సాక్షి, ముంబై: ముంబై నగరంతోపాటు తూర్పు, పశ్చిమ ఉప నగరాలలో నాలాల్లో చెత్త వేయడం, పరిసరాలను దుర్గంధం చేస్తున్న వారి నుంచి జరిమానా విధించడం బీఎంసీ ప్రారంభించింది. స్వచ్ఛతా అభియాన్‌లో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు బీఎంసీ అధికారులు చేపట్టిన దాడుల్లో మొత్తం రూ.50 లక్షల జరిమానా వసూలు చేశారు. దీంతో నాలాల్లో, మురికి కాల్వల్లో చెత్తవేసి పరిసరాలను దుర్గంధం చేస్తున్న మురికివాడల ప్రజల్లో దడ మొదలైంది. అంతేగాకుండా స్వచ్ఛతా అ భియాన్‌ను మరింత విస్తరించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ అభియాన్‌లో పాల్గొననున్నారు. దీంతో ఈ పథకం మరింత పకడ్భందిగా అమలు కానుంది.
వీకెండ్స్‌లో జనజాగృతి
నగరంలో బహిరంగ ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా జనజాగృతి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అందుకు ప్రతీ నెల అన్ని శని, ఆదివారాలు ఇలా నెలలో కనీసం పది రోజులైన ప్రజలు పాలుపంచుకునేలా ప్రయత్నాలు చేయనున్నారు. అందుకు పోలీసుల సహకారంతో బీఎంసీ ద్వారా చెత్త రహిత ముంబై అభియాన్ చేపట్టనున్నారు. ఈ అభియాన్‌మ ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దీంతో ప్రజల్లో చైతన్యం వస్తుందని, ఫలితంగా మురికివాడల ప్రజలు నాలాల్లో చెత్తవేయడం మానుకోవడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులు మూత్ర విసర్జన, దుర్గంధం చేయడం లాంటి పనులు మానుకుంటారని అశోక్ ఖైరే అభిప్రాయపడ్డారు.
రైల్వే ట్రాక్‌ల వెంబడి..
మ్యాక్ స్పెషల్ ట్రైన్(చెత్త రైలు)తో సెంట్రల్, హార్బర్, పశ్చిమ మార్గంలో 2.80లక్షల క్యూబిక్‌ల చెత్తను రైల్వే పోగుచేసింది. ఏడాదిలో సెంట్రల్, హర్బర్ రైల్వే మార్గంలో ఒక లక్ష క్యూబిక్కులు, పశ్చిమ మార్గంలో 1.80 లక్షల క్యూబిక్కులు పోగుచేసినట్లు తెలిసింది. లోకల్ రైల్వే ట్రాక్‌లపై పడేస్తున్న చెత్తను పోగు చేసేందుకు అర్ధరాత్రి దాటిన తరువాత ‘మ్యాక్ స్పెషల్ ట్రైన్’ (చెత్త రైలు) నడుపుతున్నారు. నగరంలో సెంట్రల్, హార్బర్, పశ్చిమ మార్గాలున్నాయి. ఇందులో ప్రతీరోజు 75 లక్షలకుపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే ట్రాక్ ప్రహరీ గోడకు ఆనుకుని అనేక చోట్ల మురికివాడలున్నాయి. ప్రయాణికులతోపాటు ట్రాక్‌కు ఆనుకుని ఉన్న మురికివాడల ప్రజలు పడేసిన చెత్త నిత్యం కొన్ని వందల కేజీల్లో ఉంటుంది. ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఇంకా వినియోగం కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులు తిని పారేసిన బిస్కెట్లు, చిప్స్ తదితర తినుబండారాల ఖాళీ ప్యాకెట్లు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు రైల్వే ట్రాక్‌లపై పాడేస్తుంటారు. అదేవిధంగా ట్రాక్‌కు అనుకుని ఉన్న మురికివాడల ప్రజలు ఇళ్లలో పోగైన చెత్తను కూడా తీసుకొచ్చి పట్టాల పక్కన విసిరేస్తున్నారు. పెద్ద ఎత్తున చెత్త పోగుకావడంతో వర్షాకాలంలో మురికి కాల్వలు, నాలాల్లోకి వెళుతుంది. వర్షపు నీరు సాఫీగా వెళ్లకుండా అడ్డుకోవడంతో రైల్వే ట్రాక్‌లపై నీరుచేరి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అర్ధరాత్రి లోకల్ రైళ్ల రాకపోకలు నిలిపివేసిన తరువాత ఈ ప్రత్యేక మ్యాక్ స్పెషల్ ట్రైన్ నడుపుతున్నారు. సెంట్రల్ మార్గంలో సీఎస్‌ఎంటీ నుంచి కళ్యాణ్, హార్బర్ మార్గంలో సీఎస్‌ఎంటీ నుంచి మాన్‌ఖుర్ద్, పశ్చిమ మార్గంలో చర్చిగేట్ నుంచి విరార్ వరకు రైల్వే ట్రాక్‌ల వెంబడి పాడేసిన చెత్తను పోగు చేస్తారు. అందుకు నాలుగు బోగీలతో కూడిన రెండు రైళ్లను నడుపుతున్నారు. ప్రతీరోజు మూడు మార్గాలలో 12 వేల సంచుల చెత్త పోగు చేస్తారు. ఇలా ఏడాదిలో పోగుచేసిన 2.80 లక్షల క్యూబిక్కుల చెత్తను డంపింగ్ గ్రౌండ్‌కు తరలించారు.
19,776 మందిపై..
స్వచ్ఛతా అభియాన్‌లో భాగంగా బీఎంసీ ఈ నెల ఒకటో తేదీ నుంచి 23వ తేదీ వరకు నాలాలో చెత్తవేస్తున్న 5,400 మందిపై చర్యలు తీసుకుంది. వీరి నుంచి దాదాపు 10 లక్షలు జరిమానా వసూలు చేసింది. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో, పర్యాటక ప్రాంతాల్లో, జనం రద్దీ ఉన్న చోట విచ్చల విడిగా మూత్ర విసర్జన చేసిన 14,376 మందిపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి రూ.39.77 లక్షలు జరిమానా వసూలు చేశారు. ఇక నుంచి రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారిపై, పరిసరాలను దుర్గంధం చేస్తున్న వారిపై నిఘా వేసేందుకు సీసీ టీవీ కెమెరాల నిఘా ఉంటుందని బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అశోక్ ఖైరే స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment