లక్ష్యం.. కనుమరుగు!
♦ మరుగుదొడ్ల నిర్మాణాల్లో వెనుకబాటు
♦ 23 శాతం కూడా పూర్తికాని పనులు
♦ సగం మండలాల నుంచి అందని యూసీలు
♦ నిధుల వినియోగంలో అధికారుల విఫలం
♦ ఉన్నతాధికారుల ఆంక్షలు కూడా కారణం
⇔ ‘స్వచ్ఛ భారత్’ లక్ష్యం ‘మరుగు’న పడింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లా వెనుకబడింది. బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా చేస్తామని బీరాలు పలుకుతున్న యంత్రాంగం.. ఈ ఏడాది నిర్దేశించిన వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యసాధనలో చతికిలపడింది.
⇔ ఇది పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్‌కు చెందిన మన్మర్రి కృష్ణయ్య ఏడాది క్రితం నిర్మించుకున్న మరుగుదొడ్డి. ఇతడికి ఇప్పటివరకు బిల్లు అందలేదు. మరుగుదొడ్డికి సున్నం వేస్తే పాతదానికింద లెక్కగట్టి బిల్లు ఇవ్వరని అలాగే వదిలేశాడు.
⇔ పూడూరు, శంకర్పల్లి, చేవెళ్ల, మొయినాబాద్, నవాబ్‌పేట, పరిగి, ధారూరు మండలాల నుంచి ఇప్పటివరకు ఒక యూసీ రాలేదంటే క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు తీరు ఎలా ఉందో అంచనా వేసుకోవచ్చు.
⇔ నిర్మాణ వ్యయం పెరిగిన నేపథ్యంలో యూనిట్ విలువను సర్కారు సవరించింది. ఒక మరుగుదొడ్డి అంచనా వ్యయం రూ.12,900. ఇందులో లబ్ధిదారు వాటా రూ.900.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తున్న కేంద్ర సర్కారు.. 2019 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా చేయడానికి స్వచ్ఛభారత్ మిషన్ (ఎస్బీఎం)ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు వ్యక్తిగత శౌచాలయాల (ఐహెచ్హెచ్ఎల్) నిర్మాణానికి సమృద్ధిగా నిధులు విడుదల చేస్తోంది. అయితే, జిల్లాలో మాత్రం ఈ పథకాన్ని అందిపుచ్చుకోవడంలో అధికారయంత్రాంగం విఫలమైంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్) పర్యవేక్షణలోని మండలాల్లో ఈ పథకం అమలు తీరును ఓసారి పరిశీలిస్తే.. అధికారుల నిర్లిప్త వైఖరి స్పష్టమవుతోంది.
ఈ విభాగం పరిధిలో 3,152 వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రూ.3.78 కోట్లను కే టాయించింది. నిర్మాణ వ్యయం పెరిగిన నేపథ్యంలో యూనిట్ విలువను కూడా రాష్ట్ర సర్కారు సవరించింది. ఒక మరుగుదొడ్డి అంచనా వ్యయం రూ.12,900. ఇందులో రూ.900 లబ్ధిదారు వాటా. ఈ క్రమంలోనే మరుగుదొడ్ల నిర్మాణానికి గ్రామీణులు ముందుకొచ్చారు. అయితే, అధికారుల పర్యవేక్షణాలోపం కారణంగా విడుదల చేసిన నిధుల్లో ఇప్పటివరకు రూ.47.67 (23%) లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీఓలు ప్రభుత్వానికి నిధుల వినియోగ పత్రాల (యూసీ)ను సమర్పించారు.
అంటే ఇంకా రూ.327.97 లక్షలు ఖర్చు చేయాల్సివుందన్నమాట. పూడూరు, శంకర్పల్లి, చేవెళ్ల, మొయినాబాద్, నవాబ్‌పేట, పరిగి, ధారూరు మండలాల నుంచి ఇప్పటివరకు ఒక యూసీ కూడా రాలేదంటే క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు తీరు ఎలా ఉందో అంచనా వేసుకోవచ్చు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నా.. జిల్లా యంత్రాంగం మెలికతో లబ్ధిదారులకు బిల్లులు రావడంలేదు. ఎంపిక చేసిన గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు ప్రారంభిస్తేనే బిల్లులు మంజూరు చేస్తామనే నిబంధన పెట్టారు.
ఈ ఆంక్షతో నూరుశాతం ఐహెచ్హెచ్ఎల్ మొదలు కాకపోవడం, నిర్మాణాలు పూర్తిచేసుకున్నవాటికీ బిల్లులు విడుదల చేయకపోవడంతో పథకం గాడి తప్పింది. గతంలో ఉపాధి హామీ పథకం కింద ఆన్లైన్లో నమోదైనవాటిని ఎస్బీఎం కింద చేపట్టడానికి సాఫ్ట్వేర్ అంగీకరించడంలేదు. ఇలాంటి సమస్యలు కూడా స్వచ్ఛభారత్ మిషన్‌కు ప్రతిబంధకంగా మారాయి.
నిర్మించుకుని సంవత్సరం గడిచింది ..
మరుగు దొడ్లు నిర్మించుకున్న వెంటనే డబ్బులు అందజేస్తామని అధికారులు గ్రామానికి వచ్చి చెప్పారు. నిజమేనని నమ్మి వెంటనే మరుగుదొడ్ల నిర్మాణానికి గుంతలు తవ్వుకున్నాం. కొద్ది రోజులు డబ్బుల కోసం వేచి ఉండి ఆ తర్వాత నిర్మాణం పూర్తి చేసుకున్నాం. డబ్బులు ఇస్తారని సంవత్సరకాలంగా మరుగుదొడ్డికి సున్నం వేయకండా వేచి చూస్తున్నాం.. ఇంకా ఇవ్వటంలేదు. వెంటనే డబ్బులు చెల్లించాలి. - కృష్ణయ్య, సయ్యద్‌మల్కాపూర్
అప్పులు చేసి నిర్మించుకుంటున్నారు..
అధికారుల మాటలు నమ్మి మరుగు దొడ్ల నిర్మాణాలు ప్రారంభించారు. డబ్బులు ఇస్తారు కదా అని అప్పు చేసి గుంతల్లో దించేందుకు రింగులు కూడా తెచ్చుకున్నారు. గ్రామంలో 25 మందికి పైగా నిర్మాణాలు పూర్తి చేశారు. మేము కూడా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అవగాహన కల్పించాం. - భాస్కర్, సర్పంచ్ సయ్యద్‌మల్కాపూర్