సాక్షి, ముంబై: వచ్చే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో శివసేనను దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వివిధ రకాల వ్యూహాలు రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఈసారి జరిగే బీఎంసీ ఎన్నికల్లో శివసేనకు పరాజయం ఖాయమని శిందే, ఫడ్నవీస్ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు రెండు నెలల కిందట శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటుచేసిన శిందే మహావికాస్ ఆఘాడి ప్రభుత్వాన్ని కూల్చారు. దీంతో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవిని కోల్పోవల్సి వచ్చింది. ఇప్పుడు గత 25 ఏళ్లుగా బీఎంసీలో ఏకచత్రాధిపత్యం చలాయిస్తున్న శివసేనను గట్టి దెబ్బ తీసేందుకు వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది.
ముంబైలోని మరాఠీ, ముఖ్యంగా మరాఠేతరుల ఓట్లపై బీజేపీ దృష్టి కేంద్రీకరించనుంది. అలాగే విల్లు–బాణం (ధనుష్య–బాణం) గుర్తు పొందేందుకు ఏక్‌నాథ్ శిందే వర్గం చట్టపరంగా గట్టిగా కోర్టులో పోరాటం చేయనున్నారు. మరోపక్క దివంగత బాల్ ఠాక్రే స్ధాపించిన శివసేన పార్టీ తమదేనని రుజువు చేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే వర్గం తీవ్ర ప్రయత్నాలు చేయనుంది. అదే విధంగా కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన ఇప్పుడు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)కు దూరంగానే ఉండాలని భావిస్తోంది.
ఈ నేపధ్యంలోనే ఎమ్మెన్నెస్ ఎవరితో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ఇటీవల ఆ పార్టీ నేత సందీప్ దేశ్‌పాండే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో శివసేన, ఎమ్మెన్నెస్ ఒకటైతుండవచ్చని గత కొద్దిరోజులుగా వస్తున్న వదంతులకు తెరపడింది. ఫలితంగా శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి పోటీ చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదు.
చదవండి: (కాంగ్రెస్‌లో కీలక మార్పులు.. పటోలే, జగ్తాప్ ఔట్?.. చవాన్ ఇన్!)
వ్యూహాత్మకంగా ప్రధాన పార్టీలు...
రాష్ట్ర ఎన్నికల సంఘం బీఎంసీసహా రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న 14 కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూల్ ఇంతవరకు విడుదల చేయలేదు. అయినప్పటికీ చిన్న, చితక పార్టీలతోపాటు ప్రధాన పార్టీలన్ని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా వివిధ కార్పొరేషన్లతో పోలిస్తే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బీఎంసీ ఎన్నికలను సవాలుగా తీసుకుంటాయి. దీంతో అన్ని పార్టీలు బీఎంసీపైనే దృష్టి సారిస్తాయి.
ఎన్నికలు వచ్చాయంటే యావత్ రాష్ట్ర ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల దృష్టి బీఎంసీపైనే ఉంటుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ బీఎంసీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తమ పరువును ఫణంగా పెడతాయి. అయినప్పటికీ గత 25 ఏళ్లుగా బీఎంసీలో తిరుగులేని పార్టీగా శివసేన అధికారం చెలాయిస్తోంది. ఈసారి ఎలాగైన శివసేనను గద్దె దించాలని శిందే, ఫడ్నవీస్ వర్గం శత ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఎన్నికలు మహావికాస్ ఆఘాడి–బీజేపీ మధ్య హోరా హోరీగా జరగనున్నాయి. అంతేగాకుండా ఈ ఎన్నికల్లో ఎవరు..ఎవరితో పొత్తు పెట్టుకుంటారు...ఎవరు తెరవెనక నుంచి మద్దత్తిస్తారు అనేది చూడవచ్చు.
రాష్ట్రంలో శిందే, ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ బీఎంసీని కైవసం చేసుకునేందుకు వ్యూçహాత్మకంగా పావులు కదపనుంది. ముఖ్యంగా శివసేన ప్రధాన శత్రువు కావడంతో ఆ పార్టీనే లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ముందుకు వెళ్లనుంది. ఇటీవల ముంబై పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా కూడా శివసేనను గద్దె దించాలని బీజేపీకి సూచించారు. ఆ ప్రకారం ఫడ్నవీస్, శిందే వర్గం సన్నద్ధమైతున్నారు. ఇదిలాఉండగా ఎమ్మెన్నెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ఇటీవల సందీప్ దేశ్‌పాండే ప్రకటించడంతో ఫడ్నవీస్, శిందే వర్గం కూడా బీఎంసీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకూడదని నిర్ణయానికొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఈ రెండు వర్గాలు కలిసే పోటీ చేస్తాయి. త్వరలో సీట్ల పంపకంపై చర్చలు కూడా జరగనున్నట్లు సమాచారం. కొద్ది రోజలుగా ముంబైలో మరాఠేతరుల నియోజక వర్గాలలో బీజేపీ పైచేయి చాటుకుంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ గుజరాత్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్‌సహా ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా వ్యూహం పన్నుతున్నారు. మరాఠేతరులతోపాటు మరాఠీ ఓటర్లను కూడా తమవైపు లాక్కునేందుకు బీఎంసీలో శివసేన పాల్పడిన అవినీతి భాగోతాన్ని బయటపెట్టి గద్దె దింపే ప్రయత్నాలు చేయనుంది. ఆ విధంగా ఎన్నికల్లో ప్రచారం చేసి గత 25 ఏళ్లుగా బీఎంసీలో తిరుగులేని పార్టీగా పాగా వేసిన శివసేనను ఈ సారి ఎలాగైన గట్టి దెబ్బతీయాలని శిందే, బీజేపీ వర్గం దృఢ సంకల్పంతో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment