైగా లబ్ధిదారులకు తెలియకుండానే మరుగుదొడ్లు లేని ఇళ్ల వద్ద, దీర్ఘకాలం క్రితం సొంత ఖర్చులతో మరుగుదొడ్లు నిర్మించుకున్న వారి వివరాలు నిర్మించినట్టు చూపారు. ఈ విధంగా ఒక్కో లబ్ధిదారుడి పేరు మీద రూ.15వేల చొప్పున సుమారు పైడికొండ పంచాయతీ పరిధిలో సుమారు రూ.60 నుంచి 70 లక్షల వరకు నిధులు కాజేసినట్టు ‘సాక్షి’ ఈ బాగోతాన్ని గతేడాది డిసెంబర్లో ప్రత్యేక కథనంతో వెలికితీయడం అప్పట్లో దుమారం రేగింది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఆనూరు గ్రామంలోని బాధిత ప్రజలు జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పైడికొండలో బాధిత గ్రామస్తులందరూ వ్యవహారానికి కారకులైన గ్రామ కార్యదర్శి బుచ్చిరాజు, ఇతర అధికారులతోపాటు స్థానిక అ«ధికార పార్టీ నేతలను నిలదీసి జరిగిన అవినీతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. సదరు కాంట్రాక్టర్ ద్వారా కొంచెం నోరున్న నాయకుల నోరు మూయించేందుకు నేరుగా డబ్బులు పంపిణీ నిర్వహించారు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుకు కలెక్టర్ ఆదేశాలతో జెడ్పీ సీఈవో ఆధ్వర్యంలో కొద్ది రోజుల క్రితం ఎంపీడీఓతో డ్వామా ఏపీఓ, ఇతర 34 మంది కూడిన బృందం పైడికొండ, ఆనూరు గ్రామాల్లో ఆన్లైన్ లబ్ధిదారుల రికార్డుల ప్రకారం ఇంటింటా పర్యటన నిర్వహించి వాస్తవ విషయాలను సేకరించి నివేదిక రూపొందించింది. ఈ ప్రక్రియకు ముందు సదరు కాంట్రాక్టర్, అధికారులు కలిసి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించని వారి ఇళ్ల వద్ద ఆదరాబాదరాగా నిర్మాణాలు చేపట్టారు. కొన్నింటిని పూర్తి చేసినా అందరి లబ్ధిదారుల ఇళ్ల వద్ద వాటిని నిర్మించడంలో విఫలమయ్యారు. కాగా సొంత ఖర్చులతో మరుగుదొడ్డిని నిర్మించుకున్న వారికీ తమకు తెలియకుండా పేరు వాడుకున్నందుకు కూడా కాంట్రాక్టర్ నయానా, భయానా సొమ్ములు ముట్టజెప్పారని సమాచారం. ప్రారంభమైన విచారణ పైడికొండ పంచాయతీలో జరిగిన ఐఎస్ఎల్ నిర్మాణ పథకంలో నిధుల దుర్వినియోగం, అవినీతి బాగోతాలపై విచారణ జరపాలంటూ ఆనూరుకు చెందిన బాధిత గ్రామస్తులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్ డీఈ డీఎస్ఎన్ మూర్తి, మరికొంత మంది అధికారుల బృందం పైడికొండ, ఆనూరు గ్రామాల్లో విచారణ ప్రారంభించారు. పైడికొండ పంచాయతీ కార్యాలయంలో రికార్డుల్లో వివరాలు సేకరించారు. అనంతరం గ్రామంలో ఇంటింటా లబ్ధిదారుల పేర్లు ఆధారంగా అధికారుల బృందం స్టేట్మెంట్లు నమోదు చేసుకున్నారు. సేకరించిన వివరాలతోపాటు విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని డీఈ మూర్తి తెలిపారు మరో రెండు రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇతర గ్రామాల్లోనూ ఇదే తంతు? పైడికొండ అక్రమాలు బయటపడడంతో మిగిలిన పంచాయతీల్లో ప్రజలు కూడా తమ వివరాలు దుర్వినియోగమయ్యాయేమోనని వెతుకులాటలో పడ్డారు. దీంతో పి.ఇ.చిన్నాయపాలెం, బెండపూడి తదితర గ్రామాల్లో కూడా లబ్ధిదారుల పేరుమీద భారీస్థాయిలో నిధులు కాజేసినట్టు తెలిసింది. దీంతో బాధిత ప్రజలు ఇప్పటికే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మరికొంత మంది ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
ఇదేనా స్వచ్ఛ భారత్?
కూడేరు : పారిశుద్ధ్యం పట్ల మండల అభివృద్ధి అధికారి , పంచాయతీ అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారు. దీంతో గ్రామాల్లో డ్రైనేజీలు శుభ్రతకు నోచుకోలేదు. మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీంతో దోమలు ప్రబలి ప్రజలు విష జ్వరాల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. కూడేరు మండలంలో 14 పంచాయతీలు, 28 గ్రామాలు ఉన్నాయి. మండల అభివృద్ధి కార్యాలయం (ఎంపీడీఓ) ఆవరణలోనే చెత్తా చెదారంతో కంపు కొడుతోందంటే అధికారులు పారిశుద్ధ్యం మెరుగునకు ఏ స్థాయిలో కృషి చేస్తున్నారో ఆర్థం చేసుకోవచ్చు. వీధుల్లో ఉన్న చెత్తను మూడు చక్రాల బండిలో తెచ్చి ఎంపీడీఓ కార్యాలయ గేటు ముందు పడేస్తున్నారు. అందులో స్థానికులు కొందరు మలమూత్ర విసర్జన చేయడంతో కంపు కొడుతోంది. ఈ కంపును దాటుకొని మండల ప్రజలు అంగన్వాడీ కేంద్రం, ఐకేపీ కార్యాలయం, హౌసింగ్ ఆఫీసర్, హార్టికల్చర్ కార్యాలయాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. గత్యంతరం లేక ప్రజలు ముక్కు మూసుకొని వెళుతున్న పరిస్థితి నెలకొంది. రోజు అధికారులు ఈ కంపును చూస్తు వెళుతున్నారే తప్ప శుభ్రం చేయిద్దామన్న ఆలోచన లేదని ప్రజలు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘చెత్త’ కష్టాలు
నిజాంసాగర్(జుక్కల్) : పరిసరాల పరిశుభ్రత, సం పూర్ణ పారిశుధ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రా ధాన్యత ఇచ్చినా క్షేత్రస్థాయిలో అధికారులకు చెత్తపై చిత్తశుద్ధి కరువైంది. ఇంటింటా వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణంతో స్వచ్ఛ గ్రామాలు సాధ్యమంటున్నా అమలులో ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో జనావాసాలు, కాలనీల్లో కుప్పలుతెప్పలుగా చెత్త పేరుకుపోతోంది. చెత్త తరలింపు కోసం రిక్షాలు, చెత్త నిల్వల కోసం తవ్విన డంపింగ్‌యార్డు లు ఊరురా వృథాగా మారుతున్నాయి. ఉపాధి నిధులు డంపింగ్ యార్డుల పాలు.. ‘పల్లె సీమలను పట్టుగొమ్మలుగా నిలపాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతపై దృష్టి సారించాయి. అందులో భాగంగా జిల్లాలోని 323 గ్రామ పంచాయతీలు, ఆయా గ్రామాల్లో చెత్త నిల్వల కోసం డంపింగ్ యార్డులు మంజూరయ్యాయి. తద్వారా జిల్లాలో 314 గ్రామాల్లో డంపింగ్ యార్డుల తవ్వకానికి ఉపాధి హామీ పథకం రూ.45 కోట్లు ఖర్చు చేశారు. గతేడాది జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను ఉపాధి కూలీలతో తవ్వించారు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కూలీలకు ఉపాధి పనులు కల్పించడంతో, చెత్తపై సమరానికి రూ.కోట్లు ఖర్చు చేశారు. ఒక్కొక్క డంపింగ్ యార్డు తవ్వకానికి ఉపాధి పథకం కింద రూ.1.7 లక్షలు ఖర్చు చేశారు. అయినా ఆయా గ్రామాల్లో ఉపాధి కూలీలు తవ్విన డంపింగ్ యార్డులు వృథాగా మారాయి. గ్రామాల్లో తవ్విన డంపింగ్ యార్డుల్లోకి చెత్తను తరలించేవారు గ్రామ పంచాయతీల్లో కరువయ్యారు. దీంతో ఆయా గ్రామ శివారు ప్రాంతాల్లో, కాలనీలు, జనావాసాల మధ్య చెత్తాచెదారం నిండటంతో వీధులు అపరిశుబ్రంగా మారాయి. మురికి కాలువల్లో నుంచి తీసిన చెత్తను రోడ్లపై పారేయడంతో కాలనీలు దుర్గంధంతో కొట్టుమిట్టాడుతున్నాయి. చెత్త నిల్వల కోసం తవ్విన డంపింగ్ యార్డులు వృథాగా మారాయి. తద్వారా గ్రామాల్లో తవ్విన డంపింగ్ యార్డులు సైతం కనుమరగవుతున్నాయి. మూలనపడ్డ రిక్షాలు.. జిల్లాలోని 323 గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది చెత్తరిక్షాలను సరఫరా చేసింది. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మూడు చొప్పున మూడు చక్రాల చెత్త రిక్షాలను సరఫరా చేసినా చె త్తను తరలిం చేసిబ్బంది లేకపోవడంతో రిక్షాలు మూలనపడ్డాయి. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువా డ, ఎల్లారెడ్డి పట్టణాలు, మండల కేంద్రాల్లో తప్ప మిగతా గ్రామ పంచాయతీల్లో చెత్తరిక్షాలను ఉపయోగించిన దాఖలాలు కన్పించవు. వందశాతం సంపూర్ణ పారిశుధ్యం కోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వపరంగా ఒక్కొక్క పంచాయతీకి మూడు చెత్తరిక్షాలను సరఫరా చేశారు. గ్రామ పంచాయతీల్లో సరిౖన సిబ్బంది లేకపోవడంతో చెత్తరిక్షాలు ఉపయోగం లేక తుప్పుపడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులపై పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ లేకపోవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారుతుంది. అధికారులు ఇకనైనా స్పందించి చెత్తరిక్షాలు, డంపింగ్ యార్డులను ఉపయోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. -
రూ. కోటి ‘చెత్త’పాలు
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చెత్త సేకరణకు ఒక్కో పంచాయతీకి రెండు రిక్షాలను అందజేసింది. ఇవి కొన్ని పంచాయతీల్లో మినహాయిస్తే జిల్లాలోని దాదాపు 70శాతం గ్రామాల్లో మూలకు చేరాయి. ఈనేపథ్యంలో రిక్షాల కొనుగోలు కోసం కేటాయించిన రూ. కోట్ల నిధులు ‘చెత్త’ పాలయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్ పథకం లక్ష్యం మరింత దూరమవుతోంది. రిక్షాల నిర్వహణ భారం కావడంతోనే అవి నిరుపయోగంగా మారాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాక్షి, వికారాబాద్: జిల్లా పరిధిలో మొత్తం 367 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో స్వచ్ఛభారత్ మిషన్ కింద చెత్త రిక్షాలను నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుల్లో వేయాలని సూచించింది. అయితే, రిక్షాల నిర్వహణ భారం కావడంతో వీటిని దాదాపు 30 శాతం గ్రామపంచాయతీలు మాత్రమే వినియోగిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికగా పంచాయతీకి రెండు చొప్పున కేంద్ర ప్రభుత్వం మొత్తం 734 చెత్త రిక్షాలను నాలుగేళ్ల క్రితం పంపిణీ చేసింది. ప్రస్తుతం చాలా పంచాయతీల్లో ఇవి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. పంచాయతీలు రిక్షాల నిర్వహణకు ఒకో కార్మికుడికి నెలకు రూ. 2 వేలకు తక్కువ కాకుండా వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూ చించింది. అయితే, పంచాయతీల్లో నిధు ల లేమితో రిక్షాల నిర్వహణ భారంగా మారింది. దీంతో వాటిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పంచాయతీల్లో నిధుల కొరత కనిపిస్తున్నది. అభివృద్ధి పనుల కోసం 14వ ఆర్థిక సం ఘం నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. 2017 జూలై నెలలో రూ.14కోట్ల 50 లక్షలను ప్రభు త్వం పంచాయతీలకు విడుదల చేసింది. గ్రామాల్లో మురుగుకాలువలు, మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు, అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించారు. ఈనేపథ్యంలో డబ్బు ల కొరత ఏర్పడింది. చెత్త తరలించే రిక్షాలను నడిపే కూలీలకు జీతాలివ్వడం, రిక్షాలు మరమ్మతులు తదితరాలు పంచాయతీలు భారంగా పరిణమిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు ప్రత్యేకంగా కొన్ని నెలలుగా నిధులు అందకపోవడం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు కేంద్ర సర్కార్ పంపిణీ చేసిన చెత్త రిక్షాలను వినియోగించడం లేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఒక్కో రిక్షాకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు వెచ్చించింది. ఈలెక్కన రూ. కోటి నిధు లు ‘చెత్త’పాలయ్యాయనే విమర్శలు వినపడుతున్నాయి. కేంద్ర సర్కార్ ఉద్దే శం బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండడంతో ఇబ్బందులు తలె త్తుతున్నాయని చెప్పవచ్చు. పంచా యతీ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. నైపుణ్యమున్న కార్మికులు ఏరీ..? స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమం కింద పంపిణీ చేసిన రిక్షాలను నడపాలంటే నైపుణ్యమున్న (స్కిల్డ్) కార్మికులు అవసరం. వీరు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులకు తరలించాలి. డంపింగ్‌యార్డులు లేనిచోట గ్రామానికి దూరంగా వ్యర్థాలను పారబోయాల్సి ఉంటుంది. దీంతో పాటు రోడ్లను శుభ్రంచేయాలి. గ్రామంలోని వీధుల్లోని చెత్తను సైతం సేకరించాలి. ప్రస్తుతం పంచాయతీల్లో ఉన్న కార్మికులు రిక్షాలను నడపడం లేదు. కొత్తవారిని పెట్టుకుంటే వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామ పంచాయతీలు 14వ ఆర్థికసంఘం నిధులపై ఆధారపడ్డాయి. పంచాయతీలలో నిధుల లేమికి తోడు తక్కువ వేతనానికి చెత్త రిక్షాలను తోలడానికి కార్మికులు ముందుకు రాకపోవడం కూడా రిక్షాల నిరుపయోగానికి కారణంగా చెప్పుకోవచ్చు. రిక్షాలను వినియోగంలోకి తెస్తాం.. స్వచ్ఛభారత్ మిషన్ కింద చెత్త తరలించేందుకు కేంద్ర సర్కార్ రిక్షాలను అందజేసింది. చాలావరకు రిక్షాలను వినియోగిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. ఎక్కడైనా వీటిని ఉపయోగించకుంటే చర్యలు తీసుకుంటాం. చెత్త తరలించే రిక్షాలను వినియోగంలోకి తీసుకొస్తాం. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతాం. –మాజిద్, జిల్లా పంచాయతీ అధికారి -
పీవీకేకేలో స్వచ్ఛభారత్
అనంతపురం న్యూసిటీ : పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సంతోష్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీవీకేకే యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, మెకానికల్ విభాగాధిపతి బాలసుబ్రమణ్యం, మెకానికల్ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు. -
బాసర ట్రిపుల్‌ఐటీలో స్వచ్ఛభారత్
బాసర : కేంద్రప్రభుత్వం, ఎన్ఎస్ఎస్ పిలుపు మేరకు శుక్రవారం బాసర ట్రిపుల్‌ఐటీలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ విద్యార్థులతో స్వచ్ఛభారత్‌పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ఆవరణలో చీపుర్లు చేతపట్టి పరిసరాలు శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచి, స్వచ్ఛభారత్ సాధన దిశగా కషిచేయాలని పిలుపునిచ్చారు. కళాశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ బి.శ్యాంబాబు, ఆఫీసర్ విజయ్‌కుమార్, అనిత, నరేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.