కూలి పనులు చేయలేదని కక్ష
ఎంపీడీవో కార్యాలయం ఎదుట బాధితుడి ఆత్యహత్యాయత్నం
శ్రీరంగరాజపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పింఛను లబి్ధదారులపై కొరడా ఝుళిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఓ దివ్యాంగుడి పింఛన్‌ను టీడీపీ నాయకుడు రద్దు చేయించారు. దీంతో బాధితుడు గురువారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. శ్రీరంగరాజపురం మండలం, పద్మాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు హేమాద్రి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాధవనాయుడి ఇంటి వద్ద కూలి పనులు చేయడానికి నిరాకరించారు.
దీంతో కక్ష పెంచుకున్న మాధవనాయుడు అధికారులపై ఒత్తిడి పెంచి హేమాద్రికి వస్తున్న వికలాంగ పింఛను తొలగించడమే కాకుండా దుర్భాషలాడి కుటుంబం అంతు చూస్తానని బెదిరించాడు. హేమాద్రికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ మొత్తం హేమాద్రికి వచ్చే పింఛన్‌పైనే ఆధారపడి జీవిస్తోంది.
దీంతో బాధితుడు హేమాద్రి గురువారం శ్రీ రంగరాజపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు యతి్నస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అలాగే, మండలంలోని జీఎంఆర్ పురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఢిల్లీకి వస్తున్న వికలాంగ పింఛన్ కూడా తొలగించారని, తనకు కూడా పింఛన్‌ను పునరుద్ధరించకపోతే ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment