Swadeshi Jagaran Manch
-
క్రిప్టో కరెన్సీపై ఆర్ఎస్ఎస్ శాఖ కీలక వ్యాఖ్యలు
క్రిప్టో కరెన్సీపై విధాన పరమైన నిర్ణయం తీసుకునే విషయంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుండగా.. రాష్ట్రీయ స్వయం సేవక్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంఛ్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. అసెట్ క్లాస్ క్రిప్టో కరెన్సీని చట్ట బద్దంగా గుర్తించాలంటూ స్వదేశీ జాగరణ్ మంఛ్ కో కన్వీనర్ అశ్వినీ మహాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీపై ఆయన మాట్లాడుతూ ‘ ప్రస్తుతం ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహిస్తోన్న క్రిప్టో ఎక్సేంజీలలో పెట్టుబడులు పెడుతున్నారు. వీటిపై ప్రభుత్వాల నిర్వాహణ ఉండటం లేదు. ఇందులో పెట్టుబడిగా వస్తున్న కరెన్సీ ఎటు పోతుందో ఎవరికీ తెలియదు. ఇలా జరగడం ఎవరికీ మంచింది కాదు. కాబట్టి ప్రభుత్వాలు అస్సెట్ క్లాస్‌గా క్రిప్టో కరెన్సీని గుర్తించాలి. ఆ తర్వాత నియంత్రణను చట్టపరమైన విధానాలు రూపొందించాలి’ అని పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి.బంగారంతో సమానం కాదు క్రిప్టో కరెన్సీని అసెట్ క్లాస్‌గా గుర్తించాలని చెప్పిన మహాజన్ మరో కీలక వ్యాఖ్య చేశారు. అసెట్ క్లాస్‌తో ఉన్న బంగారంతో క్రిప్టో కరెన్సీ సమానం కాదన్నారు. బంగారం తరహాలో క్రిప్టో కరెన్సీకి ఇంట్రిన్సిక్ వ్యాల్యూ (అంతర్గత విలువ) లేదన్నారు. క్రిప్టో కరెన్సీలో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయని, వాటిని ఎవరూ ఇష్యూ చేస్తున్నారు. ఎవరు కొంటున్నారు. అలా కొన్నవారు ఆ కరెన్నీతో ఏం చేస్తున్నారో తెలియక పోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తలోమాట క్రిప్టో కరెన్సీకి చట్ట బద్దత కల్పించే విషయంపై ఇటీవల జయంత్ సిన్హా నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఇందులో అధికార పక్షం క్రిప్టోకు మద్దతుగా అభిప్రాయం వ్యక్తం చేయగా ప్రతిపక్ష కాంగ్రెస్ క్రిప్టోను నిషేధించాలని కోరింది. మరోవైపు ఆర్బీఐ గవర్నర్ సైతం క్రిప్టోతో ఇబ్బందులు వస్తాయన్నట్టుగా మాట్లాడారు. కాగా తాజాగా స్వదేశీ జాగరణ్ మంఛ్ తరఫున అభిప్రాయం వ్యక్తం అయ్యింది. చదవండి:క్రిప్టోలతో మనీలాండరింగ్ భయాలు - ఆర్బీఐ మాజీ గవర్నర్ ఆందోళన -
చైనీస్ ఎంబసీ వెలుపల నిరసన
న్యూఢిల్లీ : తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా దొంగదెబ్బ తీసి.. 20 మంది భారత సైనికుల ప్రాణాలను బలిగొనడంపై దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చైనా తీరుకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని ఆ దేశ ఎంబసీ వెలుపల.. బుధవారం పలువురు మాజీ ఆర్మీ అధికారులు, స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్జేఎం) సభ్యులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్జేఎం సభ్యులు చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటుగా, ప్లకార్డులను ప్రదర్శించారు. చైనా చర్యలకు ధీటైన జవాబు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. (చదవండి : విషం చిమ్మిన చైనా..) ఈ నిరసనల్లో పాల్గొన్న 10 మంది ఎస్జేఎం సభ్యులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మాజీ ఆర్మీ అధికారులను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా, ఓ వైపు సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చిన చైనా.. సోమవారం భారత సైనికులతో ఘర్షణకు దిగింది. ఈ ఘటనలో 20 మంది భారతీయ సైనికులు అమరులైనట్లు ఆర్మీ ప్రకటించింది.(చదవండి : వారి త్యాగానికి దేశం గర్విస్తోంది: మోదీ) -
‘అవన్నీ సరే... ఆ యాప్‌లను బ్యాన్ చేయండి’
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో చైనా యాప్‌లను, ఇ- కామర్స్ యాప్‌లను, చైనీస్ టెలికాం ఎక్విప్మెంట్ను వెంటనే నిషేధించాలని కోరుతూ స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్జేఎం) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానైనా సహకరించే దేశాలకు ఆర్థికంగా లబ్ది చేకూర్చడం సబబు కాదని లేఖలో పేర్కొంది. ఈ విషయంలో ప్రతీ భారతీయుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించి స్వచ్ఛందంగా చైనా యాప్‌లను విడనాడాలని పిలుపునిచ్చింది. వాటిని స్వాగతిస్తున్నాం.. ‘పాకిస్తాన్‌కు మోస్ట్ ఫేవర్డ్ స్టేటస్‌ను భారత ప్రభుత్వం ఉపసంహరించుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాం. పాక్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్ డ్యూటీని పెంచడం ద్వారా సరైన నిర్ణయమే తీసుకున్నారు. అదేవిధంగా మనకు తరచుగా హాని కలిగిస్తున్న వ్యక్తిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని వ్యతిరేకిస్తున్న చైనా పట్ల కూడా ఇదే వైఖరి అవలంభించాలి’ అని ఎస్జేఎమ్ కో కన్వీనర్ అశ్వానీ మహాజన్ తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా రక్షణా పరంగా మనకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే చైనా యాప్‌లను తక్షణమే తొలగించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ క్రమంలో 2017, డిసెంబరులో భద్రతా బలగాల అధికారుల ఫోన్లలో ఉన్న 42 రకాల చైనీస్ యాప్‌లను తొలగించాల్సిందిగా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.(జైషే చీఫ్‌పై మారని చైనా తీరు) కాగా పుల్వామా ఉగ్రదాడిని చైనా ఖండించినప్పటికీ.. ఆ దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు ఐరాస భద్రతా మండలిలో మోకాలు అడ్డుతున్న విషయం తెలిసిందే. తద్వారా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు చైనా అండగా నిలుస్తోందన్న విషయం బహిరంగ రహస్యమే. -
మెగా డీల్: నీతి ఆయోగ్ ఓకే..ఆర్ఎస్ఎస్ గుర్రు
సాక్షి, న్యూఢిల్లీ: వాల్‌మార్ట్- ఫ్లిప్‌కార్ట్‌డీల్‌పై నీతి ఆయోగ్ సానుకూలంగా స్పందించింది. 16 బిలియన్ డాలర్ల (రూ 1.05 లక్షల కోట్లు) ఈ ఒప్పందం భారత విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం దేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ప్రకారం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద ఇ-కామర్స్ ఒప్పందం ఇది చాలా సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుందన్నారు. గ్లోబల్ లీడర్ వాల్‌మార్ట్ ఎంట్రీతో చౌక ధరలతో భారతదేశంలో చిన్న వ్యాపారాలకు లబ్ది చేకూరుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ కామర్స్ మార్కెట్లో మెగాడీల్‌గా అభివర్ణిస్తున్న ఈ కొనుగోలుపై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్ ప్రతికూలంగా స్పందించింది. వాల్‌మార్ట్ "బ్యాక్ డోర్ ఎంట్రీ" కోసం ఎఫ్‌డీఐ నియమాలను ఉల్లఘించిందని ఆరోపించారు.జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు సంస్థ కో కన్వీనర్ అశ్వనీ మహాజన్ ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు దెబ్బతింటాయని, చిన్న దుకాణాలను, ఉద్యోగాల కల్పిన అవకాశాన్ని బాగా దెబ్బతీస్తుందంటూ స్వదేశీ జాగరణ మంచ్ ఆందోళన చేపట్టింది. వాల్‌మార్ట్ గో బ్యాక్ అంటూ ప్రదర్శన నిర్వహించింది. వ్యాపారవేత్తలు ఇప్పటికే తమ ఉనికి కోసం పోరాడుతున్నారు, దేశీయ వ్యాపారంలో వాల్‌మార్ట్ ప్రవేశం వారికి మరింత సమస్యలను సృష్టిస్తుందన్నారు. కాగా ఈ డీల్‌తో భారతదేశానికి చాలా మేలు చేస్తుందని వాల్‌మార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డగ్ మెక్‌మిల్లన్ పేర్కొన్నారు. -
చైనా వస్తువుల్ని బహిష్కరించండి
వారణాశి: చైనాలో తయారైన వస్తువుల్ని బహిష్కరించాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్ చేసింది. చైనా నుంచి చౌకైన వస్తువుల దిగుమతి వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కో కన్వీనర్ కశ్మీరీ లాల్ చెప్పారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచాలని డిమాండ్ చేశారు. చైనా వస్తువుల్ని దేశంలో అక్రమంగా అమ్ముతున్నారని ఆరోపించారు. పాకిస్థాన్‌కు చైనా గట్టి మద్దతుదారని, సర్జికల్ దాడుల తర్వాత ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిస్తే చైనా మాత్రం పాక్‌కే అండగా నిలిచిందని చెప్పారు. చైనా వస్తువులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించరాదని కోరారు. చైనా వస్తువులపై పన్నులు పెంచడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని కశ్మీరీ లాల్ చెప్పారు. చైనా 17 బ్రాండ్ల మొబైల్ ఫోన్లను విడుదల చేయడం వల్ల భారత మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తుల తయారీ మార్కెట్‌పై దృష్టిపెంచి ఎగుమతులను ప్రోత్సహిస్తే, ఈ రంగంలో చైనాను భారత్ అధిగమిస్తుందని సూచించారు.