ప్రకాశం ,గిద్దలూరు: స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్తను ఆరుబయట పడేయకుండా నిల్వ చేసి గ్రీన్ అంబాసిడర్‌లకు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. గృహాల్లో చెత్తను నిల్వ చేసేందుకు వీలుగా ప్రతి కుటుంబానికి రెండు ప్లాస్టిక్ డబ్బాలు పంపిణీ చేస్తున్నారు. ప్లాస్టిక్ డబ్బాలకొనుగోలులో అధికార పార్టీ నాయకులు చేతివాటం ప్రదర్శించారు. రూ.25 విలువ చేసే ప్లాస్టిక్ డబ్బాలను రూ.67లకు కొనుగోలు చేసినట్లు బిల్లులు చేసుకుని అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు దండుకుంటున్నారు. జిల్లాలో సుమారు 5 లక్షల గృహాలకు రెండు డబ్బాల చొప్పున 10 లక్షలు కొనుగోలు చేశారు. ఇందుకు రూ.6.70 కోట్లు ఖర్చు చేయగా ఇందులో అదనపు ధరల ద్వారా రూ.4.20 కోట్లు అదనంగా ఖర్చు చేసి అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు దోచుకు తింటున్నారు. చెత్త బండ్లు, చెత్త సేకరణ కేంద్రాలు నిర్మాణం ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అక్రమాలకు పాల్పడి ప్రజాదనాన్ని అప్పనంగా ఆరగించేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వచ్ఛభారత్ పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా గ్రామాలు, పట్టణాలు, వార్డులు పరిశుభ్రంగా ఉండాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా పట్టణం, గ్రామం తేడా లేకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15 వేలు మంజూరు చేసింది. బహిరంగ మల, మూత్ర విసర్జన చేయరాదన్న ఉద్దేశంతో ప్రజా
మరుగుదొడ్లను నిర్మించింది. దీంతో పాటు గ్రామాల్లోని చెత్త సేకరించి ఎరువుగా తయారు చేసేందుకు షెడ్లు నిర్మించారు. ఇందుకు గాను ఒక్కో పంచాయతీకి 6 నుంచి 10 మంది గ్రీన్ అంబాసిడర్‌లు (కార్మికుల)ను నియమించారు. వీటన్నింటిలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. కొన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు చేసుకుని జేబులు నింపుకున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుని కార్యకర్తలకు దోచిపెట్టిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
చెత్త డబ్బాల కొనుగోలులో రూ.4.20 కోట్లు దోపిడీ: స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని గృహాల నుంచి చెత్తను సేకరించి చెత్త నుంచి ఎరువు తయారీ కేంద్రాలకు చెత్తను తరలించేందుకు ప్రతి గృహానికి రెండు చెత్త డబ్బాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డబ్బాల కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గృహాల్లో మిగిలిన తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేసేందుకు గాను గతంలో నీలి రంగు, ఆకు పచ్చ రంగుతో ఉన్న డబ్బాలను పంపిణీ చేసేవారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వారికి అనుగుణంగా పసుపు, ఎరువు రంగులున్న డబ్బాలను ప్రజలకు పంపిణీ చేస్తోంది. చెత్త డబ్బాల కొనుగోలులో అధికార పార్టీ నాయకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఐదు లీటర్ల కెపాసిటీ ఉన్న ప్లాస్టిక్ డబ్బా బహిరంగ మార్కెట్‌లో రూ.25లకు లభ్యమవుతుంది. అలాంటి డబ్బాను ప్రభుత్వం తనకు అనుకూలమైన వారికి కాంట్రాక్టు ఇచ్చి రూ.67లకు కొనుగోలు చేశారు. ఒక్కో డబ్బాపై సుమారు రూ.42 అదనంగా చెల్లిస్తున్నారు. ఇలా జిల్లాలోని 5 లక్షల గృహాలకు 10 లక్షల డబ్బాలను కొనుగోలు చేశారు. 10 లక్షల డబ్బాలకు గాను రూ.4.20 కోట్లు అదనంగా చెల్లించినట్లు బిల్లులు చేసుకుని దండుకున్నారని కొందరు అధికారులు సైతం విమర్శిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని సగం మండలాలకు పంపిణీ చేసిన అధికారులు గిద్దలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం పంపిణీ చేసేందుకు పంచాయతీ కార్యాలయాలకు డబ్బాలను చేరవేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ నాయకుల జేబులు నింపేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని, వీటి వలన ప్రజలకు ఒరిగేదేమీ లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment