కూడేరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నెలకొన్న అపరిశుభ్రత
కూడేరు : పారిశుద్ధ్యం పట్ల మండల అభివృద్ధి అధికారి , పంచాయతీ అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారు. దీంతో గ్రామాల్లో డ్రైనేజీలు శుభ్రతకు నోచుకోలేదు. మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీంతో దోమలు ప్రబలి ప్రజలు విష జ్వరాల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. కూడేరు మండలంలో 14 పంచాయతీలు, 28 గ్రామాలు ఉన్నాయి. మండల అభివృద్ధి కార్యాలయం (ఎంపీడీఓ) ఆవరణలోనే చెత్తా చెదారంతో కంపు కొడుతోందంటే అధికారులు పారిశుద్ధ్యం మెరుగునకు ఏ స్థాయిలో కృషి చేస్తున్నారో ఆర్థం చేసుకోవచ్చు.
వీధుల్లో ఉన్న చెత్తను మూడు చక్రాల బండిలో తెచ్చి ఎంపీడీఓ కార్యాలయ గేటు ముందు పడేస్తున్నారు. అందులో స్థానికులు కొందరు మలమూత్ర విసర్జన చేయడంతో కంపు కొడుతోంది. ఈ కంపును దాటుకొని మండల ప్రజలు అంగన్‌వాడీ కేంద్రం, ఐకేపీ కార్యాలయం, హౌసింగ్ ఆఫీసర్, హార్టికల్చర్ కార్యాలయాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. గత్యంతరం లేక ప్రజలు ముక్కు మూసుకొని వెళుతున్న పరిస్థితి నెలకొంది. రోజు అధికారులు ఈ కంపును చూస్తు వెళుతున్నారే తప్ప శుభ్రం చేయిద్దామన్న ఆలోచన లేదని ప్రజలు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment